Addanki Dayakar: సిఎల్పీ మీడియాలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ప్రతిపక్ష నాయకులు కేటీఆర్, హరీష్ రావుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ అంటే ‘భారత్ రాష్ట్ర సమితి’ కాదని, అది ‘భూ చోర్ రాష్ట్ర సమితి’ అని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు, సంక్షేమంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
సభకు వచ్చి సమాధానం చెప్పే దమ్ముందా?
శాసనసభను నెల రోజులు కాదు, అవసరమైతే రెండు నెలల పాటు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘సభకు మీ అయ్య వస్తారా?’ అని ప్రశ్నిస్తూ.. ఒకవేళ సభకు వస్తే ముందుగా స్పీకర్ కాళ్ళు మొక్కి లోపలికి రావాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రతిపక్షాలకు ఉంటే సభను పొడిగించేందుకు ప్రభుత్వం వెనుకాడదని సవాల్ విసిరారు.
అబద్ధాల ప్రాపగండ.. దళితులకు అన్యాయం
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతిపక్షంలో ఒక్కడు కూడా మాట్లాడటం లేదని దయాకర్ మండిపడ్డారు. కేవలం వాట్సాప్‌లో వచ్చే ఆధారాలు లేని వార్తలను పట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో దేవుడి భూములను, దళితులను కూడా వదల్లేదని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తామని మోసం చేయడమే కాకుండా, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఉన్న భూములను గుంజుకున్నారని ధ్వజమెత్తారు.
తప్పించుకోలేరు.. విచారణకు సిద్ధమా?
కవిత తనపై వచ్చిన 36 ఎకరాల ఆరోపణలపై విచారణకు సిద్ధమన్నట్లుగానే, కేటీఆర్, హరీష్ రావు కూడా తమపై వచ్చిన ఆరోపణలపై బహిరంగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఇచ్చిన లెక్కలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంత డ్రామాలు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని, అధికారంతో పాటు పరువు కూడా పోతుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
Also Read: గూగుల్‌ని అడిగినా చెప్తుంది.. కేసీఆర్‌కు ఆ పేరు ఎందుకొచ్చిందో! – బల్మూర్ వెంకట్