Jubilee Hills By-Election: పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ప్రధాన పార్టీల నేతల గుండెల్లో టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. నెల రోజులుగా నేతలు చేసిన ప్రచారం చూశాక, పార్టీలు ఇచ్చిన హామీలు విన్నాక.. జూబ్లీహిల్స్ ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది.. ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో బైపోల్‌లో.. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ ఎవరికి బర్నింగ్? ఎవరికి టర్నింగ్?
జూబ్లీహిల్స్ జంక్షన్‌లో తెలంగాణ రాజకీయం భవిష్యత్ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ని జూమ్ చేస్తే జూబ్లీహిల్స్ ఒక్కటే కనిపిస్తోంది. మరి.. ఆ ఒక్క సీటు.. రాష్ట్ర రాజకీయాల్లో ఘాటు పెంచుతోంది. తెలంగాణ రాజకీయం భవిష్యత్ ఇప్పుడు జూబ్లీహిల్స్ జంక్షన్‌లో ఉంది. ఈ ఒక్క ఉపఎన్నికే.. ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్‌ని నిర్ణయిస్తుందనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఇలాంటి తరుణంలో జూబ్లీహిల్స్ బైపోల్‌లో.. కాంగ్రెస్ మరోసారి సత్తా చాటుతుందా?
ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం.
అన్ని పార్టీల నాయకులు.. దాదాపు నెల రోజుల పాటు జూబ్లీహిల్స్‌లోనే తిష్ట వేసి మరీ ప్రచారం చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు గురించి ప్రచారం చేశారు. తమని గెలిపిస్తే.. ఇక ముందు ఏం చేస్తామో కూడా చెప్పారు. మొత్తంగా.. జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. సర్వశక్తులూ ఒడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా.. ప్రాణం పెట్టి పనిచేశారు. అయినప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందనేది.. అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉపఎన్నికలో.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే.. ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. వారి అంచనాలు, వ్యూహాలు ఎలా ఉన్నా.. అంతిమంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమనుకుంటున్నారన్నదే ముఖ్యమైన విషయం. అభ్యర్థుల గెలుపోటములు, అన్ని పార్టీల భవిష్యత్ ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంది. ప్రధానంగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ మాత్రం సైలెంట్ ఓటింగ్‌నే నమ్ముకుంది. అయితే.. తెలంగాణ మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. జనం తీర్పు, బైపోల్ ఫలితం ఎలా ఉంటుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
ఉపఎన్నికల్లో ఓట్ల సరళికి తేడా ఉంటుందన్న విశ్లేషకులు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిచింది. ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు పోల్ అయ్యాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అయితే.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోని ఓట్ల సరళికి, ఈ ఉపఎన్నికలో ఓట్ల సరళికి తేడా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో.. అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలు, బీసీ ఓటర్ల మద్దతే కీలకం కానుంది. వారే.. డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్.. బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్ యాదవ్‌ని బరిలో దించింది. బీసీలు, ముస్లిం, మైనారిటీల మద్దతును గట్టిగా ఆశిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం తమ సంప్రదాయ ఓట్ బ్యాంకుతో పాటు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకుంది.
ఓటర్లను రప్పించేలా పోల్ మేనేజ్‌మెంట్ చేయగలరా? లేదా?
బీజేపీ ముస్లింలపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండా.. జూబ్లీహిల్స్‌లో హిందువులందరి మద్దతును బలంగా కోరుకుంటోంది. అంతా.. తమతోనే ఉన్నారని చెబుతోంది. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు.. అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. అయితే.. పోలింగ్ బూత్ వరకు ఓటర్లను రప్పించేలా పోల్ మేనేజ్‌మెంట్ చేయగలరా? లేదా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లని పోలింగ్ సెంటర్లకు రమ్మని బతిమాలాల్సిన పనిలేదు. కానీ.. జూబ్లీహిల్స్‌లో అలా కాదు. బతిమాలినా, బలవంతం చేసినా.. పోలింగ్ సెంటర్ దాకా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లు కొందరే ఉంటారని.. గత ఎన్నికల పోలింగ్ సరళి చెబుతోంది. అందువల్ల.. ఓటర్లను ఒప్పించి, పోలింగ్ బూత్ దాకా రప్పించి.. ఓటు వేసేలా పార్టీలు కన్విన్స్ చేస్తాయా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరణ
ఈ ఉపఎన్నికని.. అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ విజయాన్ని.. తమ సర్కార్ పనితీరుపై ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా చూపాలని భావిస్తోంది. అందుకోసమే.. పీసీసీలోని కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌లోని చోటో, మోటా లీడర్లు, కార్యకర్తలంతా.. ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి.. నవీన్ యాదవ్ కోసం ప్రచారం సాగినన్ని రోజులు రాత్రింబవళ్లు జనంలోనే ఉండి పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో.. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతివ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా.. బీఆర్ఎస్-బీజేపీ మధ్య అనైతిక పొత్తు ఉందని ఆరోపించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగించేందుకు.. కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో.. పార్టీని బలోపేతం చేసి.. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో జెండా పాతాలని చూస్తోంది.
సెంటిమెంట్‌ని గట్టిగా వర్కవుట్ అవుతుందని చూస్తున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉపఎన్నిక వచ్చింది. దాంతో.. బీఆర్ఎస్ మాగంటి సతీమణి సునీతని బరిలోకి దించింది. సెంటిమెంట్‌ని గట్టిగా వాడుకోవాలని చూస్తోంది. అంతేకాదు.. లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఓట్లు తగ్గిన క్రమంలో.. మళ్లీ సిటీలో తమ పట్టుని, స్థిరత్వాతన్ని నిలబెట్టుకునేందుకు.. ఈ ఎన్నికని బీఆర్ఎస్ చాలా సీరియస్‌గా తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్ రావు లాంటి వారితో పాటు మాజీ మంత్రులు, మాజీ, తాజా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా.. జూబ్లీహిల్స్‌లో ముమ్మర ప్రచారం చేశారు. డివిజన్లు, పోలింగ్ బూత్‌ల వారీగా విడిపోయి.. అన్ని ఏరియాలను కవర్ చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల గౌరవాన్ని కాపాడాలని, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కొందరైతే.. ఈ బైపోల్‌లోనూ బీఆర్ఎస్‌దే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల మద్దతు తమకే ఉందని గట్టిగా చెబుతున్నారు.
హైదరాబాద్ లో బలపడేందుకు అవకాశంగా చూస్తున్న బీజేపీ
ఇక.. హైదరాబాద్‌లో బలపడేందుకు.. బీజేపీ ఈ ఉపఎన్నికని ఓ మంచి అవకాశంగా చూస్తోంది. అందుకే.. పార్టీలోని కీలక నేతలతో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి అగ్రనేతలంతా ప్రచారం చేశారు. జాతీయవాదంతో పాటు పట్టణ పాలన అంశాలను ప్రముఖంగా ప్రచారం చేశారు. బీజేపీ నేతలు ఈ ఉపఎన్నికని సవాల్‌గా తీసుకొని పనిచేశారు. పూర్తిగా.. హిందువుల ఓట్లనే నమ్ముకొని ఉన్నారు. తమకు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న పొలిటికల్ ఫైట్‌లో ఓట్లు చీలిపోయి.. తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే.. జూబ్లీహిల్స్ లాంటి తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే నియోజకవర్గంలో.. మరోసారి తక్కు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే పరిస్థితేంటి? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. తక్కువ పోలింగ్ శాతం.. తమ అభ్యర్థులపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన అన్ని ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. జూబ్లీహిల్స్ ఓటర్ల ఆలోచనా ధోరణి మారడంతో.. ఈ ఉపఎన్నికలో ఓటర్లు ఎలాంటి ఈక్వేషన్లకు మొగ్గు చూపుతారన్న దానిపై అన్ని పార్టీల నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇవ్వబోయే తీర్పు.. తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపునకు దారితీస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
జూబ్లీహిల్స్‌లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి? అనే చర్చ సాధారణమే. కానీ.. అక్కడ ఎంత పోలింగ్ నమోదవుతుందనే దానిమీద కూడా బిగ్ డిబేట్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. పోలింగ్ పర్సంటేజ్ 50 శాతం లోపే నమోదవుతోంది. తక్కువ ఓటింగ్ టర్నవుట్.. ఇక్కడి ఫలితాలను ప్రభావితం చేసే మేజర్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. ఈ ఉపఎన్నికకైనా జూబ్లీహిల్స్ ఓటర్లు పొలోమంటూ పోలింగ్ కేంద్రానికి వస్తారా? మొత్తం రాష్ట్ర రాజకీయాన్నే మార్చే నిర్ణయం తీసుకుంటారా?
జూబ్లీహిల్స్‌లో ఈసారి భారీ పోలింగ్ నమోదవుతుందా?
అభ్యర్థుల గెలుపోటములను, పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. జూబ్లీహిల్స్‌లో ఈసారి భారీ పోలింగ్ నమోదవుతుందా? ఎప్పటిలాగే 50 శాతం లోపే ఆగిపోతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వచ్చి, ఓ పది నిమిషాలు క్యూలో నిల్చొని.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. పోలింగ్‌ని లైట్ తీసుకొని రిలాక్స్ అవుతారా? అన్నదానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయ్. ఎందుకంటే.. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ 50 శాతం మార్క్‌ని దాటలేదు. జూబ్లీహిల్స్‌లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ బైపోల్‌లోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఎంత చర్చ నడుస్తుందో.. పోలింగ్ శాతం పెరుగుతుందా? లేదా? అనే దానిమీద కూడా అంతే డిబేట్ నడుస్తోంది.
తక్కువ పోలింగ్ ప్రజాస్వామ్య స్పూర్తికి మంచిది కాదు!
జూబ్లీహిల్స్ లాంటి అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో.. తక్కువ పోలింగ్ నమోదవడం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఎందుకంటే.. ఓటు మన హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా. ప్రశ్నించడానికైనా, ప్రాంత ప్రగతికైనా.. ఓటే ఆయుధం. ఏ ఎన్నిక జరిగితే నాకేంటి? ఎంతో కొంత మంది వేస్తున్నారుగా? నేనొక్కడిని ఓటు వేయకపోతే.. ఏమవుతుందిలే అనే ఆలోచన, నిర్లక్ష్య ధోరణి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం! ఇలా ఆలోచిస్తే.. పోలింగ్ శాతం తగ్గిపోతోంది. తక్కువ మార్జిన్‌తో.. ఫలితం మారిపోతోంది. అప్పుడు.. మీరు అనుకున్న నాయకుడికి బదులుగా.. మరొకరు గెలిచే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన నాయకుడు గానీ, పార్టీ గానీ గెలుపొందాలంటే.. మీరు కచ్చితంగా గడప దాటి వెళ్లి ఓటు వేయాల్సిందే! నేను కాకపోతే మరొకరు వేస్తారులే అని ఇంట్లో కూర్చుంటే.. వాళ్లు కూడా మీలాగే ఆలోచించి ఇంట్లోనే ఉండిపోతే.. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎప్పటికీ పెరగదు. ఇది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే.
ఓటు హక్కు వినియోగించుకుంటున్న అక్షరాస్యత లేని వాళ్లు
ముఖ్యంగా.. జూబ్లీహిల్స్ లాంటి విద్యావంతులు, ధనవంతులు, పేద, మధ్యతరగతి ప్రజలు కలబోతగా ఉన్న నియోజకవర్గంలో.. 50 శాతం పోలింగ్ కూడా నమోదవకపోవడం ఆందోళనకరం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ.. సరైన అక్షరాస్యత లేని వాళ్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ.. ఉన్నత చదువులు చదివి, సిటీలో ఉంటూ.. ఓటు హక్కు వినియోగించుకోకపోవడమేంటి? చివరికి.. బీహార్ ఓటర్లు కూడా.. పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. మరి.. జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏమైంది? పోనీ.. పోలింగ్ కేంద్రాలేమైనా పదుల కిలోమీటర్ల దూరంలో ఉంటాయా? అంటే అదీ లేదు. అందరికీ.. దగ్గర్లోనే ఉంటాయ్. లైన్‌లో ఓ పది నిమిషాలు నిల్చుంటే సరిపోతుంది. మహా అయితే.. అరగంట. అంతకుమించి పోలింగ్ సెంటర్‌లో వేచి ఉండే పరిస్థితే లేదు. అయినప్పటికీ.. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం పెరగడం లేదు. మారుమూల ప్రాంతాల ప్రజలని చూసైనా.. మేల్కోవాలనే సూచనలు వినిపిస్తున్నాయ్.
Also Read: బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..
ఓటు హక్కు.. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక బాధ్యత మాత్రమే కాదు. మన భవిష్యత్తుని నిర్ణయించే.. విలువైన అధికారం. ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోకపోతే.. ప్రశ్నించే నైతిక హక్కుని కోల్పోతాం. పోలింగ్‌లో పాల్గొనే ప్రతి పౌరుడికి.. ఎన్నికల తర్వాత తమ నాయకుడిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లభిస్తుంది. ఎవరికైనా ఓటు వేసుకోండి.. మీకు నచ్చిన అభ్యర్థికే ఓటేయండి. కానీ.. ఓటు మాత్రం వేయండి. ఓటరుగా అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు, అధికారం కట్టబెట్టినప్పుడు, పాలనలో లోపాలు కనిపిస్తే.. నిలదీసే హక్కు దక్కుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలారా వింటున్నారా? పోలింగ్ డే రోజున.. ఇంటి నుంచి కదలండి. ఆనవాయితీగా మారిన లో ఓటింగ్ మచ్చని చెరిపేయండి. ఈసారైనా చరిత్రని మార్చండి. మీ ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకండి. మీ ఒక్క ఓటే.. తీర్పుని మార్చొచ్చు. పోలింగ్ సెంటర్‌లో మీరు తీసుకునే నిర్ణయమే.. సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నియోజకవర్గ భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.
Story By Anup, Bigtv