space junk : మన భూమి చుట్టూ గిరగిరా తిరుగుతున్న వ్యర్థాల మొత్తం ఎంతో తెలుసా? దాదాపు 170 మిలియన్ల తునకలు అంతరిక్షంలో పేరుకుపోయాయి. ఓ సాఫ్ట్‌బాల్ కన్నా ఎక్కువ సైజులో ఉన్న వస్తువులను మాత్రమే రాడార్ లేదా ఆప్టికల్ సిస్టమ్స్ ద్వారా ట్రాక్ చేయగలం. మొత్తం స్పేస్ జంక్‌లో అలాంటివి 1 శాతం కన్నా తక్కువే ఉన్నాయి. అంటే 99 శాతం జంక్.. ఒక మిల్లీమీటర్ వ్యాసం కన్నా తక్కువ సైజులో ఉన్న తునకలేనన్నమాట.
ఇలాంటి సూక్ష్మ తునకలను సైతం గుర్తించగలిగే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందుకోసం స్పేస్ డెబ్రిస్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్(SINTRA) ప్రాజెక్టును చేపట్టారు. రోదసి వ్యర్థాల నుంచి వెలువడే ప్లాస్మా తరంగాలను సెన్సర్లు గుర్తించగలిగే టెక్నాలజీని ఈ ప్రాజెక్టులో భాగంగా పరీక్షించనున్నారు.
మిల్లీమీటర్ సైజులో ఉండే వ్యర్థాలను గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రౌండ్ రాడార్లు, ట్రాకింగ్ శాటిలైట్లు, ఆప్టికల్ సెన్సర్లతో పాటు ఈ కొత్త సెన్సర్లను వినియోగిస్తారు. అంతరిక్ష వ్యర్థాల నుంచి ప్రతిఫలించే కాంతి, రాడార్ సిగ్నళ్ల ద్వారా స్పేస్ డెబ్రిస్‌ను ప్రస్తుతం డిటెక్ట్ చేయగలుగుతున్నారు.
అయితే అతి సూక్ష్మ వ్యర్థాలను.. ఇలా కాంతి లేదా రేడియో సిగ్నళ్ల ద్వారా గుర్తించడం కష్టమని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రొఫెసర్ నిల్టన్ రెనో చెప్పారు. SINTRA అనేది నాలుగేళ్ల ప్రాజెక్టు. ఇందులోని ఆధునిక సెన్సర్ల సాయంతో ఆర్బిటాల్ డెబ్రిస్‌ను గుర్తిస్తారు. మూడు యూనివర్సిటీలు, మూడు లాబొరేటరీలు, మిలటరీ కాంట్రాక్టర్ బ్లూ హాలో ఈ ప్రాజెక్టు సంయుక్త భాగస్వాములు.
అంతరిక్ష వ్యర్థాలు ఢీకొన్నప్పుడు పేలిపోయి.. చిన్న చిన్న తునకలుగా వేరుపడతాయి. అలా ఢీకొనడం ద్వారా ఉత్పన్నమైన వేడి వల్ల అందులో కొన్ని తునకలు ఆవిరై.. చార్జ్‌డ్ గ్యాస్‌గా మారతాయి. ఆ గ్యాస్ మేఘాలు విస్తృతమయ్యే కొద్దీ మెరుపుల్లాంటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ జనిస్తుంటాయి. వాటిని ఆధునిక సెన్సర్లు గ్రహించి.. ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తాయి.
తమ ప్రయోగంలో భాగంగా ఈ సిగ్నల్స్‌ను నాసా డీప్ స్పేస్ నెట్ వర్క్ సాయంతో శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. లో-ఎర్త్ ఆర్బిట్‌లో రోదసి వ్యర్థాలు ఢీకొనే సగటు వేగం గంటకు 36,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే రోదసి వ్యర్థాల్లో చిన్నపాటి వస్తువు తాకినా.. శాటిలైట్ల పనితీరును భారీగా దెబ్బతీనే ప్రమాదం ఉంది. అయితే వ్యర్థ వస్తువులు ఒకదానినొకటి ఢీకొనే వేగాన్ని బట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం స్పేస్ డెబ్రిస్ నియంత్రణ వ్యవస్థల్లో ఉన్న లోపాలను అధిగమించడమే SINTRA ప్రాజెక్టు లక్ష్యం.