Rice Flour For Skin: బియ్యం పిండి, మన వంటగదిలో సర్వసాధారణంగా లభించే ఈ పదార్థం కేవలం ఆహారానికే కాకుండా, చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా ? తరతరాలుగా ఆసియా దేశాల్లో, ముఖ్యంగా తూర్పు ఆసియాలో చర్మ సంరక్షణలో బియ్యం పిండిని ఉపయోగిస్తున్నారు. చర్మాన్ని కాంతివంతం చేయడంలో.. అంతే కాకుండా మచ్చలను తగ్గించడంలో బియ్యం పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బియ్యం పిండిని గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యప్పిండి చర్మానికి ఎలా మేలు చేస్తుంది ?
సహజ ఎక్స్‌ఫోలియెంట్ (Natural Exfoliant):
బియ్యం పిండిలోని తేలికపాటి, సన్నని కణాలు చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసి, లోపల ఉన్న ఆరోగ్యకరమైన చర్మాన్ని బయటకు తీసుకువస్తుంది.
చర్మం కాంతివంతం (Skin Brightening):
బియ్యం పిండిలో పారా-అమినోబెంజోయిక్ యాసిడ్ ,ఫెరూలిక్ యాసిడ్, అల్లంటోయిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షించడంలో సహాయపడతాయి మరియు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు:
బియ్యం పిండికి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మంపై ఎరుపుదనం, దురద, ఇతర చర్మంపై ఏర్పడే చికాకులను తగ్గించడంలో సహాయపడతాయి.
అదనపు నూనెను పీల్చుకుంటుంది:
జిడ్డు చర్మం ఉన్నవారికి బియ్యం పిండి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను పీల్చుకొని, మొటిమలు రాకుండా నిరోధిస్తుంది.
బియ్యం పిండిని చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగించాలి ?
బియ్యం పిండిని ఉపయోగించి వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడతాయి:
1.పాలు, బియ్యం పిండితో ప్యాక్:
2 టేబుల్ స్పూన్లు- బియ్యం పిండి
తగినంత- పచ్చి పాలు
తయారీ విధానం:
పైన తెలిపిన మోతాదులో రెండు పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖం మెడపై అప్లై చేయండి.
15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో సున్నితంగా రుద్దుతూ కడిగేయండి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, తేమగా ఉంచి, కాంతివంతం చేస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది.
తేనె, బియ్యం పిండితో ప్యాక్ :
2 టేబుల్ స్పూన్లు- బియ్యం పిండి
1 టేబుల్ స్పూన్- తేనె
కొద్దిగా రోజ్ వాటర్ (అవసరమైతే)
తయారీ విధానం:
పైన తెలిపిన మోతాదులో అన్ని పదార్థాలను కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ఆగి కడిగేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
3. పెరుగు, బియ్యం పిండి ప్యాక్ :
2 టేబుల్ స్పూన్లు- బియ్యం పిండి
2 టేబుల్ స్పూన్లు- పుల్లని పెరుగు
1 టీ స్పూన్- నిమ్మరసం
తయారీ విధానం:
పైన తెలిపిన పదార్థాలను కలిపి మిశ్రమంలాగా తయారు చేయండి. తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. పెరుగు చర్మాన్ని శుభ్రపరచి, అదనపు నూనెను నియంత్రిస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్‌ను అందిస్తుంది.
Also Read: ప్రపంచమంతా బ్లూ స్కిన్ కేర్ ట్రెండ్ హవా .. ఎందుకంత స్పెషల్ ?
ముఖ్యమైన చిట్కాలు:
ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి 1-2 సార్లు ఉపయోగించవచ్చు.
ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ప్యాక్ వేసుకున్న తర్వాత చర్మం పొడి బారకుండా ఉండటానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
ఎల్లప్పుడూ సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి.