తమిళనాడు రాజకీయాల్లో రాహుల్ తీసుకున్న తాజా నిర్ణయం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. డీఎంకే దోస్తానా కాదని, టీవీకేతో జత కట్టడంపై ఎవరికి వారే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా డీఎంకే .. రాహుల్‌ను ఈ విషయంలో బెదిరించేందుకూ వెనుకాడకపోవడం ఇక్కడ చర్చించుకోదగ్గ అంశం. తమను వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్‌తో పొత్తు వల్ల చాలా నష్టపోయామని, ఇకపై ఇద్దర మధ్య దోస్తానా కట్ అనే విధంగా డీఎంకే నుంచి ప్రకటనలు రావడం తమిళనాటే కాదు.. దేశ వ్యాప్తంగా దీనిపై విశ్లేషణలు సాగుతున్నాయి.
రాహుల్ ఇందులో కీలకంగా వ్యవహరించారు. తగిన సమయంలో ఆయన తీసుకున్న ఆ నిర్ణయం సరైదేనా? విమర్శకులకు చాన్స్ ఇచ్చినట్టయ్యిందా? ఇప్పటి వరకు సైద్ధాంతిక నడవడికే అలవాటు చేసుకున్న రాహుల్‌లో ఇది భిన్నమైన తీరును పట్టిస్తున్నదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ మెజారిటీ సెక్షన్ నుంచి రాహుల్ నిర్ణయం సహేతుకమేననే భావనలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా..అధికారం కోసమే అయితే.. సంఖ్యాబలం పెంచుకోవడమే లక్ష్యంగా ఉంటే.. మిగిలిన పార్టీలలా ఆలోచించి ఉంటే.. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలోనే టీవీకేతో జత కట్టాల్సింది. డీఎంకేతో పొత్తు వల్ల కలిగిన స్థానబలిమి కన్నా.. టీవీఎస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ మూడింతలు ఎక్కువ.
టీవీకే కూడా కాంగ్రెస్ పార్టీ భావసారూప్యతనే కలిగి ఉన్నది. రాహుల్- విజయ్ మధ్య స్నేహబంధం ఉంది. పార్టీ స్థాపించకముందే విజయ్.. టెన్ జన్‌పత్‌లో కాలుమోపి వచ్చాడు కూడా. అప్పుడే పరోక్షంగా విజయ్ అందరికీ సంకేతాలిచ్చాడు. తను కాంగ్రెస్ మనిషినని. కానీ.. మోడీ మాత్రం శత విధాలుగా ప్రయత్నం చేశాడు విజయ్ ప్రాపకం కోసం. ఇక్కడ విజయ్ ససేమిరా అన్నాడు. కానీ కాంగ్రెస్‌తో స్నేహ హస్తం కోసంఎదురుచూశాడు. ఇక్కడే రాహుల్ పట్ల ఓ సదాభిప్రాయం.. పార్టీ పట్ల చిత్తశుద్ది కనిపించింది.
అయినా అప్పటి పరిస్థితుల రీత్యా రాహుల్.. మిత్రధర్మాన్నే పాటించారు. కానీ డీఎంకే.. రాహుల్‌తో ప్రచారం చేయించుకోవడానికి కూడా సిద్దపడలేదు. దేశం అంతా మోడీ మానియా నడుస్తుందని, రాహుల్‌తో ప్రచారం చేయించడం వల్ల తమకు కలిగే లాభమేమీ లేదని ఫిక్స్ అయిన డీఎంకే.. కనీసం రాహుల్‌ను ఆ ఛాయలకు రానీయలేదు. ఇప్పుడు మీ వల్ల నష్టపోయామనే భావన ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవానికి, తమిళనాట రెండు జాతీయ పార్టీలకు పెద్దగా స్పేస్ లేదు. అయితే డీఎంకే, లేదా అన్నాడీఎంకే.. తాజాగా టీవీకే. వీటితో వేటితోనే జత కట్టి ఏదో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నమే తప్ప.. అక్కడ బలంగా కింగో, కింగ్ మేకరో అయ్యే స్థితి వాటికి లేవు. రావు.
కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మర్యాదగా ఆహ్వానించే అధికార పార్టీతో కలిసి వెళ్లడమనే రాజకీయ వ్యూహం సరైనదే. కాంగ్రెస్ పార్టీకి అది మరింత ఊతమిచ్చేది. భవిష్యత్‌లో టీవీకేతో జత కలిసి వెళ్లడము కాంగ్రెస్‌కు లాభించే అంశమే. ఇక్కడ మిత్రద్రోహం చేసినట్టుగా భావించాల్సిన అవసరం లేదు. మిత్రబేధం లేకుండా.. మిత్రధర్మం పాటించి మరీ.. రాజకీయ సమీకరణలో భాగంగా వ్యూహాత్మక అడుగులుగా భావించాలి. నిజానికి ఇలాంటి నిర్ణయం రాహుల్ తీసుకోవడం కూడా ఇప్పటి పరిస్థితుల్లో అనివార్యం. సరైన స్ట్రాటజీ కూడా. డీఎంకే ఏమనుకున్నా.