Telugu Youth Web Series: స్నేహితులతో కలిసి గడిపే సరదా రోజులు… ప్రేమలో పడిన తర్వాత వచ్చే కన్ఫ్యూజన్… భవిష్యత్తు గురించి మొదలయ్యే టెన్షన్… కుటుంబం నుంచి వచ్చే అంచనాలు. ఇవన్నీ ఒకేసారి జీవితంలోకి వస్తే యువత పరిస్థితి ఎలా ఉంటుంది ? ఒకవైపు తమకు నచ్చినట్టుగా జీవించాలనే కోరిక, మరోవైపు పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. ఈ రెండింటి మధ్య నేటి జెన్-జీ యువత సాగించే ప్రయాణాన్ని కామెడీ, ఎమోషన్ తో చూపించే వెబ్ సిరీస్ ‘తోలుబొమ్మలు’ (Tholubommalu). మరి ఈ లేటెస్ట్ యూత్ ఫుల్ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
నేటి తరం యువత జీవితాన్ని చాలా దగ్గరగా చూపించే ప్రయత్నంతో ‘తోలుబొమ్మలు’ కథ మొదలవుతుంది. విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన కొంతమంది యువ స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. వాళ్ల జీవితాల్లో స్నేహం ఎంత ముఖ్యమో, ప్రేమ వచ్చిన తర్వాత సంబంధాలు ఎలా మారతాయో, కెరీర్ కోసం తీసుకునే నిర్ణయాలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో సరదాగా చూపిస్తారు. ఈ సిరీస్‌లో జీవితం కూడా ఒక తోలుబొమ్మలాట లాంటిదనే ఆలోచనను కథకు బేస్ గా తీసుకున్నారు. కొన్నిసార్లు మన జీవితాన్ని పరిస్థితులు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో బంధాలు, ప్రేమ, కుటుంబ అంచనాలు మన నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. అయినా తమ జీవితాన్ని తామే నడిపించుకోవాలని ప్రయత్నించే యువత ఎదుర్కొనే చిన్న చిన్న సంఘర్షణలే కథకు ప్రధాన బలం.
కథలో జాను, జై పాత్రలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. వీరిద్దరి మధ్య ఉండే స్నేహం, అపార్థాలు, సరదా గొడవలు కథలో వినోదాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా ఫుడ్ చుట్టూ తిరిగే కామెడీ ట్రాక్ కొన్ని ఆసక్తికరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. జాను, జై మాత్రమే కాకుండా మణి, కల్కి, రాజి, సందీప్, సౌమ్య మధ్య సాగే స్నేహం, రోజువారీ సరదా గొడవలు, ప్రేమ వ్యవహారాలు, చిన్న చిన్న అపార్థాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
ఈ కథలో ప్రత్యేకంగా కనిపించే అంశం ఏంటంటే… ప్రతి పాత్ర జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒకరికి ప్రేమ విషయంలో కన్ఫ్యూజన్. మరొకరికి కెరీర్‌పై క్లారిటీ ఉండదు. ఇంకొకరు కుటుంబం కోరుకునే జీవితానికి, తాను కోరుకునే జీవితానికి మధ్య ఇరుక్కుపోతారు. స్నేహితులుగా అందరూ ఒకరికొకరు సలహాలు ఇస్తున్నా, తమ జీవితాల్లో మాత్రం అదే సలహాలను పాటించలేక ఇబ్బంది పడుతుంటారు.
అందుకే సిరీస్‌లో వచ్చే హాస్యం కేవలం నవ్వించడానికే పరిమితం కాకుండా యువతకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్రమంగా ఈ స్నేహితుల జీవితాల్లోకి కొత్త సమస్యలు రావడంతో కష్టాలు మొదలవుతాయి. కలిసి ఉన్నప్పుడు సరదాగా కనిపించిన విషయాలే విడిపోయినప్పుడు పెద్ద అపార్థాలుగా మారుతాయి. అయితే అదే సమయంలో ఒకరికి ఒకరు అండగా నిలబడే సందర్భాలు కూడా వస్తాయి. దీంతో కథలో కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ కూడా కనిపిస్తుంది.
నేటి యువత తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడానికి చేసే ప్రయత్నం, ఆ నిర్ణయాలపై కుటుంబం మరియు సమాజం చూపించే ప్రభావం, ప్రేమలో వచ్చే మార్పులు, స్నేహం విలువ.. వీటన్నింటినీ కలిపి ‘తోలుబొమ్మలు’ సిరీస్ ను తీశారు. ఈ పాత్రలు ఎదుర్కొనే సంఘటనల్లో నేటి యువతకు తమ జీవితంలోని కొన్ని సందర్భాలు గుర్తొచ్చేలా సిరీస్ ను రూపొందించారు.
‘తోలుబొమ్మలు’లో అనుదీప్ ( Anudeep) జై పాత్రలో, దివిజ ప్రభాకర్ (Divija Prabhakar) జాను పాత్రలో నటించారు. ఆని (Annie), నిఖిల్ గోపు (Nikhil Gopu), నరేంద్ర రవి (Narendra Ravi), ప్రవీణ్ (Praveen) తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ది స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై శ్రీహర్ష ఉన్నం (Sriharsha Unnam) నిర్మించగా, జశ్వంత్ ఆరే (Jaswanth Are) దర్శకత్వం వహించారు. ‘తోలుబొమ్మలు’ సెప్టెంబర్ 17 నుంచి ఈటీవీ విన్ (ETV Win) లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్లీన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జెన్ జీకి బాగా కనెక్ట్ అవుతుంది. ఓటీటీలో తెలుగులోనే ఉంది.
Read Also: ఏకంగా ఆఫీసులో బాస్ తోనే.. తెలుగులో సూపర్ హిట్ కొరియన్ రొమాంటిక్-కామెడీ సిరీస్