Saha Life of Sanju Review:ప్రేమకథలు తెలుగు సినిమాలకి కొత్తేం కాదు. చిన్నప్పటి నుంచి ఒకరిని ప్రేమించడం, స్కూల్-కాలేజీలో ఆ ప్రేమను కొనసాగించడం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యే కష్టాలు.ఇదీ ఇక్కడ రొటీన్ టెంప్లెట్.
ఇపుడు అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’.ఈ సినిమా విడుదలకు ముందు హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ చేసిన ఓ కామెంట్ బాగా వైరల్ అయింది. సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటానంటూ ఆమె ఛాలెంజ్ చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఆ సవాల్‌కు తగ్గట్టుగా సినిమా ఉందా చూద్దాం.
సంజు చిన్నప్పటి నుంచే ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. స్కూల్‌లో మొదలైన ప్రేమ కాలేజీకి వచ్చేసరికి మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోయినా ఇద్దరూ తమ నిర్ణయంపై నిలబడి పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి తర్వాతే వారి జీవితంలో అసలు సమస్యలు మొదలవుతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వారి బంధాన్ని పరీక్షిస్తాయి. ఈ పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే సినిమా కథ.
కథ వినడానికి చాలా సింపుల్‌గా ఉంది కదా.. తెరపై కూడా సినిమా అంతకంటే సింపుల్ గా రావడమే ఈ సినిమాకి పెద్ద మైనస్. స్కూల్, కాలేజీ లవ్ ఎపిసోడ్స్ నుంచి పెళ్లి వరకు వచ్చే సన్నివేశాలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఒకే అనుకునేలా సాగుతుంది. హీరో, హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాలు బాగానే అనిపించినా.. కథలో బలమైన మలుపులు లేకపోవడంతో తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయొచ్చు.
సెకండాఫ్‌లో సినిమా పూర్తిగా ఎమోషనల్ డ్రామాపై ఆధారపడుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలను చూపించడంలో కొన్ని సన్నివేశాలు కనెక్ట్ అయినా.. డ్రామాను ఎక్కువగా సాగదీయడంతో సినిమా వేగం తగ్గిపోయింది. ముఖ్యంగా ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే కథనం మరోలా ఉండేది.
సంజు పాత్రలో శివకుమార్ కాసారం తన పరిధిలో బాగానే చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. శ్వేత లక్ష్మణ్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా కనిపించింది. అయితే ఆమె నటన కంటే సినిమా విడుదలకు ముందు చేసిన గుండు ఛాలెంజ్‌పైనే ఎక్కువ చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది.
టెక్నికల్‌గా శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు ప్లస్. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నా.. సాగదీత సన్నివేశాలు సినిమా స్పీడ్‌కు బ్రేకులు వేశాయి.
శేఖర్ చంద్ర మ్యూజిక్
హీరో శివకుమార్
కొన్ని ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ సీన్లు
మైనస్ పాయింట్లు:
రొటీన్ కథ, ఊహకందే స్క్రీన్‌ప్లే
సెకండ్ హాఫ్‌లో సాగదీత
బోర్ కొట్టించే డ్రామా
ఫైనల్‌గా
‘సహా’లో ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు వంటి తెలిసిన అంశాలే ఉన్నాయి. హీరో నటన, కొన్ని ఎమోషనల్ సీన్లు, బీజీఎం ఆకట్టుకున్నా.. రొటీన్ కథనం, ఊహించగలిగే స్క్రీన్‌ప్లే, సెకండాఫ్‌లో ఎక్కువైన డ్రామా సినిమాకు మైనస్‌గా మారాయి.
హీరోయిన్ చేసిన గుండు ఛాలెంజ్ సినిమాకు మంచి ప్రచారం తెచ్చింది. కానీ థియేటర్‌లో మాత్రం ఆ స్థాయిలో కిక్ ఇవ్వలేకపోయింది. గుండు కొట్టించుకునేంత సీన్ లేకపోయినా.. ‘సహా’ అనే ఈ సహన పరీక్షను భరించాలంటే మాత్రం ఓపిక కాస్త ఎక్కువగానే కావాలి!