బండి కింద నడుస్తున్న కుక్క .. ఆ బండిని తనే లాగుతున్నదని భ్రమించిందట! సేమ్ మొన్నటి వరకు పవన్ పరిస్థితి అలాగే ఉండే. అదేంటీ.. మరీ కుక్కతో పోల్చుతున్నారు పవన్‌ను.. అనుకుంటున్నారు. ఆయనా అన్నాడు మొన్న విజయ్ సీఎం కావడాన్ని తన రాజకీయంతో ఎందుకు పోల్చుతున్నారు…? ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉంది మీ పోలిక ..! అని. ఇక్కడ కుక్క అని తిట్టడం లేదు కానీ.. ఆ సామెత ఇప్పటి ఈ పరిణామాలకు ఆప్ట్‌గా ఉంటుందని వాడానంతే. వేరే ఉద్దేశం లేదు. తమిళ రాజకీయాలు పవన్‌ను తెగ ఇబ్బంది పెట్టేశాయంటే నమ్మండి.
అక్కడ విజయ్ సీఎం కావడం.. ఇక్కడ పవన్ కొంపముంచినట్టయ్యింది. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్టుగా. ఈ పరిణామాలేమో గానీ .. ఆ తరువాత పవన్ స్పందిస్తున్న తీరు.. మాట్లాడే పద్దతి పూర్తిగా అతని అంతరంగాన్ని పట్టించిందనే చెప్పాలి. దీనికి తను ప్రతి చోట సంజాయిషీ ఇచ్చుకునే తీరును చూస్తే ఎంతలా దీనికి కనెక్టయ్యాడో.. విజయ్ సీఎం కావడంతో తను ఎంతగా ఇన్ఫిరియారిటీ లోనవుతున్నాడో కూడా తన మాటలే తెలియజేస్తున్నాయి. మొదట కసురుకున్నాడు. ఆయనతో నాకేం పోలికోయ్..! ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలా.. అన్నాడు. నేనూ మొదటిసారి పోటీ చేసిన మీరెందుకు గెలిపించలేదు? అని నిలదీశాడు.
అయినా అక్కడ పాలిటిక్స్ , ఇక్కడ పాలిటిక్స్ వేరే అబ్బా..! అర్థం చేసుకోరూ! అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ అభిమానిస్తారు. కులాలు చూడరు అని ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. మీరూ ఉన్నారు.. రాజకీయాల్లోకి రాగానే కులమే చూస్తారు? అని నిందించాడు ఇక్కడి ప్రేక్షకులను.ఇక్కడ రాజకీయంగా ఎదగాలంటే ఎంత కష్టమో తెలుసా? అన్నాడు. పదేపదే విజయ్‌తో పోల్చి తనను తక్కువ చేయకండి రా బాబు..!అని సముదాయించే ప్రయత్నంలో భాగంగా. కొండను చీల్చుకుని ఓ చిన్న మొక్కగా ఎదిగి వచ్చాను.. అని తన కష్టాన్ని కూడా వారి కళ్ల ముందుంచాడు. అక్కడ రాత్రికి రాత్రి హీరో విజయ్.. సీఎం అయిపోయాడు అనే రేంజ్‌లో మాట్లాడుతూ.
అక్కడ ప్రతిపక్షమే లేనట్టు.. అది ఉన్నా బలంగానే లేనట్టు.. హీరో అనగానే అంతా ఆకాశానికెత్తేస్తారు.. అన్నట్టుగా .. విజయ్ పాత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నమూ చేశాడు. నిజంగా చెప్పాలంటే ఆ తమిళ హీరో విజయ్.. పవన్ పాలిట విలనై కూర్చున్నాడు. అంతలా డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ చేశారు కూడా ఆంధ్ర జనాలు, అభిమానులు. నేను ఈ స్థాయికి రావడమే గ్రేట్ తెలుసా? అని కూడా తన హోదాను ఒకసారి గుర్తు చేసి తనలోని ఇన్ఫిరియారిటీని తనే పొగొట్టుకునే ప్రయత్నంలో మరింత పలుచనయ్యాడు. అప్పటి రాజకీయ పరిస్థితులలో పవన్ తీసుకున్న నిర్ణయం.. జగన్‌ను ఢీ కొట్టేందుకు బాబు పంచన చేరిన వైనం.. ఇవీ అతనికి కలిసొచ్చాయి.
తన రాజకీయ అవసరాలు,స్వార్థాలు, గత అనుభవాలు.. ఇవన్నీ పవన్‌ను రాజకీయంగా ముందుకు నడిపించాయి. బాబు కూడా అప్పటి అత్యవసరాలు, పవన్ లాంటి హీరో కలిసి వస్తానంటే వాడుకోవడానికే మొగ్గు చూపుతాడు. ఆయన ఏ రాజకీయ అవసరాన్ని వదలడు. అది అతని అపారమైన రాజకీయ అనుభవం నేర్పిన పాఠం. అలా కలిసి వచ్చిన కాలానికి .. డిప్యూటీ సీఎం దాకా పోయాడు. అప్పటి వరకు ఎంత అపరిపక్వత పవన్‌లో. అన్న రాజకీయ వైఫల్యం ఓ వైపు భయపెడుతున్న సందర్భం.. తన మీద తనకు ఉన్న అపనమ్మకం ఇవన్నీ.. లోపాలే.
మరి విజయ్ మెంటాలిటీలో ఇన్ని భిన్న కోణాలు లేవు. క్లారిటీతో ఉన్నాడు. తనమీద తనకు అపారమైన విశ్వాసంతో నిలిచాడు. గెలిచాడు. నిండుకుండలా తొణకుండానే ఉన్నాడు మొదటి నుంచి. వెలితి పడలేదు. తనో అపర మేథావిననీ గర్వపడలేదు. అహంకారాన్ని దరి చేరనీయడం లేదు. తేడా కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు పదే పదే ఆ ప్రస్తావన ఎందుకు? మరింతగా తనను తాను తక్కువ చేసుకోవడం కాకపోతే.