Bhooth Bangla Movie Review: ఈ మధ్యకాలంలో జానర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ.. ఆడియన్స్ ను మెప్పించడంలో హారర్ కామెడీ సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే అక్షయ్ కుమార్.. ఇప్పుడు హారర్ కామెడీ జానర్ బాట పట్టారు. వినోదాత్మక చిత్రాలను రూపొందించే ప్రియదర్శన్ తో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం భూత్ బంగ్లా. మరి ఈ సినిమా ఎలా ఉంది ? అసలు కామెడీ హారర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా? లేదా ? ఈ సినిమా ద్వారా అక్షయ్ సక్సెస్ అయ్యారా? అనే విషయం ఈ రివ్యూలో చూద్దాం..
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక ఊర్లో పెళ్లిళ్లు చేసుకునే అమ్మాయిలు మాయమైపోతూ ఉంటారు. ఎందుకో ఎవరికీ తెలియదు. హీరో అక్షయ్ కుమార్ మాత్రం లండన్ నుంచి వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లి ఒక పాత మహల్ లో చేద్దాం అనుకుంటాడు. అప్పుడే సీన్లోకి ఒక దెయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఆ దెయ్యం ఏంటి? ఆ ఊరి కథ ఏంటి? అక్షయ్ కుమార్ ఆ దెయ్యంతో ఎలా ఆడుకున్నాడు? అనేది ఈ భూత్ బంగ్లా సినిమా.
ఇకపోతే ఎప్పటిలాగే అక్షయ్ కుమార్ మళ్లీ తన పాత కామెడీ రూట్ లోకి వచ్చేసాడు. ఆయన నటన, కామెడీ టైమింగ్ సినిమాకి అతిపెద్ద బలం అనే చెప్పాలి. పరేశ్ రావల్, రాజ్ పాల్ యాదవ్ ఉన్నారంటేనే సినిమాలో నవ్వుల పండగ. కొన్ని సీన్లు అయితే కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా దర్శకుడు ప్రియదర్శన్ ఎంచుకున్న పాయింట్ కొత్తది ఏమీ కాకపోయినా రొటీన్ కథకు కాస్త హారర్ ఫాంటసీ పురాణాలు దట్టించి, కామెడీ మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి కథలకు ఒక ఫార్మాట్ కూడా ఉంది. కథానాయకుడు అతనితో పాటు ఇంకొందరు ఈ మహల్ కి రావడం.. అందరూ భయపడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ప్రేక్షకులను నవ్వించడం.. విరామ సన్నివేశాల వరకు ఇదే ఫార్ములా లోనే ఈ చిత్రం నడుస్తుంది. ఇంటర్వెల్ కి ముందు ఊహించని ట్విస్ట్ .. ఇక ప్రధమార్ధంలో హాస్య సన్నివేశాలతో నడిచినా.. విరామానికి ముందు వచ్చే ట్విస్ట్ .. మహల్ లో ఉన్న రహస్య గది వెనుక ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు కాస్త కొత్తగా రాసుకున్నారు. పురాణాల నుంచి వదాసుర్ కథతో వర్తమానానికి కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. అతి లేకుండా సన్నివేశాల నుంచి హాస్యం పుట్టించే ప్రయత్నం చాలా చక్కగా చేశారు.
ఇకపోతే డైరెక్టర్ కొత్త పాయింట్ ను చెప్పకపోయినా ఉన్న పాయింట్ ను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇకపోతే అక్షయ్ కుమార్ మళ్ళీ ఈ సినిమాతో ఫామ్ లోకి వచ్చారు. దెయ్యం భయపెడుతుందని పోతే మనోళ్లే ఆ దెయ్యాన్ని చూసి భయపడే తీరు చూసి మనమే నవ్వుకుంటాం. ముఖ్యంగా ఈ భూత్ బంగ్లాలో భయం తక్కువ.. కామెడీ ఎక్కువ.. పక్కా ఫ్యామిలీతో వెళ్తే ఒకసారి చూసేయొచ్చు. సినిమాలో లాజిక్ లో వెతకకుండా.. మ్యాజిక్ ఎంజాయ్ చేస్తే సరిపోతుంది.
అక్షయ్ కుమార్ నటన
దర్శకుడు పాత పాయింట్ ను కొత్తరకంగా చూపించిన తీరు
ఇంటర్వెల్ కి ముందు ఊహించని ట్విస్ట్
సాగదీత
భూత్ బంగ్లా పెద్దగా భయంతో చెమటలు పట్టించదు కానీ కడుపుబ్బా నవ్విస్తుంది. అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్ కోసం ఆ ట్విస్ట్ ల కోసం ఒకసారి ఈ సినిమాను పక్కా చూడొచ్చు. మరీ భయంకరమైన హారర్ సినిమా అనుకోని వెళ్లకుండా హారర్ ముసుగులో ఉన్న కామెడీ సినిమా అని వెళ్తే మాత్రం పక్క టైం పాస్.. పైసా వసూల్..