కేంద్రం తెచ్చిన బిల్లుల తంటా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపాయి. ఆ బిల్లులు వీగినా.. తెలగాణ, ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ అలజడులు ఇప్పుడప్పుడే పోయేలా లేవు. బిల్లుకు అనుకూలం, వ్యతిరేకం.. ప్రభావాలు ప్రధానంగా ఉంటే.. మధ్యలో తేజస్వీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్లు దీనికి అదనం. ఇవి తెలంగాణ బీజేపీ ఎంపీలకు సెగ తగిలేలా చేశాయి. చివరకు తప్పైందని తేజస్వీతో బలవంతంగా చెంపలేసుకునేలా చేసినా.. ఆ అగ్గి ఆరలేదు సరికదా.. ఇంకా మండుతూనే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి ఇది రాజకీయ మైలేజీనే తెచ్చిపెట్టింది.
మొదట నుంచి దీనిపై తీవ్ర నిరసన గళం వినిపిస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. జీఎస్‌డీపీ ప్రతిపాదికన హైబ్రీడ్ పద్దతిలో సీట్లను పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు .. ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించారు. తేజస్వీ .. రేవంత్ డిమాండ్‌ను కోట్ చేసి మాట్లాడటంతో పాటు అది చెల్లుబాటు కాదన్నారు. దీంతో రేవంత్ రెడ్డి పేరు పార్లమెంటులో ప్రధానంగా వినిపించింది. అందరి దృష్టి తెలంగాణపై మళ్లింది. అంతే కాదు.. రేవంత్ లేవనెత్తిన హైబ్రీడ్ విషయాన్ని ప్రస్తావించిన సమయంలోనే.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేయబోయి తెలంగాణపై నోరు జారాడు తేజస్వీ.
దీంతో రేవంత్‌రెడ్డి ప్రతిపాదనకు విపరీతమైన ప్రచారం జరగడంతో పాటు.. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు… ఆది నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకమేననే అభిప్రాయం మళ్లీ తెరమీదకు వచ్చి ఇక్కడి పార్టీ నేతలకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.
ఏపీ రాజకీయాల్లో కూడా ఈ బిల్లులు తీవ్ర దుమారాన్నే రేపాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ఎన్డీయేలో భాగస్వామ్యమే కాబట్టి.. డీలిమిటేషన్‌తో పాటు .. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపాల్సిన పరిస్థితే ఉంది. కానీ మధ్యలో జగన్ కూడా ఎన్డీయేకు మద్దతు తెలపడంతో అంతా అవాక్కయ్యారు. ఇక ఏపీలో ప్రతిపక్షం లేనే లేదా..? అంతా ఏకపక్షం…. ఒకే పక్షమా? మోడీకి అందరూ సపోర్టు చేస్తే.. ఏపీలో వ్యతిరేకించే పార్టే లేదా? అని అందరినీ కట్టగట్టి మరీ విమర్శిస్తున్నారు.
బిల్లులు వీగిపోవడంతో ఏపీలో కూటమి నేతలు విపరీతంగా బాధపడుతున్నారని, బహుశా ఇంతలా మోడీ కూడా బాధపడి ఉండడని సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అంతా గగ్గోలు పెడుతుంటే.. చంద్రబాబు కూటమి మద్దతు తెలపడంతో పాటు బిల్లులు వీగిపోయిన నేపథ్యంలో ఆవేదన వ్యక్తం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక్కడ ప్రతిపక్షం లేదు.. అధికార పక్షం లేదు.. అంతా ఒక్కటైపోయారు. మోడీ జపం చేస్తున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
బిల్లులు వీగిపోయిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన ఆవేదనను ట్వీట్ చేశారు. మహిళా బిల్లు ఆమోదం పొంది ఉంటే.. దేశ వ్యాప్తంగా వారికి రాజకీయ పరంగా ఎంతో మేలు జరిగి ఉండేదని, ప్రతిపక్షాలు సహకరించకపోవడంతోనే ఇది సాధ్యం కాలేదని, కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు. కానీ.. ఇక్కడ మహిళా బిల్లు మాత్రమే కాదు.. అంతర్లీనంగా బీజేపీ ముడిపెట్టిన డీలిమిటేషన్‌పై తీవ్ర విమర్శలున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలే దీనికి బలికానున్నాయనే వాదన తెరపైకి బలంగా వచ్చింది.
ఇంత జరిగినా .. ఏపీలో మిత్రలాభంలో భాగంగానే చూశారు తప్ప.. దీన్ని రాజకీయ కోణంలో ఏమాత్రం పట్టించుకోలేదు కూటమి. ఇక జగన్ కూడా తన రాజకీయ అవసరాల కోసం ఎన్డీయే కు సపోర్టు చేయాల్సిన పరిస్థితులే వచ్చాయి. దీంతో జగన్ సైలెంట్‌గా తన నిర్ణయం తాను తీసుకున్నా.. దీన్నినెటిజన్లు మాత్రం వదల్లేదు. అసలు జగన్ ఎందుకు ఈ బిల్లులను వ్యతిరేకించలేదు..? అనే నిలదీతలు వస్తున్నాయి.
ఇప్పటికే మావిగాన్ అంటూ రాజధానిపై తలాతోక లేని వాదన తెరపైకి తెచ్చారనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్‌కు .. బిల్లులకు మద్దతు మరో కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మోడీ బిల్లులు అలజడినే రేపాయి. ఇందులో సీఎం రేవంత్‌కు అధిష్టానం వద్ద పలుకుబడి పెరగగా.. దేశవ్యాప్తంగా తన డిమాండ్‌తో చర్చలోకి వచ్చారు. ఏపీ రాజకీయాలైతే మరీ పలుచనయినట్టుగానే విమర్శలు వెల్లువెత్తాయి.