నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ ( ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ వ్యవహార శైలిపై భగ్గుమంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇతనిపై చర్యలు తీసుకోవాలని లేఖ కూడా రాశారు. బండి ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో అనిల్ జైన్ పేరు ప్రధానంగా తెర మీదకు వచ్చింది. అనిల్ జైన్ ఎందుకు బండికి టార్గెట్‌గా మారాడు. దీని వెనుక కథేందో తెలుసుకుందాం. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై ఎవరికి వారే సమర్థింపు చర్యలకు దిగారు.
ఇది మా నిజాయితీకి కొలమానం ఒకరు, కమిషన్ నివేదికపై హైకోర్టు ఇంకా ఏం చెప్పలేదని, దీనిపై ఇంకా విచారణ కొనసాగుతని సర్కార్ చెబుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో క్లారిటీ కోసం రేపు కేబినెట్ సమావేశం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నది. ఇవన్నీ ఇట్లుంటే.. బండి సంజయ్ మాత్రం అనిల్ జైన్ వెంటపడ్డారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద పలు పిల్లర్లు కుంగిన సంఘటనలో ఎన్డీఎస్ఏ చైర్మన్‌గా ఆయన ఇప్పటికే నివేదిక ఇచ్చి ఉన్నారు. అయితే బండి కోపమెక్కడంటే.. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్లినప్పుడు చైర్మన్‌గా ఈయనెందుకు అక్కడికి వెళ్లాడనేది కేంద్ర మంత్రి ప్రధాన ఆరోపణ.
అది పక్కా రాజకీయ పర్యటనగా మారిన నేపథ్యంలో… కేంద్రం నియమించిన ఎన్డీఎస్ఏ చైర్మన్‌గా అక్కడి పోవడాన్ని బండి తీవ్రంగా ఆక్షేపించారు. వాస్తవానికి, ఈ పర్యటన ముందుగా అధికారుల పర్యటనగానే ఉంది. ఆ తరువాతే దీన్ని సీఎం తను కూడా అక్కడికి వచ్చి పరిశీలిస్తానని షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు స్వయంగా ఆయనే చెప్పారు. ఇక దీనిలో వివాదమే లేదు. బీజేపీ నేతలు రోగమొకటైతే మందొకటి వేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు.. సీఎం రేవంత్‌ను సీబీఐకి ఓ లేఖ రాయొచ్చుగా అంటున్నారు. ఆ లేఖలు.. అవన్నీ అప్పుడే అయిపోయాయి. అయినా కేంద్రం స్పందించడం లేదనే సర్కార్ గగ్గోలు పెడుతున్నది.
కేసీఆర్‌ను రేవంత్ రక్షించేందుకే ఇంత ఉదాసీనంగా ఉంటున్నారనే ఆరోపణ కూడా రఘునందన్ చేశారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఇక బండి సంజయ్.. కాళేశ్వరం పై స్పందించకుండా రాజకీయ కోణాలనే వెతుకుతూ ఉన్నారు. అందులో భాగంగానే అనిల్ జైన్ పేరును తెరపైకి తెచ్చారు. ఇది విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించే విధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అనిల్ జైన్.. ఎక్కడా రాజకీయాలను టచ్ చేయలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఆయన ట్రాక్ రికార్డు కూడా బాగనే ఉంది. కానీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడానికో.. ఇష్యూను పక్కదారి పట్టించడానికో.. బండి మధ్యలో అనిల్ జైన్ పై చర్యలు తీసుకోండని కేంద్రానికి ఫిర్యాదు చేయడం మరీ హాస్యాస్పదంగా ఉందంటున్నారు విశ్లేషకులు.