Bandi Bhageerath Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసు మరో మలుపు తిరిగింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలంటూ బాధితురాలికి నోటీసులు జారీ చేసింది.
మైనర్ అయిన తన కూతురిపై బండి భగీరథ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు అతనిపై పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి కేసులో సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ ను ఆదేశించారు.
ఈ క్రమంలో కేసు దర్యాప్తు బాధ్యతలను కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ కు అప్పగించారు. బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్న డీసీపీ రితిరాజ్ కేసులో పోక్సో చట్టంలోని మరో రెండు సెక్షన్లను చేర్చారు. ఇక, కేసులు నమోదు కాగానే పారిపోయిన బండి భగీరథ్ ను పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచి చర్లపల్లి జైలుకు రిమాండ్ చేశారు. మధ్యలో ఒక వారం రోజులపాటు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన బండి భగీరథ్ తిరిగి లొంగిపోయాడు.
Also Read: ఏసీ vs డీహ్యూమిడిఫైయర్.. రెండింటికి తేడా ఏంటి? వర్షాకాలంలో ఏది బెస్ట్?
కాగా, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని అందులో పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిపారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో బాధితురాలి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: ఫ్రిజ్‌లో పాలు పెడుతున్నారా? ఈ తప్పు చేస్తే పారబోయాల్సిందే!