Supreme Court: ఇట్స్ క్లియర్.! ఆఖరికి.. ఈ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా క్లారిటీగా చెప్పేసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు.. బిల్లుల విషయంలో ఎలాంటి గడువు విధించలేమని.. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. బిల్లులపై 3 నెలల డెడ్‌లైన్ విధించిన తీర్పుపై.. సుప్రీం ఇచ్చిన తీర్పు ఇండియా అంతటా హెడ్‌లైన్‌గా మారింది. ఈ విషయంలో కోర్టులో జరిగిన వాదనలేంటి? ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై ఇచ్చిన ఫైనల్ జడ్జ్‌మెంట్ ఏంటి?
రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవని.. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. గవర్నర్లు బిల్లులు సుదీర్ఘకాలం ఆమోదించకుంటే.. రాజ్యాంగ కోర్టులకు న్యాయసమీక్ష అధికారం ఉంటుందని తెలిపింది. తాము.. గవర్నర్‌కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలమని చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించడంపై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలపై.. అత్యున్నత న్యాయస్థానం సమాధానమిచ్చింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించడం తగదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే.. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరనే విషయం కూడా గుర్తుచేసింది. ఈ మేరకు ఇదే అంశంలో.. గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఇచ్చిన తీర్పుని.. సీజేఐ ధర్మాసనం పక్కనపెట్టేసింది.
బిల్లుల ఆమోదం విషయంలో.. గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. ఒకటి.. అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలపడం. మరొకటి.. తగిన కారణం చెప్పిన బిల్లుని రిజర్వ్‌లో పెట్టడం గానీ, రాష్ట్రపతికి పంపడం గానీ చేయాల్సి ఉంటుంది. మూడో ఆప్షన్‌గా.. బిల్లుని తిరస్కరించి.. తిరిగి అసెంబ్లీకి పంపాల్సి ఉంటుంది. ఈ 3 మార్గాల్లో దేనిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో.. గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారు. ఇందుకు న్యాయస్థానాలు గడువు విధించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో.. కోర్టులు జోక్యం చేసుకోవని తెలిపింది. కానీ.. బిల్లులను రివ్యూకు పంపకపోవడం ఫెడరల్ స్ఫూర్థికి విరుద్ధమని.. నాలుగో అధికారం గవర్నర్లకు ఉండదని కోర్టు చెప్పింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణ అధికారం అంటే.. బిల్లును తిరిగి వెనక్కి పంపడం గానీ, రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం మాత్రమేనని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
నిరవధిక ఆలస్యం జరిగితే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
గవర్నర్ బిల్లును రిజర్వ్ చేసిన ప్రతిసారీ.. రాష్ట్రపతి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. బిల్లులో స్పష్టత లేకుంటే, సలహా అవసరమని భావించినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలంది. ఆర్టికల్ 200 కింద.. గవర్నర్ అనుమతి లేకుండా అసెంబ్లీ రూపొందించిన చట్టం అమల్లోకి రాదు. ఆర్టికల్ 200 కింద గవర్నర్, శాసనసభ పాత్రలను మరొక రాజ్యాంగ వ్యవస్థ భర్తీ చేయదని తెలిపింది సుప్రీం ధర్మాసనం. బిల్లుల ఆమోదంపై రాజ్యాంగంలో ఎలాంటి కాలపరిమితి లేదు. ఆర్టికల్ 200 కింద అధికారాలను వినియోగించడానికి కాలపరిమితి నిర్దేశించడం సరికాదని.. చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో సమతుల్యత కోసమే.. ఆర్టికల్ 200, 201 ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉన్నప్పటికీ.. దానిని అపరిమితంగా వినియోగించలేరంది.
అసెంబ్లీ బిల్లులను కొన్ని రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెడుతుండటం.. దేశరాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్లకు 3 నెలల గడువు విధించి.. ఆలోపు ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని.. లేనిపక్షంలో ఆమోదించినట్లేనని.. ద్విసభ్య ధర్మాసనం నిర్దేశించింది. గవర్నర్ విషయంలోనే కాదు.. రాష్ట్రపతి విషయంలోనూ ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై.. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిఫరెన్స్ కోరారు.
రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద అధికారాలపై ఆరా తీస్తూ.. సుప్రీంకు 14 ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదనొచ్చా? అని ప్రశ్నించారు. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. గవర్నర్లు, రాష్ట్రపతికి కోర్టులు గడువు నిర్దేశించలేవని కీలక తీర్పు వెలువరించింది. అయితే.. న్యాయ వ్యవస్థ రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదని.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవడం తమ పరిధి అతిక్రమించడమేనని కేంద్రం వాదించింది. మరోవైపు.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు సరైందేనని.. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు సమర్థించాయి.
భారత్.. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసిన చట్టాలకు.. పూర్తి స్థాయి గౌరవం దక్కడం లేదనే అభిప్రాయం.. మెజారిటీ దేశ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా.. గవర్నర్లు తమ దగ్గరే అట్టిపెట్టుకోవడమేంటి? ప్రజాస్వామ్య దేశంలో ఈ ధోరణి సరైందేనా? అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందనే వాదనలు కూడా ఉన్నాయ్. రాజకీయంలో పడి.. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందా? ఈ ధోరణిని మార్చాలంటే.. రాజ్యాంగ సవరణే ఏకైక మార్గమా?
ఎస్.. సుప్రీంకోర్టు తీర్పు విన్నాక.. రాజ్యాంగంలో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్ల విచక్షణాధికారం గురించి తెలిశాక.. దేశంలో నడుస్తున్న చర్చ ఇదే! ప్రజాస్వామ్య దేశంలో.. ప్రజలే అంతిమ నిర్ణేతలు. అలాంటి.. ప్రజలు ఎన్నుకున్నవే ప్రభుత్వాలు. మరి.. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులని.. రాష్ట్రపతి అయినా, గవర్నర్లు అయినా ఆమోదించకుండా, తిరస్కరించకుండా, కారణమేంటో చెప్పకుండా.. తమ దగ్గరే అట్టి పెట్టుకోవడం కరెక్ట్ కాదనేదే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే అభిప్రాయం బలంగా ఉంది. ఇది కేవలం ఓ రాష్ట్రానికో, ఓ పార్టీకో సంబంధించిన విషయం కాదు.
దేశంలో సమాఖ్య వ్యవస్థ పనితీరుకు, ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన అంశం. అందుకే.. ఇంత చర్చ జరుగుతోంది. బిల్లుల ఆమోదం విషయంలో.. రాష్ట్రపతి, గవర్నర్లకు ఎలాంటి కాలపరిమితి లేకపోవడం మీదే.. ఇప్పుడు అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. ఎందుకంటే.. గవర్నర్లను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అలాంటప్పుడు.. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం ఆమోదించిన బిల్లులపై.. తమ నిర్ణయం చెప్పకుండా గవర్నర్లు తొక్కిపెట్టడమేంటి? అనేదే ఇప్పుడు వినిపిస్తున్న బిగ్ క్వశ్చన్. ఇది.. కచ్చితంగా నియంతృత్వ ధోరణిని తలపిస్తోందనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.
రాష్ట్రాల్లో ప్రభుత్వాలని ఎన్నుకునేది ప్రజలు. ఆ ప్రభుత్వాలు.. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ప్రజల ఆకాంక్షలకు, ఎన్నికల హామీలకు అద్దం పడతాయ్. రాజ్యాంగపరంగా.. గవర్నర్ రాష్ట్రానికి అధిపతి కావొచ్చు. కానీ.. ఆయన పాత్ర లాంఛనప్రాయమైనది. అందువల్ల.. బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడమనేది.. అసెంబ్లీ అధికారాన్ని, ప్రజాస్వామ్య తీర్పుని అగౌరవపరచడమే అవుతుందని భావిస్తున్నారు. ఎన్నోసార్లు గవర్నర్‌ని.. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా రాష్ట్రాలు భావిస్తున్నాయ్. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు.. ఈ వైరుధ్యం మరింత తీవ్రమవుతోంది. బిల్లును ఆమోదించకుండా, తిరస్కరించకుండా గవర్నర్ ఎంతకాలం తన దగ్గర ఉంచుకోవాలనే దానిపై రాజ్యాంగంలో నిర్దిష్ట కాలపరిమితి లేదు. దీనినే.. కొందరు గవర్నర్లు ఉపయోగించుకుంటున్నారనేది విమర్శలకు దారితీస్తోంది.
రాష్ట్రాల గవర్నర్లను నియమించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఇప్పుడు ఎన్డీయే ఉండొచ్చు. తర్వాత యూపీఏ రావొచ్చు. ఈ రెండు కాకపోతే.. మరో ఫ్రంట్ గానీ, ఇంకొక అలయన్స్ గానీ అధికారం చేపట్టొచ్చు. అయితే.. ఎవరొచ్చినా.. రాష్ట్రాల్లో తమకు అనుకూల ప్రభుత్వం లేకపోతే.. బిల్లులు ఆమోదం పొందకుండా.. తాము నియమించిన గవర్నర్ల ద్వారా బిల్లులు ఆమోదం పొందకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఇది.. అందరికీ తెలిసిందే! దేశంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే! అలాంటప్పుడు.. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమై ఉండటం వల్ల.. ఉపయోగమేంటి? దశాబ్దాలుగా ఇదే ధోరణి కొనసాగుతూ ఉంటే.. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాలకు అర్థముంటుందా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలదే అధికారం అనే మాటలన్నీ.. చెప్పుకోవడానికి తప్ప, ఆచరణలో సాధ్యం కాదనే విషయం అర్థమవుతోంది కదా! అందుకోసమే.. తమిళనాడు లాంటి రాష్ట్రాలు బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లకు నిర్దిష్టమైన గడువు ఉండి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తలుపు తట్టాయ్.
భారత రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రపతి, గవర్నర్లు రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తారు. వారికి.. రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాలున్నాయ్. అందువల్ల.. ఈ అంశంలో కోర్టులు కూడా తమ పరిధి మేరకే జోక్యం చేసుకుంటాయ్. ఎందుకంటే.. న్యాయస్థానాలు కూడా భారత రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయ్. అందువల్ల.. కేవలం రాజ్యాంగ సవరణ మాత్రమే దీనికి శాశ్వత పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. అప్పుడు మాత్రమే.. రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా.. బిల్లుల విషయంలో తమ వైఖరి త్వరగా చెప్పకుండా తొక్కిపెట్టేందుకు వీలు లేకుండా పోతుంది.
Also Read: నెల్లూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 20 మంది
రాజ్యాంగంలో కాలపరిమితి గురించి స్పష్టమైన నిబంధన ఉంటే.. నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా తమ నిర్ణయమేంటో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికైనా.. ఈ ప్రజాస్వామ్యానికైనా.. తగిన గౌరవం దక్కుతుంది. కానీ.. కేంద్రంలో ఉండే ఏ ప్రభుత్వమైనా.. రాష్ట్రపతి, గవర్నర్ల గడువు అంశంలో రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉందా? అంటే.. అదొక ఆన్సర్ లేని క్వశ్చన్‌గానే మిగిలిపోతోంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. ఈ విషయంలో చొరవ తీసుకోరు. రాజ్యాంగ సవరణ చేయరు అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. అప్పుడు తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలపై.. కేంద్రం అజమాయిషీ తగ్గుతుంది. రాజకీయంగా పట్టు సడలుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. జాతీయ స్థాయి రాజకీయానికి పెద్దగా స్కోప్ ఉండదు. అందుకోసమే.. ఈ విషయంలో ఏ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే పరిస్థితులు లేవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
Story By Anup, Bigtv