Asus Vivobook: టెక్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్న ఆసుస్.. తాజాగా భారత మార్కెట్‌లో వివోబుక్ సిరీస్‌ను మరింత విస్తరించింది. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్స్, గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి 5 కొత్త ల్యాప్‌టాప్‌లను కంపెనీ పరిచయం చేసింది. వీటితో పాటు కొత్త వైర్‌లెస్ మౌస్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు రోజువారీ పనులకు అవసరమైన పనితీరు, ఏఐ ఫీచర్లు, టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ ఫ్లిప్ డిజైన్ వంటి ప్రత్యేకతలను ఈ కొత్త మోడల్స్‌లో అందిస్తోంది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌ల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కొత్త ఆసుస్ వివోబుక్ లైనప్‌లో ఒక్కో మోడల్‌కు వేర్వేరు ధరలను నిర్ణయించారు. వివోబుక్ S14 ప్రారంభ ధర రూ.1.18 లక్షలు ఉండగా.. వివోబుక్ S16 ధర రూ.1.21 లక్షల వరకు ఉంది. టచ్‌స్క్రీన్‌తో పాటు 360-డిగ్రీల ఫ్లిప్ డిజైన్ కావాలనుకునే వారికి వివోబుక్ 14 ఫ్లిప్ మోడల్‌ను రూ.1.79 లక్షల ధరకు తీసుకొచ్చారు. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చే కొన్ని మోడల్స్ అక్టోబర్ రెండో వారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముందస్తుగా కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కేవలం రూ.99కే రెండేళ్ల వారంటీతో పాటు మూడేళ్ల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను అందించే ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.
Also Read: iPhone 18 Proలో లేనివి ఫోల్డబుల్‌లో ఎందుకు? యాపిల్ చేసిన ఈ 5 ప్రయోగాలు మైండ్ బ్లోయింగ్!
వివోబుక్ S14, S16 ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్లను ఉపయోగించారు. ఏఐ ఆధారిత పనులను వేగంగా నిర్వహించేందుకు వీటిలో ప్రత్యేక సపోర్ట్ కూడా ఉంటుంది. మెటల్ బాడీతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లు సన్నగా, తేలికగా ఉండటంతో ఆఫీస్, కాలేజ్ లేదా ట్రావెల్ సమయంలో సులభంగా తీసుకెళ్లవచ్చు. బ్యాటరీ విషయంలో కూడా S14 ఆకట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 20 గంటల వరకు బ్యాకప్ అందించగలదని కంపెనీ పేర్కొంది. మరోవైపు ఏఎండీ రైజెన్ ప్రాసెసర్‌తో వచ్చే వివోబుక్ 16.. రోజువారీ కంప్యూటింగ్ అవసరాలతో పాటు మల్టీటాస్కింగ్‌కు అనుగుణంగా రూపొందించారు.
సాధారణ ల్యాప్‌టాప్‌తో పాటు ట్యాబ్లెట్‌గా కూడా ఉపయోగించాలనుకునే వారికి వివోబుక్ 14 ఫ్లిప్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 360-డిగ్రీల హింజ్ ఉండటంతో అవసరానికి అనుగుణంగా స్క్రీన్‌ను పూర్తిగా వెనక్కి తిప్పి ట్యాబ్లెట్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌ను అందించారు. స్టైలస్ సపోర్ట్ ఉండటంతో నోట్స్ రాయడం, స్కెచ్‌లు వేయడం వంటి పనులను కూడా సులభంగా చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌తో వచ్చే మరో ఫ్లిప్ మోడల్‌లో బ్యాటరీ సేవింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. స్టాండ్‌బైలో ఏకంగా 30 రోజుల వరకు బ్యాటరీ ఉండేలా రూపొందించినట్లు అసస్ వెల్లడించింది. యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని వెబ్‌క్యామ్‌కు ప్రత్యేక షీల్డ్‌ను కూడా అందించింది.
కొత్త ల్యాప్‌టాప్‌లతో పాటు అసస్ వైర్‌లెస్ సైలెంట్ మౌస్ MW103ను కూడా కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గ్రీన్, పింక్, బ్లూ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే క్లిక్ చేసినప్పుడు శబ్దం చాలా తక్కువగా ఉండేలా ఈ మౌస్‌ను రూపొందించారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి డీపీఐ స్పీడ్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూస్తే కొత్త వివోబుక్ సిరీస్‌లో పనితీరు, పోర్టబిలిటీ, డిజైన్‌తో పాటు ఏఐ, టచ్‌స్క్రీన్, ఫ్లిప్ డిజైన్ వంటి ఫీచర్లకు ఆసుస్ ప్రాధాన్యం ఇచ్చింది.
Also Read: కీప్యాడ్ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్లు అరుదే.. 2500mAh బ్యాటరీతో iTel Music 450L లాంచ్!