Air Purifier: ఇటీవల కాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్లపైనే కాకుండా ఇంట్లోని గాలి కూడా ప్రమాదకరంగా మారుతోంది. దీంతో చాలామంది ఇళ్లలో ‘ఎయిర్ ప్యూరిఫైయర్’ ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే ఏ ప్యూరిఫైయర్ పడితే అది కొనేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనే ముందు కచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన 5 ముఖ్యమైన అంశాల గురించి సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఎయిర్ ప్యూరిఫైయర్‌కు గుండెకాయ లాంటిది అందులో ఉండే ఫిల్టర్. మీరు కొనే డివైజ్‌లో కచ్చితంగా ‘True HEPA’ ఫిల్టర్ ఉందో లేదో చెక్ చేయండి. ఇది గాలిలో ఉండే 99.97 శాతం సూక్ష్మ ధూళి కణాలు, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియాను సమర్థవంతంగా అడ్డుకుంటుందని నిపుణులు అంటున్నారు. కొన్ని కంపెనీలు ‘HEPA-like’ లేదా ‘HEPA-type’ అని మోసపూరిత పేర్లతో అమ్ముతుంటాయని పేర్కొంటున్నారు.
కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్లు గాలిని శుభ్రం చేయడానికి ఐయోనైజర్లు లేదా ఓజోన్ జనరేటర్లను ఉపయోగిస్తాయి. ఈ క్రమంలో అవి గాలిలోకి ఓజోన్ గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఓజోన్ వాయువు ఊపిరితిత్తులకు తీవ్ర హాని కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ‘Ozone-Free’ అని సర్టిఫై చేసిన ప్యూరిఫైయర్లను మాత్రమే ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిదని హితవు పలుకుతున్నారు.
ఇంట్లో దుమ్ము, దూళితో పాటు సహజంగానే.. వంట గ్యాస్ పొగ, పెంపుడు జంతువుల దుర్వాసనలు, సిగరెట్ పొగ వంటి రసాయన వాయువులు కూడా ఉంటాయి. వీటిని సాధారణ హెపా ఫిల్టర్లు పీల్చుకోలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ విషపూరిత వాయువుల వల్ల తలనొప్పి, కళ్ల మంటలు వస్తాయని పేర్కొంటున్నారు. వీటిని నివారించాలంటే ప్యూరిఫైయర్‌లో ‘Activated Carbon Filter’ కచ్చితంగా ఉండాలని పేర్కొంటున్నారు. . ఇది హానికరమైన వాయువులను, వాసనలను పీల్చేసుకుంటుందని స్పష్టం చేస్తున్నారు.
Also Read: వానొస్తే చాలు.. పాములు ఇళ్లల్లోకి దూరిపోతాయి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
కొత్తగా కొనే ప్యూరిఫైయర్ మీ బెడ్‌రూమ్ లేదా హాల్ సైజుకు సరిపోతుందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు . దీనికోసం CADR (Clean Air Delivery Rate) రేటింగ్‌ను చెక్ చేయాలని సూచిస్తున్నారు. చిన్న గదికి తక్కువ రేటింగ్ ఉన్నది సరిపోతుందని కానీ పెద్ద గదికి చిన్న ప్యూరిఫైయర్ పెడితే అది గాలిని పూర్తిగా శుభ్రం చేయలేదని అంటున్నారు. దీనివల్ల గాలిలో కాలుష్యం అలాగే ఉండిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రూమ్ సైజుకు తగ్గ సీఏడీఆర్ రేటింగ్ ఉన్న మోడల్‌నే ఎంచుకోవాలని హితవు పలుకుతున్నారు.
మార్కెట్లోని కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్లు వర్క్ చేస్తున్నప్పుడు విపరీతంగా శబ్దం చేస్తుంటాయి. దీని వల్ల రాత్రిళ్లు నిద్రకు ఆటంకం కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి తక్కువ డెసిబెల్స్ (Low dB) శబ్దం చేసే ‘స్లీప్ మోడ్’ ఫీచర్ ఉన్నదాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ప్యూరిఫైయర్ ఫిల్టర్లను నిర్ణీత కాలంలో మార్చాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. లేదంటే అందులో బ్యాక్టీరియా చేరి తిరిగి గాలిలోకి విడుదలవుతుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: రోజుకు 3GB డేటా + ఫ్రీ నెట్‌ఫ్లిక్స్.. ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే!