కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రాణాలు పోయాయి. నిద్రపోని వాళ్లలో కొంత మంది బయటపడినా, నిద్రమత్తులో ఉన్న 19 మంది అగ్నికీలల్లో బూడిదైపోయారు. ఈ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఆర్టీఏ అధికారులు ట్రావెల్ బస్సుల మీద ఆకస్మిక దాడులు చేస్తున్నారు. అటు ప్రమాద సమయంలో ప్రాణాలతో ఎలా బయటపడాలో పలు కీలక సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ బస్సు ప్రమాద వ్యవహారంపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. కీలక సూచనలు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బస్సు ప్రయాణం చేసిన ఆయన ఆయా దేశాల్లో బస్సులు బయల్దేరే ముందు ఎలాంటి సూచనలు చేస్తారు? అనే విషయాన్ని వెల్లడించారు. ఆ సూచనలు ప్రయాణీకులను సేఫ్ ఉంచేందుకు ఎలా ఉపయోగపడుతాయో వెల్లడించాడు. ఇంతకీ ఆయన చెప్పిన మూడు ముఖ్యమైన సూచనలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా బ్రెజిల్ 70 గంటల పాటు బస్సు ప్రయాణం చేసిన అన్వేష్.. అక్కడ ప్రయాణీకులు సేఫ్ గా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పారు. ఈ సూచనలను ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పాటించాలన్నారు. వీటిని పక్కాగా అమలు చేస్తే ప్రమాదాల్లో ప్రాణ నష్టం అనేది ఉండదన్నారు.
⦿ ఎమర్జెన్సీ డోర్ గురించి వివరణ: బస్సు ప్రయాణానికి ముందు డ్రైవర్ వచ్చి ప్రయాణీకులకు ఎమర్జెన్సీ డోర్ గురించి అవగాహన కల్పిస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు ఎలా వెళ్లాలో వివరిస్తాడు.
⦿ ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉన్న వారికి సూచన: అటు ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చున్న వారికి డ్రైవర్ ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్తాడు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న సుత్తిని తీసుకుని డోర్ ఎలా పగలగొట్టాలో సూచిస్తాడు.
⦿ బస్సు ఎప్పుడు ఎక్కడ ఆగుతుంది?: ఇక చివరగా బస్సు ఎక్కడ.. ఎంత సేపు ఆగుతుందో వివరిస్తాడు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తాడు.
ఇక బస్సులో అత్యంత ముఖ్యమైన సూచన ఒకటి రాస్తారని అన్వేష్ వివరించాడు. అదే ‘భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత’. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరో ఏదో చేస్తారని వేచి చూడకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఈ విషయాల గురించి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. అవగాహన ద్వారానే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు.
Read Also: కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. ఆ రూట్ లో రైళ్లు పెంచాలని ప్రయాణీకుల డిమాండ్!
Read Also: హైదరాబాద్ TO విజయవాడ.. ఇక ఆ రైల్లో రిజర్వేషన్ లేకుండానే వెళ్లొచ్చు!