E-Paper
Advertisement

Indian Army: ఇండియన్ ఆర్మీలోకి అమెరికా మిసైల్లు, రష్మా ఫైటర్ జెట్లు.. ఇక పాక్, చైనా వణకాల్సిందే..

Indian Army: ఇండియన్ ఆర్మీలోకి అమెరికా మిసైల్లు, రష్మా ఫైటర్ జెట్లు.. ఇక పాక్, చైనా వణకాల్సిందే..
Advertisement

Indian Army: అమెరికా నుంచి జావెలిన్ మిసైల్స్ రాబోతున్నాయ్. రష్యా.. కండీషన్లేవీ పెట్టకుండా సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీ ఇచ్చేస్తానని చెప్పేసింది. మన శత్రుదేశాలతో పోలిస్తే.. ఇప్పటికే.. మిసైళ్లు, ఫైటర్ జెట్ల విషయంలో ఎంతో బలంగా ఉన్న భారత్.. ఇప్పుడు మరింత శత్రుదుర్భేద్యంగా మారబోతోంది. అమెరికా, రష్యా నుంచి వచ్చే ఆయుధాలతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లెక్కే మారిపోనుంది. అప్పుడు.. పొరుగు దేశాలకు భారత్‌పై దాడి చేయాలన్న ఆలోచన రావాలంటేనే.. ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయ్. అమెరికా మిసైళ్లు, రష్యా ఫైటర్ జెట్ టెక్నాలజీ మనచేతికి అందితే.. ఇండియా ఇంకెంత శత్రుదుర్భేద్యంగా మారుతుంది?

వార్ గ్రౌండ్‌లోకి దిగితే.. దేని లెక్క దానిదే! దేని విధ్వసం దానిదే! ఇక్కడ ఫైర్ చేస్తే.. నేరుగా వెళ్లి శత్రుసేనల గుండెల్లో పేలతాయ్. అలాంటి ఆయుధాలు.. ఇంకొన్ని రోజుల్లో భారత అమ్ములపొదిలో చేరనున్నాయ్. ఈ మేరకు.. భారత్-అమెరికా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌లో భాగంగా.. 93 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా ఓకే చెప్పింది. దాంతో.. అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ.. భారత్ చేతికి అందనుంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కి.. దేవదూతలా వచ్చిన ఈ ఆయుధానికి.. ఈ గ్లోబ్ వైడ్‌ విపరీతమైన ఆదరణ ఉంది. ఉక్రెయిన్‌ సైనికులు తమ భుజం మీద నుంచి రష్యా వైపు గురిపెట్టి ప్రయోగిస్తే.. కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను పేల్చేసింది ఈ జావెలెన్ మిసైల్. దీనిలో.. అలాంటిలాంటి ఫీచర్లు లేవు. ఇది.. సాధారణ మిసైల్ కానే కాదు.

Advertisement

జావెలిన్.. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌. యుద్ధ ట్యాంకులను పేల్చేందుకు వాడతారు. దీనిని వాడటం చాలా సింపుల్. భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించొచ్చు. దీనిలో.. 3.7 అడుగుల మిసైల్, డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. నిజానికి.. ఇలాంటి ఆయుధాలను ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వస్తాయ్. శత్రువులు.. హీట్ సెన్సార్లతో వాటిని గుర్తిస్తారు. కానీ.. జావెలిన్‌లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ మిసైల్‌ని బయటకు కొంతదూరం విసురుతుంది. ఆ తర్వాత.. మిసైల్ మోటార్ ఆన్ అయి.. టార్గెట్ వైపు దూసుకెళ్తుంది. దీనిని.. కంప్యూటర్‌తో కంట్రోల్ చేస్తారు. అందువల్ల.. కచ్చితంగా జావెలిన్‌ని ఎక్కడి నుంచి ప్రయోగించారో.. శత్రువుకు అస్సలు అర్థం కాదు. ఈ లోపు.. ఈ మిసైల్ ఫైర్ చేసిన వారు సురక్షిత ప్రదేశంలో దాక్కునేందుకు వీలుంటుంది.

రీయాక్టివ్‌ ఆర్మర్‌ రక్షణ కవచాలను ఛేదించి.. యుద్ధ ట్యాంకును ధ్వంసం చేసేలా జావెలిన్‌లో రెండు దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలిదశలో కవచాన్ని ఛేదించి.. ఆ తర్వాతి దశలో వార్‌హెడ్‌ ట్యాంక్‌ని ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణరంగ దిగ్గజాలు రేథియాన్‌, లాక్‌హీడ్‌ మార్టీన్‌ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. వీటి ధర 2 లక్షల డాలర్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రష్యాతో పోరులో.. ఉక్రెయిన్‌ ఈ మిసైళ్లని విపరీతంగా వినియోగించింది. మాస్కోకు చెందిన అనేక యుద్ధ ట్యాంకులను పేల్చేసింది. వీటి నుంచి తప్పించుకునేందుకు.. రష్యా తమ ట్యాంకులపై ఐరన్ బోన్లను అమర్చిందంటే.. వీటి కెపాసిటీ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో.. ఈ క్షిపణులను ఉక్రెయిన్‌ వాసులు దేవదూతతో పోల్చారు. అలాంటి మిసైళ్లని.. భారత్‌కు ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. ఈ మేరకు.. 93 మిలియన్ డాలర్ల ఆయుధాలను అమ్మేందుకు రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇందులో దాదాపు 46 మిలియన్ డాలర్ల విలువైన జావెలిన్ మిసైల్ సిస్టమ్స్, దానికి సంబంధించిన హార్డ్‌వేర్‌ని అగ్రరాజ్యం అందించనుంది. దీంతోపాటు 47 మిలియన్ డాలర్ల విలువైన ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్, ఇతర సైనిక పరికరాలను విక్రయించనుంది అమెరికా. మొదటి విడతలో జావెలిన్ FGM-148 మిసైల్స్, 25 జావెలిన్‌ లైట్‌వెయిట్‌ కమాండ్‌ లాంఛ్‌ యూనిట్స్‌‌.. త్వరలోనే భారత్‌కు అందనున్నాయి.

Advertisement

మరోవైపు.. భారత్-రష్యా మధ్య బంధం మరింత బలపడుతోంది. ఈ మేరకు.. రక్షణ రంగంలో రష్యా.. ఇండియాకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అమెరికా ఎఫ్-35కి పోటీగా భావించే.. సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ జెట్లని.. ఇండియాకు ఇచ్చేందుకు మాస్కో ముందుకొచ్చింది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌తో సహా భారత్‌కు ఇవ్వడానికి రష్యా సిద్ధమైంది. పుతిన్.. ఇండియా టూర్‌లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య అనేక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ రంగం విషయంలో ఇండియా.. మాస్కోని నమ్మకమైన మిత్రుడిగా భావిస్తోంది. ఈ క్రమంలోనే.. ఎలాంటి షరతులు లేకుండా సుఖోయ్-57 యుద్ధ విమానాల టెక్నాలజీని మార్పిడి చేసేందుకు సిద్ధమని.. రష్యన్ కంపెనీ రోస్టెక్ సీఈవో సెర్గీ చెమెజోవ్.. దుబాయ్ ఎయిర్ షోలో ప్రకటించారు.

ప్రస్తుతం.. ప్రపంచంలో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీ కేవలం రష్యా, అమెరికా, చైనా దగ్గర మాత్రమే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా.. యూఎస్ ఎఫ్-35 జెట్స్‌ని భారత్‌కు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. రష్యా కంపెనీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఎలాంటి కండీషన్లు లేకుండా పూర్తిస్థాయి టెక్నాలజీ బదిలీతో పాటు.. ఇండియాలోనే సుఖోయ్-57 జెట్లని తయారుచేసేందుకు.. రష్యా ముందుకొచ్చింది. అంతేకాదు.. భారత్.. రష్యా నుంచి మరిన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. 10 వేల కోట్ల విలువైన మిసైళ్లని కొనుగోలు చేసేందుకు కూడా ఇండియా సిద్ధమవుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. పాకిస్థాన్ ఫైటర్ జెట్స్, మిసైళ్లని అడ్డుకోవడంలో.. ఎస్-400 సిస్టమ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. అందుకోసమే.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మేరకు.. వచ్చే నెలలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన టూర్‌లోనే.. రెండు దేశాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

ఆల్రెడీ ఇండియా దగ్గర.. రఫేల్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయ్. బ్రహ్మోస్ లాంటి అధునాతని మిసైళ్లు ఉన్నాయ్. అయినాసరే.. అమెరికా నుంచి జావెలిన్ మిసైళ్లని భారత్ ఎందుకు కొంటోంది. రష్యా నుంచి సుఖోయ్-57 ఫైటర్ కొనాల్సిన అవసరం ఏముంది? ఇవి కూడా భారత అమ్ములపొదిలో చేరితే.. అటు పాక్ గానీ, ఇటు చైనా గానీ.. ఇండియా వైపు చూడాలంటే.. వణికిపోతాయా? ఆపరేషన్ సిందూర్ తర్వాత.. అడ్వాన్స్‌డ్ వెపన్స్ అవసరం భారత్‌కి ఎంతుంది?

అమెరికా.. జావెలిన్ మిసైల్ సిస్టమ్స్ విక్రయించేందుకు ముందుకొచ్చింది. రష్యా కూడా ఐదో తరం సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌కి సంబంధించిన పూర్తి టెక్నాలజీని బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఇంతటి ఉన్నత స్థాయి డిఫెన్స్ టెక్నాలజీని.. ఇండియాకు అందించడానికి ముందుకు రాలేదు. కానీ.. రష్యా ఆ పని చేస్తోంది.
తొలుత రష్యాలో తయారైన సుఖోయ్-57 ఫైటర్లను భారత్‌కు సప్లై చేయనున్నారు. తర్వాత దశలవారీగా వాటి ఉత్పత్తిని పూర్తిగా భారత్‌కు తరలిస్తారు. అంతేకాదు.. సింగిల్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అయిన సుఖోయ్-75 చెక్‌మేట్‌ని కూడా.. భారత్‌కు ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజిన్లు, సెన్సార్లు, ఏఈఎస్ఏ రాడార్, ఏఐ టెక్నాలజీ, స్టెల్త్ మెటీరియల్స్ లాంటి.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తామని రష్యా స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాలు నిరాకరిస్తున్న కీలక టెక్నాలజీని రష్యా ఆఫర్ చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్ దగ్గర ఇప్పటికే రఫేల్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్, బ్రహ్మోస్ వంటి శక్తిమంతమైన క్షిపణులున్నాయ్. అయినప్పటికీ.. అమెరికా నుంచి జావెలిన్ లాంటి యాంటీ-ట్యాంక్ మిసైళ్లు, రష్యా నుంచి సుఖోయ్-57 ఫైటర్ జెట్‌ల కొనుగోలుపై దృష్టి సారించడం వెనుక.. బలమైన వ్యూహాత్మక అవసరాలున్నాయ్. దేశ భద్రతను, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర ఎదురవుతున్న సవాళ్లను చూస్తే.. ఈ రక్షణ ఒప్పందంగా కీలకంగా మారనున్నాయ్. భారత్ దగ్గర ఇప్పటికే.. స్వదేశీ నాగ్, రష్యా నుంచి కొన్న యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉన్నాయ్. అయినా.. అమెరికా నుంచి జావెలిన్ కొనుగోలు చేయడానికి కొన్ని కారణాలున్నాయ్. ఇది. ఫైర్ అండ్ ఫర్‌గెట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మిసైల్ ఫైర్ చేశాక.. ఆపరేటర్ టార్గెట్‌ని ట్రాక్ చేయాల్సిన పనిలేదు. మిసైల్‌లోని ఇన్‌ఫ్రారెడ్ సీకర్ తనంతట తానుగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది.. ఆపరేటర్ భద్రతని పెంచుతుంది. పైగా.. జావెలిన్.. రక్షణ కవచం తక్కువగా ఉండే.. యుద్ధ ట్యాంక్ పైభాగాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంది. అందువల్ల.. ట్యాంకుల విధ్వంసానికి జావెలిన్ లాంటి మిసైళ్లు ఎంతో అవసరం. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో, సరిహద్దుల దగ్గర చైనా భారీగా ట్యాంకులను మోహరిస్తున్న క్రమంలో.. అత్యంత కచ్చితత్వంతో కూడిన జావెలిన్ లాంటి తేలికపాటి క్షిపణులు సైన్యానికి ఎంతో అవసరం.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర ఇప్పటికే రఫేల్ లాంటి 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నా.. భవిష్యత్ యుద్ధాలకు ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్స్ కచ్చితంగా కావాల్సిందే. సుఖోయ్-57 రష్యాకి చెందిన ఐదో తరం స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ జెట్. స్టెల్త్ టెక్నాలజీ అంటే.. శత్రు రాడార్లకు చిక్కకుండా దాడి చేసే కెపాసిటీ. చైనా దగ్గర ఇప్పటికే.. జే20 లాంటి ఐదో తరం ఫైటర్ జెట్స్ ఉన్నాయి. దీనికి దీటుగా భారత్ దగ్గర కూడా ఐదో తరం ఫైటర్ జెట్స్ ఉండాలి. ఇప్పుడు రష్యా సుఖోయ్-57 టెక్నాలజీని, సోర్స్‌ కోడ్‌ని ఇండియాకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఆఫర్ చేస్తోంది. ఇది.. భారత్ తన సొంత ఐదో తరం ఫైటర్ జెట్ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. భారత్ సొంతంగా.. సుఖోయ్-57 లాంటి అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారుచేసుకునేందుకు.. మరో పదేళ్లు పడుతుంది. ఈ లోపు.. చైనా, పాకిస్థాన్‌కు దీటుగా బదులిచ్చేందుకు.. సుఖోయ్-57 కొనుగోలు అత్యంత శక్తిమంతమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది. భారత అమ్ములపొదిలో ఈ కొత్త వెపన్స్ చేరితే.. అటు పాకిస్థాన్, ఇటు చైనా వ్యూహాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

Also Read: బిల్లుల విషయంలో.. రాష్ట్రపతి, గవర్నర్ల హక్కుపై సుప్రీం కీలక తీర్పు..

ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్ సరిహద్దుల్లో ఎప్పుడెలాంటి ఉద్రిక్తతలు చెలరేగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందువల్ల.. అధునాతన ఆయుధాల అవసరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయాల్సి ఉంటుంది. వాటికి.. అడ్వాన్స్‌డ్ వెపన్స్ కచ్చితంగా కావాలి. అంతేకాదు.. సరికొత్త ఆయుధాలు కలిగి ఉండటం అనేది.. కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే కాదు. యుద్ధాన్ని నివారించడానికి కూడా ఉపయోగపడతాయ్. భారత్ దగ్గర ఈ అత్యాధునిక అస్త్రాలు ఉంటే.. శత్రు దేశాలు దాడికి దిగడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయ్. ఆధునిక యుద్ధాల్లో.. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, స్టెల్త్ టెక్నాలజీ, లాంగ్-రేంజ్ ప్రెసిషన్ వెపన్స్ అవసరం. కేవలం రఫేల్, బ్రహ్మోస్‌లు మాత్రమే కాక.. అన్ని రకాల ముప్పులను ఎదుర్కొనేందుకు వీలుగా సైనిక సామర్థ్యాలను పెంచుకోవడం తప్పనిసరి. ఇది.. కేవలం రక్షణ బలాన్ని పెంచుకోవడమే కాకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి, ప్రాంతీయ సమతుల్యతని కాపాడటానికి ఓ ముందడుగని చెప్పొచ్చు. అమెరికా జావెలిన్ మిసైల్ సిస్టమ్, రష్యా సుఖోయ్-57 ఫైటర్ జెట్స్ భారత అమ్ములపొదిలో చేరితే.. మన దేశ సైనిక శక్తి మరింత బలోపేతం అవుతుంది. పొరుగు దేశాలు సరిహద్దుల్లో ఏమైనా తోకజాడిస్తే.. వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు అవసరమవుతుంది.

Story By Anup, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×