మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? రాలవు. కానీ మూఢనమ్మకాలకు మాత్రం మూతిపండ్లు రాల్తున్నాయి. చింతచెట్టుకు కట్టి కొడితే మూతి పండ్లు ఊడిపడుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో మూఢ నమ్మకాలకు కూడా ప్రయార్టీ దొరుకుతుంది. క్షుద్రపూజలు చేశారంటూ విమర్శలు గుప్పించడం, బట్టకాల్చి మీదేస్తున్నారని ప్రతిపక్షం తిప్పికొట్టడం..రాజకీయాలను ఆసక్తిగా మార్చాయి. ఈ పరిణామాలను జనం నోరెళ్లబెట్టి చూశారు. ముక్కున వేలేసుకున్నారు.
హరీశ్‌రావు ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి సర్కార్ పడిపోవాలని క్షుద్రపూజలు చేయించాడని కాంగ్రెస్ ఆరోపించింది. వర్షాలు సమృద్దిగా పడొద్దని, రైతులు ఇబ్బందులు పడాలని, సర్కార్‌కు చెడ్డ పేరు రావాలనే ఈ పూజలను హరీశ్ రహస్యంగా చేయించాడని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించడం కలకలం రేపింది.
మంత్రాలకు విరుగుడు.. ఇరగదన్నుడే ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో జనం తగిన శాస్తి చేస్తారని కూడా సీఎం అన్నారు. సీఎం నోటి వెంటే.. మంత్రాలు చేస్తే జనం తంతారు.. అనే మాటలు రావడం చర్చకు తెరలేపింది. క్షుద్రపూజలంటూ పదే పదే ఈ మాటలను సర్కార్ మాట్లాడటం మూలంగా.. మూఢనమ్మకాలను బలపరిచేలా ఉన్నాయనే విధంగా ఓ వాదన జరగగా.. మంత్రాలు చేసే వాళ్లను జనం తంతారు…అని సీఎం ముక్తాయించడం .. వీటిని పెంచి పోషిస్తున్నట్టుగా, దాడులను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నాయనే మరో వాదన కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పుడిదంతా ఎందుకంటే… హైదరాబాద్ నగరానికి సమీపంలోనే.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని నోముల గ్రామంలో వెంకటమ్మ (60) అనే వృద్ధురాలని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఘటన జరిగిన తరువాత ఐదు రోజులకు వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. అప్పటి వరకు బాధితురాలు కూడా దీన్ని బయటపెట్టలేదు. బహుశా చంపేస్తామని ఆ గ్రామస్తులు భయపెట్టి ఉంటారు. వీడియో బయటకు వచ్చిన తరువాత పోలీసులు జోక్యం చేసుకుని ఆ బాధితురాలి ఫిర్యాదు స్వీకరించి 14 మందిపై కేసులు పెట్టారు.
తెలంగాణలో క్షుద్రపూజల పేరుతో కొత్త రాజకీయాలకు తెర తీశారు నాయకులు. హరీశ్ దీనిపై కోర్టుకెక్కి పరువు నష్టం దావా కూడా వేశాడు. అయితే కాంగ్రెస్ మూఢనమ్మకాల ఆరోపణలను కవిత కూడా బలపర్చడం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. హరీశ్‌కు క్షుద్రపూజలు అలవాటేనని, కేసీఆర్ ఆరోగ్యం చెడిపోవాలని తరుచూ ఇలాంటి పూజలు చేస్తూ ఉంటాడని కూడా అనడంతో ఇది మరింత రచ్చ రచ్చైంది.
రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉండి.. ప్రజలతో ఏళ్ల తరబడి మమేకమై ఉన్న నేతలు ఇలా బాహాటంగా మూఢ నమ్మకాలపై రాజకీయ మైలేజీ కోసం విమర్శలు చేసుకోవడాన్ని తప్పుబడుతున్నారు విద్యావంతులు. మూఢ నమ్మకాలను వదిలి చైతన్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రజలను మళ్లీ అంధకారంలో నెట్టేలా నేతల వ్యాఖ్యల తీరుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.