రాజకీయాల్లో ఒకర్నిమించి మరొకరు. ఒకర్ని ముంచి మరొకరు. కన్ఫ్యూజ్ కాకుండి.. మళ్లీ చదవండి! నేను చెప్పేది చంద్రబాబు, కేసీఆర్‌ల గురించి. మీరు చదివిందీ కరెక్టే! ఈ ఫోటో.. బెంగుళూరు ఆస్పత్రిలోనిది. పవన్ భుజానికి ఆపరేషన్ జరిగితే .. చంద్రబాబు వెళ్లి పరామర్శించిన ఫోటో. అఫీషియల్ టీడీపీ పార్టీ దీని గురించి వివరించింది.
ఈ ఫోటో చూస్తే సామాన్యంగా, సహజంగా అందరికీ అనిపించేది.. డిప్యూటీ సీఎం కాబట్టి.. కూటమి సర్కార్‌లో ఆయన కీలకం కాబట్టి.. ఇలా వెళ్లి పరామర్శించడం కామనే కదా? దీంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకల్నా? ఇదీ ఓ వార్తాంశమైందా? అంత ఆవేశమొద్దుగానీ.. ఈ ఫోటో చూస్తే కేసీఆర్ గుర్తొచ్చాడబ్బా..!
ఇలా ప్రతీదాంట్లో కేసీఆర్‌ను గుంజుకొచ్చి.. ఆయనను రెండు మాటలనేదాకా నీకు పొద్దుపోనట్టుంది..! ఆయన మానాన ఆయన ఫామ్‌హౌజ్‌లో రెస్టు తీసుకుంటుంటూ ఉంటాడు. ఇలాంటి పోలికలు, చురకలు.. మైమరపులు.. కొంపలు ముంచడాలు.. అంటూ ఏవేవో మీ పైత్యాలన్నీ ఆయనకు అంటగట్టి పైశాచికానందం పొందడం తప్ప ఏమన్నా ఉందా? ఇక మీరు తిట్టుకోవడం ఆపితే అసలు విషయానికొద్దాం.
ఈ ఫోటోలో బాబుగారిని చూస్తే ఏమనిపిస్తుంది? అబ్బా ఎంతటి ఆప్యాయత, అభిమానం, ప్రేమ, ఆత్మీయత.. మమకారం… ఇలా సెంటిమెంటు పదాలన్నీ వరుసబెట్టి పలకాలనిపిస్తుంది. నిజమే, పరిస్థితి అలాంటిది. సందర్బమూ అలాగే ఉంది. అంతకు మంచి.. బాబుగారి రాజకీయ అవసరమైతే అంతకు మించే ఉంది. అవును.. తన రాజకీయం కోసం ఎవర్నెప్పుడు దగ్గర తీయాలో.. ఎంతలా ఆకాశానికెత్తాలో..? ఎంతగా ప్రేమించి.. పొగిడి, మునగచెట్టు ఎక్కియ్యాలో…! అన్నీ చేస్తాడు.
దానికో కాలపరిమితి ఉంటుంది. అది కచ్చితంగా బాబుగారికే తెలిసి ఉంటుంది. అది మనం ఊహించను కూడా ఊహించలేం. కానీ ఒక్కసారిగా సీన్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది. అలా యూజ్ అండ్ త్రో లాగా ఆ ఆప్యాయతలు, అనుబంధాలు, సంబంధాలు డస్ట్ బిన్‌లోకి విసిరేయబడతాయి.
ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్.. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! ఇది అచ్చంగా అక్షరాల పాటిస్తాడు. సమయాన్ని బట్టి. ఇది తెలియక అవతలి పక్షం అథితి ఉబ్బిపోతాడు. ఆయన చూపే అభిమానానికి ప్రీతిపాత్రుడే కాదు.. ఉబ్బి తబ్బిబ్బై.. ఆయన కోసం ఏమైనా చేద్దామనిపించేలా మైమరపించే ప్రేమ కురిపించే తత్వం బాబుగారికి రాజకీయంగా వెన్నతో పెట్టిన విద్య.
ఇది చూసి పవన్ అనుకుంటాడు… అది తనలోని ప్రతిభకు, శక్తికి, పరపతికి, తనకున్న హీరో వర్షిప్‌కు విలువ దొరికిందని, మర్యాదిచ్చాడని, తనో ఉన్నతుడనని ఆయన భావిస్తన్నాడని తనకు తెలియకుండా ఓ మైకంలో కొట్టుకుపోతూ ఉంటాడు. సేమ్ టు సేమ్‌గా కేసీఆర్ కూడా ఇదే పాటిస్తాడు. ఇలాగే అనుసరిస్తాడు. బహుశా అది బాబు దగ్గర నేర్చుకునే ఉంటాడు. ఎందుకంటే కేసీఆర్ కన్నా బాబుగోరు రాజకీయాల్లో బాగా సీనియర్ కదా!
కానీ కేసీఆర్ ఇందులో ఇంకా ఆరితేరి ఉంటాడు. ఎంతలా ..రాములాగా ఉంటాడో.. అంతకు భిన్నంగా ఒక్కసారిగా అపరిచితుడిలా కూడా మారగలడు. అసలు నువ్వెవరు? అనే రేంజ్‌లో అతని ముఖం కూడా చూడటానికి ఇష్టపడడు. అప్పటి దాకా తన నట్టింట్లో నడయాడిన ఆ నేత.. గేటుదాటి లోపలికి వచ్చేందుకు కూడా అనుమతులు నిషేధించబడతాయి.
అంటే ఆ మనిషితో అవసరం ముగిసింది. తాము ఇచ్చిన అద్బుత అవకాశాన్ని వారు జారవిడుచుకున్నట్టు.. సాన్నిహిత్యం, చొరవతనాన్ని వారంతట వారే కాలరాసుకున్నట్టు.. కనకపు సింహామున శునకము.. వలే బుద్దులు చూపించుకున్నట్టు… వెళ్లగొట్టబడిన వాడి మీద పిచ్చికుక్క ముద్ర కూడా ఒకటి వేసి పంపిస్తారే తప్ప.. అది తమ తప్పుగా అనుకోరు.
తాము తన్ని తరిమేశామని ఎన్నటికీ ఒప్పుకోరు. జనం కూడా అవతలి వాడిదే అంతా తప్పు.. ఈయన గారు ఎంతటి మర్యాదిచ్చారు…? నెత్తికెత్తుకుని ఊరేగారు..? మనం చూడలేదా? అని బాధితుడినే తిట్టుకోవాలె. అన్యాయమైనోడి మీదే రాయి విసరాలె. వీళ్లిద్దరూ కాలిమీద కాలేసుకుని తమ రాజశాసనాన్ని కాపాడుకునే క్రమంలో రాజసాన్ని ఒలకబోసేందుకు ఇంకెవడ్ని బలి చేయాలో.. వారిని దగ్గరికి తీసుకుంటారు.
చిరునవ్వుతో చేరదీస్తారు. ఆ చిరునవ్వు వెనుక.. రాజకీయ కత్తులు విచ్చుకుని ఉంటాయని ఎవరూ కనీసం ఊహించరు. అదే వీరి రాజనీతిజ్ఞతకు మచ్చు తునక అని చెప్పుకుంటూ ఉంటారు.