భూమి ఆవిర్భావం గురించి తెలుసుకుంటుంటే అంతా వింతగానే ఉంటుంది. మనం భూమి ఆవిర్భావం జరిగింది అని అనుకుంటున్నాం, కానీ అది ఇంకా జరుగుతూనే ఉంది, అది ఒక నిరంతర ప్రక్రియ. అయితే ఆ మార్పు ఒక తరం వారు గమనించి ముందు తరాలకు తెలియజేసేంత వేగంగా ఉండదు. ఆ మాటకొస్తే మనం గమనించదగ్గ స్పష్టమైన మార్పు కనపడాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు సమయం పడుతుంది. అలాంటి మార్పుల గురించి శాస్త్రవేత్తలు పరిశోదనలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ మార్పు భారత దేశ ఆకృతిని కూడా మార్చేయగలిగేంత బలంగా ఉంటుందని అంటున్నారు.
పాంజియా..
ఒకప్పుడు భూమి అంతా ఒకటే ఖండం. ఇది 30కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి. భూమిపై ఒక్కటిగా ఉన్న ఖండాన్ని పాంజియా అని పిలిచేవారు. ఆ తర్వాత అది విడిపోయి, ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలు ఏర్పడ్డాయి. భూమి అంతర్భాగం అంతా ద్రవరూపంతో నిండి ఉందని అంటారు. ఆ ద్రవంపై భూమి పై భాగం టెక్టోనిక్ ప్లేట్లపై తేలియాడుతూ ఉంటుంది. ఆ టెక్టోనిక్ ప్లేట్లపైనే సముద్రాలు, భూ భాగం, పర్వతాలు అన్నీ ఉంటాయి. భూమి ఉండే ప్రాంతాన్ని క్రస్ట్ అంటారు. ఈ క్రస్ట్ విడిపోయి క్రమక్రమంగా ఖండాలు ఏర్పడ్డాయి. ఈ విడిపోవడం అనే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అంటే పాంజియా ఇంకా విడిపోతూనే ఉంది. ఈ క్రమంలో ఏర్పడినవే ఖండాలు, అవే శాశ్వతం అని అనుకోడానికి లేదు. రాబోయో రోజుల్లో కొత్త ఖండాలు, వాటి మధ్యలో కొత్త సముద్రాలు ఏర్పడే అవకాశం ఉంది.
విడిపోతున్న ఆఫ్రికా..
భూమి నిలువుకోతను మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. పైనం మనం చూసే భూభాగాన్ని క్రస్ట్ అంటారు, దాని కింద ఉండే దాన్ని మాంటెల్ అంటారు, అన్నిటికంటే చివర, అంటే భూ కేంద్రంలో ఉండే దాన్ని కోర్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండం కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్లలో కదలిక ఎక్కువగా ఉంది. అవి పైన ఉన్న భూ భాగాన్ని ముక్కలుగా చేస్తున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని అఫార్ ప్రాంతం ఒక అరుదైన భౌగోళిక కూడలి. మూడు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదాన్ని మరొకొకటి దూరంగా నెడుతున్న ట్రిపుల్ రిఫ్ట్ జోన్ అది. వీటి కింద వేడి మాంటెల్ ప్లూమ్ ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధన చేస్తున్నారు. ఈ మాంటెల్ ఫ్లూమ్ ఆఫ్రికాను విడదీస్తోందని, మధ్యలో సరికొత్త మహాసముద్రాన్ని ఏర్పాటు చేస్తుందని అంటున్నారు.
ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్ వరకు గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో భూగోళ అంతర్గత శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీని వల్ల నుబియన్ టెక్టానిక్ ప్లేట్, సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోతున్నాయని తెలుస్తోంది. అంటే ఆఫ్రికా ఖండం చీలిపోతుందనమాట. ఇప్పటికే ఇథియోపియా, కెన్యా లాంటి ప్రాంతాల్లో భూమి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటం గమనించారు శాస్త్రవేత్తలు. అంటే ఆఫ్రికా ఖండం చీలిపోయే ప్రక్రియ కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది.
దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు అఫార్, ఇథియోపియన్ రిఫ్ట్ నుండి 130కి పైగా అగ్నిపర్వత శిల నమూనాలను సేకరించారు. మాంటెల్ పై క్రస్ట్ కదలికల్ని వారు గమనించారు. అయితే ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఎంత నెమ్మదిగా అంటే కోటి సంవత్సరాల తర్వాత దాన్ని మనం స్పష్టంగా గుర్తించగలం. అయితే అప్పటికి ఎన్ని మార్పులు జరుగుతాయో మనం ఊహించలేం. ఆఫ్రికా ఖండం ముక్కలై ఇండియాను బలంగా ఢీకొంటుందని, అక్కడ ఎత్తైన పర్వతాలు ఏర్పడతాయని గతంలో శాస్త్రవేత్తలు ప్రకటించారు కూడా. అయితే, అది జరగడానికి 5 కోట్ల సంవత్సరాలు పడుతుందని వారు తెలిపారు.