Supreme Court on Dogs: వీధి కుక్కల కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాటిని శిబిరాలకు తరలించడంపై తీసుకున్న చర్యలను తెలియజేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. దీనిపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. స్పందించని వివిధ రాష్ట్రా చీఫ్ సెక్రటరీలు తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
వీధి కుక్కల వ్యవహారం
వీధి కుక్కలకు స్టెరిలైజేషన్‌పై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వీధి కుక్కల దాడులపై ప్రతీరోజూ వార్తలు వస్తున్నా మీలో చలనం లేదా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఆగస్టు 22న ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని మండిపడింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు స్పందించని ప్రభుత్వాలపై గరంగరం అయ్యింది.
దేశవ్యాప్తంగా వీధి కుక్కల అంశంపై దాఖలైన పలు పిటిషన్లను సోమవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అనేక రాష్ట్రాలు వీధి కుక్కలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. వీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎందుకు నివేదిక దాఖలు చేయలేదని ప్రశ్నించింది.
పలు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోందని రాష్ట్రాల తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. అంతేకాదు వీటి విషయంలో భారత్‌ను చెడుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంది. అధికారులు వార్తాపత్రికలు చదవ లేదా? నివేదికలు సమర్పించని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ మూడున న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది.
శునకాల సమస్య కొన్నిప్రాంతాలకు పరిమితం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఉందని గుర్తు చేసింది. ప్రజల భద్రతకు, పిల్లలు-వృద్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా, ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోవడాన్ని సరికాదని హితవు పలికింది. జంతువుల హక్కులను కాపాడుతూనే, మనుషుల భద్రతకు భరోసా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది.
ALSO READ: విద్యార్థిని మొబైల్ ఫోన్ తనిఖీ.. బుక్కైన ప్రిన్సిపాల్
ఈ విషయంలో పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయి. మిగతా రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఢిల్లీ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ సమాధానం ఇచ్చిందని, ప్రభుత్వం నుంచి అఫిడవిట్ రాలేదని తెలిపింది.
వీధి కుక్కల దాడులతో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరగడంపై వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకుంది సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం. రెండునెలల్లోగా వీటిని షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే అభ్యంతరాలు రావడంతో త్రిసభ్య ధర్మాసనం విచారించి ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే.