Peddi:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్థాయిని అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేసి బొక్క బోర్ల పడ్డారు. అయితే ఆ నష్టాన్ని తిరిగి పూడ్చుకునే దిశగా ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, ఫస్ట్ గ్లింప్స్ , రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టింస్తుంటే.. మరొకవైపు విడుదల తేదీ పై ఏర్పడిన సందిగ్ధత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు విడుదల తేదీ కోసం అభిమానులు ఏ రేంజ్ లో అయితే ఎదురు చూస్తున్నారో అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా అంతే ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు.
వాస్తవానికి మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం సినిమా అనౌన్స్మెంట్ రోజే అధికారికంగా ప్రకటించింది. కానీ సినిమా పర్ఫెక్షన్ కోసం, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ విజువలైజేషన్ ను ప్రేక్షకుడికి అందించడానికి డైరెక్టర్ పడుతున్న తాపత్రయం.. అటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అద్భుతంగా అందించడానికి ఏ.ఆర్.రెహమాన్ తీసుకుంటున్న సమయం కారణంగానే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ మళ్ళీ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూన్ 25వ తేదీన ప్రీమియర్ , జూన్ 26వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నారట.
ఒకవేళ మళ్లీ ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడితే నష్టం తప్పదు అంటూ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీ నాటికి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం అయి ఉంటాయి. పైగా పిల్లలు పెద్దలు చక్కగా సినిమాను చూడడానికి వీలుంటుంది. ఈ సమయంలో సినిమాను విడుదల చేస్తే.. ఒకవేళ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతినిస్తే.. అటు నిర్మాతలతో పాటు ఏరియా వైజ్ సినిమాను విడుదల చేసే డిస్ట్రిబ్యూటర్ల కి కూడా ఆదాయం భారీగా ఉంటుంది. అలా కాదని అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయకుండా జూన్ 26 సినిమాలకు విడుదల చేస్తే గనుక డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం తప్పదు. అసలే స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యే సమయం.. హాలిడేస్ మొత్తం అయిపోతాయి.. అలాంటి సమయంలో థియేటర్ కి వచ్చి సినిమాను చూడడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారా?.. డిస్ట్రిబ్యూషన్ సమయంలో సినిమా థియేటర్ల హక్కులను కొనుగోలు చేసిన డబ్బును తిరిగి పొందుతామా? అనే ఆందోళనలో పడ్డారు డిస్ట్రిబ్యూటర్లు.
ALSO READ:టీవీ యూజర్లకు యూట్యూబ్ బిగ్ షాక్.. ఆడియన్స్ ఒప్పుకుంటారా?
అయితే ఇలాంటి సమయంలో నిర్మాతలు కాస్త సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. అనుకున్న టైంకి విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతుంటే.. అటు దర్శకుడు, సంగీత దర్శకుడు మాత్రం ఇంకా సమయం కావాలని కోరుతున్నారట. ఇలాంటి సమయంలో ఏం చేయాలి అనే గందరగోళ పరిస్థితులు నిర్మాతలలో ఏర్పడినట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి గజిబిజి గందరగోళం క్లియర్ అవ్వాలి అంటే చిత్ర బృందం ఒకే తాటిపైకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.