ఇద్దరూ ఇద్దరే. కానీ ఎవరికి వారే యుమునా తీరే. అది నిన్నటి వరకే. ఇవాళ ఆ ఇద్దరూ కలిశారు. ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అలాయ్ బలాయ్ చేసుకున్నారు. వీరిద్దరినీ కలిపింది అధిష్టానం. ఢిల్లీ నుంచి అధిష్టానం తరుపున వచ్చిన దూత అభయ్ పాటిల్.. ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో వీరిద్దరితో చర్చలు జరిపి.. ఇకపై కలిసి పనిచేసుకోవాల్సిందిగా హితబోధ చేశారు.
దీంతో ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య కొనసాగుతూ వస్తున్న కోల్డ్‌వార్ కూల్ అయ్యింది. గ్రూపుల రాజకీయాలకు చెక్ పడింది. ఇద్దరి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేసిన అధిష్టానం.. ఇద్దరినీ కలిపింది. చర్చల అనంతరం ఒకర్నొకరు కలుసుకుని నవ్వుకున్నారు. మీడియా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇదీ ఇవాళ తెలంగాణ బీజేపీలో న్యూ డెవలప్‌మెంట్. ఇది చూసి కషాయ దళంలో కొత్త ఊపు వచ్చింది.
మనం చెప్పుకుంటున్నది బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల గురించని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా. వీరిద్దరూ ఎవరికి వారే. వాస్తవానికి ఈ ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ఉంటూ వస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్‌గా తనను తీసేసేలా చేసిన బీఆరెస్ అంటే బండి సంజయ్‌కు కంపరం. ఆ బీఆరెస్ నుంచే వచ్చిన ఈటల రాజేందర్ అంటే కూడా కేసీఆర్ టీమ్‌గా చూస్తూ వస్తన్నాడు బండి.
దీంతో ఇరువురి మధ్య మొదటి నుంచి అంతరం ఉంది. ఇది అగాధంలా పెరుగుతూ వస్తోంది తప్ప.. తగ్గడం లేదు. మొన్న బండి సంజయ్ కొడుకు పై అయిన పోక్సో కేసు విషయంలో కూడా చెప్పుడు మాటలు వీరిద్దరి మధ్య మరింత దూరం పెంచేలా చేశాయి. ఒకరిపై ఒకరు పోస్టర్లు వేయించుకునే దాకా పోయింది పరిస్థితి. దీంతో పాటు కేసులు కూడా నమోదయ్యాయి. ఇది తెలంగాణ బీజేపీ పరువును బజార్లో నిలబెట్టాయి.
ఉన్న నలుగురైదుగురు సీనియర్లు కూడా సఖ్యతగా లేకపోతే.. ఇక తెలంగాణలో అధికారంలోకి రావటం కల్ల.. అని అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఈటల రాజేందర్‌తో పాటు బండి సంజయ్‌కు మంచి మాస్ అప్పీల్ ఉంది. ఇద్దరూ వేర్వేరుగా జనాలను ఆకట్టుకోవడంలో.. బీజేపీని బలపర్చడంలో పార్టీకి ఇతోధికంగా ఉపయోగపడుతారు. అందుకే వీరిద్దరి శక్తిని అంచనా వేసిన అధిష్టానం.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ పార్టీలో గిల్లికజ్జాలు పెట్టుకోవడం మూలంగా, వీరికి రాజకీయంగా ఇబ్బందులు తప్ప.. పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగం లేదని స్పష్టతకు వచ్చిన అధిష్టానం ఇలా చక్రం తిప్పింది.
ఢిల్లీ పెద్దల ఉపదేశంతో వీరిద్దరూ దిగి వచ్చారు. ఈగోలు వదిలారు. బెట్టును వదలి.. పార్టీ పట్టుకోసం ఏకమయ్యారు. ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అలాయ్‌బలాయ్ చేసుకుని కమలనాథులకు బలమైన తమ ఐక్యత సిగ్నల్‌ను అందివ్వడం ద్వారా ఇక ఫ్యూచర్ మనదేనని చెప్పకనే చెప్పారు.