Bank Safety: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో బ్యాంకింగ్ లావాదేవీలు చాలా సులువుగా మారాయి. చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉపయోగించి డబ్బులను క్షణాల్లో ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు బదిలీ చేసేస్తున్నారు. అయితే ఈ సౌకర్యంతో పాటే సైబర్ మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యాలు వారి జీవితకాల కష్టార్జితాన్ని క్షణాల్లో మాయం చేస్తున్నాయి. అందుకే ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ లోని సేవింగ్స్ ను ప్రమాదంలో పడేసే 5 ప్రధాన తప్పులేంటో ఈ కథనంలో చూద్దాం.
చాలా మంది గుర్తుంచుకోవడం సులువుగా ఉంటుందని నెట్ బ్యాంకింగ్, యూపీఐ, సోషల్ మీడియా ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తారు. దీంతో అది సైబర్ నేరగాళ్లకు సులువైన మార్గంగా మారుతోంది. ఒకవేళ మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయితే అదే పాస్‌వర్డ్ సాయంతో మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ముఖ్యమైన ఖాతాకు క్లిష్టమైన విభిన్నమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవడం బెస్ట్.
రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, కాఫీ షాపుల్లో లభించే ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించి నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఈ ఫ్రీ వైఫై సర్వీసులనే హ్యాకర్లు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. కాబట్టి పబ్లిక్ వైఫైను ఉపయోగిస్తే మీ లాగిన్ వివరాలను, కార్డ్ నంబర్లను సులభంగా వారి చేతికి వెళ్లిపోతాయి. కాబట్టి బ్యాంకింగ్ అవసరాల కోసం ఎల్లప్పుడూ వ్యక్తిగత మొబైల్ డేటాను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఎస్ఎంఎస్ (SMS), ఈమెయిల్ లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ ఖాతాదారులు ఎక్కువగా మోసపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకులు ఎప్పుడూ ఇలాంటి లింక్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడగవని గుర్తుంచుకోండి. తెలియని నెంబర్లు, మెయిల్స్ నుండి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయకుపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బ్యాంక్ అధికారులమని చెప్పుకుంటూ వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్, సీవీవీ, మొబైల్‌కు వచ్చే ఓటీపీ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఏ బ్యాంక్ అధికారి కూడా సీక్రెట్ పిన్ నంబర్లను అడగరని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!
నెలకు కనీసం ఒకటి రెండు సార్లయినా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో తెలియకుండానే చిన్న చిన్న మొత్తాల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతుంటాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా బ్యాంక్ స్టేట్ మెంట్ ను చెక్ చేయడం ద్వారా అలాంటి అనుమానస్పద లావాదేవీలు గుర్తించి.. వెంటనే అలర్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందని వివరిస్తున్నారు.
Also Read: ఫిఫా ఫైనల్స్ ఎఫెక్ట్.. బార్ల పనివేళల పొడగింపు.. ఇక తెల్లార్లు ఎంజాయ్ పండగో!