దీపావళి వచ్చిందంటే చాలు చిన్నారులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. క్రాకర్స్ పేల్చుతూ హ్యాపీగా జాలీగా గడుపుతారు. చిచ్చుబుడ్లు, క్రాకర్ పూలు, పటాకులు కాల్చుతూ ఖుషీ అవుతారు. అయితే, ఈ ఏడాది దీపావళి ఎంతో మంది పిల్లల పాలిట శాపంగా మారింది. కార్బైడ్ గన్ తో ఆడుతూ పలువురు కంటిచూపు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఆ రాష్ట్రం అంతటా 122 మందికి పైగా పిల్లలు తీవ్రమైన కంటి గాయాలతో ఆసుపత్రులలోచేరారు. వారిలో 14 మంది కంటి చూపు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
దీపావళి సందర్భంగా విదిష జిల్లాలో ఎక్కువ మంది గాయపడ్డారు. కార్బైడ్ గన్స్ మీద ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, స్థానిక మార్కెట్లు వీటిని బహిరంగంగా అమ్మారు. రూ. 150 నుంచి రూ. 200 మధ్య ధర ఉన్న ఈ గన్స్ ను తయారు చేసి అమ్ముతున్నారు. కానీ, అవి ఒక్కోసారి బాంబుల మాదిరిగా పేలుతున్నాయి. ఈ గన్స్ కారణంగా పలువురు చిన్నారులు శాశ్వతంగా కంటిచూపు కోల్పోయారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 14 మంది కంటిచూపును కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో గాయపడిన చిన్నారు అంతా హమీడియా ఆసుపత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నారు. కార్బైడ్ గన్ కాల్చుతూ గాయపడిన 17 ఏళ్ల నేహా కీలక విషయాలు వెల్లడించింది. “మేము ఇంట్లో తయారుచేసిన కార్బైడ్ తుపాకీని కొన్నాము. దానితో ఆడుతున్న సమయంలో పేలింది. నా కన్ను పూర్తిగా కాలిపోయింది. నాకు ఏమీ కనిపించడం లేదు” అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. “నేను సోషల్ మీడియాలో వీడియోలు చూశాను. ఇంట్లోనే ఆ గన్ తయారు చేయడానికి ప్రయత్నించాను. అది నా ముఖం మీదే పేలింది. ప్రస్తుతం నేను కంటిచూపును కోల్పోయాను” అని మరో బాధితుడు రాజ్ విశ్వకర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు ఈ కార్బైడ్ గన్స్ అమ్ముతున్న పలువురు వ్యాపారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ తుపాకులను అమ్ముతున్న ఆరుగురిని విదిష పోలీసులు అరెస్టు చేశారు. “కార్బైడ్ గన్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కార్బైడ్ తుపాకులను విక్రయించే వారితో పాటు, వాటిని ఉపయోగించేందుకు ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని ఇన్‌స్పెక్టర్ ఆర్‌కె మిశ్రా వెల్లడించారు.
దీపావళి సందర్భంగా భోపాల్, ఇండోర్, జబల్ పూర్, గ్వాలియర్ లోని ఆసుపత్రుల కంటి వార్డులు పటాసులు కాల్చి గాయపడిన బాధితులతో నిండిపోయాయి. భోపాల్ లోని హమీడియా ఆసుపత్రిలో 72 గంటల్లో 26 మంది పిల్లలు చేరారు. ఈ సందర్భంగా హమీడియా ఆసుపత్రి CMHO డాక్టర్ మనీష్ శర్మ కీలక విషయాలు వెల్లడించారు. “కార్బైడ్ గన్ కళ్ళకు నేరుగా నష్టం కలిగిస్తుంది. పేలుడు వల్ల రెటీనాను కాల్చే లోహ శకలాలు, కార్బైడ్ ఆవిరి విడుదల అవుతాయి. పిల్లల కళ్ళు దెబ్బతిని శాశ్వత అంధత్వానికి కారణం అవుతాయి. ఈ దీపావళి సందర్భంగా చాలా మంది పిల్లలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో పలువురు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. వారిలో చాలా మంది పూర్తి చూపు తిరిగి రాకపోవచ్చు” అని చెప్పుకొచ్చారు.
Read Also: పటాసులు కొనలేనంత పేదరికం.. ఇంట్లోనే బాంబు తయారీ, భారీ పేలుడులో టీనేజర్ దుర్మరణం!