Amazon : అమెజాన్.. ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్. ప్రస్తుత కాలంలో లోకాన్ని శాసిస్తున్న సాంకేతిక దిగ్గజాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ ప్రముఖ ఈ – కామర్స్ సంస్థ అమెజాన్‌కు బిగ్ షాక్ తగిలింది! ప్రస్తుతం అత్యంత బిజీగా ఉంటూ సేల్స్ ఎక్కువగా ఉండే సమయంలో ఆ సంస్థ ఉద్యోగస్థులు రోడ్లు ఎక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఉద్యోగుల స్థిరమైన భవిష్యత్‌ను కోరుతూ.. కంపెనీ లాభాల కన్నా ఉద్యోగస్తుల గౌరవం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ స్ట్రైక్స్‌ను చేస్తున్నారు.
20కు పైగా దేశాల్లో నిరసన – నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు భారత్‌తో సహా దాదాపు 20కు పైగా దేశాల్లోని ఉద్యోగస్థులు ‘మేక్ అమెజాన్ పే’ పేరుతో ఉద్యమంలో పాల్గొని సమ్మె చేస్తున్నారు. మెరుగైన పని పరిస్థితులు, న్యాయమైన వేతనాలు, ఇతర స్థిరమైన ప్రాక్టీసెస్ కోసం ఈ ఉద్యమం చేస్తున్నారు అమెజాన్ కార్మికులు. కొంతమంది నిరసనకారులు అయితే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను పోలి ఉండే ముసుగులు ధరించి, కంపెనీ పద్ధతులకు వ్యతిరేకంగా తమ వ్యతిరేకతను, గళాన్ని వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి అమెజాన్ లో ఉద్యోగాలు చేస్తున్నా పనికి తగిన జీతాలు ఇవ్వటంలేదని తెలుపుతున్నారు. ప్రతీ ఏటా ఎన్నో సేల్స్ తీసుకొస్తూ మితిమీరిన భారాన్ని మోపుతుందని.. వేతనాలు మాత్రం పెంచటంలేదని తెలుపుతున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, జపాన్ సహా పలు దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగస్థులు తమ గళాన్ని వినిపిస్తూ ధర్నా చేస్తున్నారు. జెర్మనీలోని గ్రాబెన్, లీపిజ్ వంటి నగరాల్లో వర్కర్లు స్ట్రైక్‌లు జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌లో ఏటీటీఏసీ అనే యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ సమ్మె నడుస్తోంది. బంగ్లాదేశ్‌లో గార్మెంట్ వర్కర్లు అమెజాన్ బిజినెస్ మోడల్ ద్వారా తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయమై అవగాహన పెంచుతున్నారు.
ఆ సంస్థల సపోర్ట్‌తో – ప్రస్తుతం ఈ కాంపైన్ వరుసగా ఐదో సంవత్సరం కొనసాగుతోంది. కార్మికుల చేత వెట్టి చాకిరి చేయించుకోవడం, పర్యావరణ నష్టం, ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించినందుకుగానూ ఈ ‘మేక్ అమెజాన్ పే’ క్యాంపైన్ నిర్విరామంగా జరుగుతోంది. యూఎన్ఐ గ్లోబల్ యూనియన్, ప్రొగిసివ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాయి. యూఎస్, యూరప్‌లో వాకౌట్ చేస్తూ ఉద్యోగస్థులు తమ నిరసనలను తెలుపుతున్నారు. ప్రపంచ అమెజాన్ ఉద్యోగులంతా ఏకమవుతున్నారు.
లీగల్ ఛాలెంజెస్ – అమెజాన్, తమ కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తోందని, వారిని యూనియన్ బస్టింగ్ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రేరేపిస్తోందని యూనియన్ లీడర్స్, యాక్టివిస్ట్స్ ఆరోపిస్తున్నారు. భారత్‌లోనూ అమెజాన్ ఇండియా వర్కర్స్ అసోసియేషన్ కూడా మెరుగైన పని పరిస్థితులు కోసం సమ్మెలు చేస్తున్నారు. అలానే జర్మనీలోనూ ఇదే ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతోంది. కార్మిక హక్కులను ఉల్లంఘించిందంటూ యూఎస్‌లో లీగల్ ఛాలెంజెస్ను ఎదుర్కొంటోంది అమెజాన్. ఈ నేపథ్యంలో యూఎస్, యూకేలో అక్కడి ప్రభుత్వాలు యూనియన్ గుర్తింపు ప్రక్రియలను సులభతరం చేసేలా, అలానే చట్టాన్ని మరింత మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాయి.
ALSO READ : “Windows 11” వాడుతున్నారా? మైక్రోసాఫ్ట్ హెచ్చరిక మరవకండి