మానవుల పరిధి భూమికి మించి విస్తరిస్తోంది. పరిశోధకులు భూ కక్ష్యలో ఎన్నో ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. చంద్రుడి మీదికి అంతరిక్ష నౌకలను పంపించారు. మార్స్ మీదికి మిషన్లను పంపించారు. అంతరిక్ష కేంద్రాలను నిర్మిస్తున్నారు. దశాబ్దాల అన్వేషణలో, వ్యోమగాములు, అంతరిక్ష సంస్థలు రోజువారీ ఉపకరణాలు, వ్యక్తిగత జ్ఞాపకాలతో పాటు పలు వస్తువులను అంతరిక్షంలోకి పంపారు. ఉద్దేశపూర్వకంగా వాటిని అక్కడ ఉంచారు. ఇంతకీ ఆ వస్తువులు ఏవి? ఎందుకు వదిలేశారు? అనేది ఇప్పుడు తెలసుకుందాం..
1992లో స్టార్ ట్రెక్ సృష్టికర్త జీన్ రాడెన్ బెర్రీ బూడిదలో కొంత భాగాన్ని కొలంబియా అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. అంతరిక్ష పరిశోధనకు రాడెన్ బెర్రీ చేసి కృషికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మానవ సృజనాత్మకతకు, అంతరిక్షం విశాలతకు మధ్య సంబంధాన్ని సూచిస్తూ అతడి బూడిదను కక్ష్యలోకి తీసుకెళ్లారు.
1972లో అపోలో 16 మిషన్ సమయంలో ఆస్ట్రోనాట్ చార్లెస్ డ్యూక్ చంద్రునిపై తన కుటుంబానికి సంబంధించిన ఫోటోను ఉంచి వచ్చాడు. ఈ ఫోటోలో డ్యూక్, అతడి భార్య, వారి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్లాస్టిక్ తో తయారు చేసిన ఈ ఫోటోను చంద్రుడి ఉపరితలంపై వ్యక్తిగత జ్ఞాపకంగా ఉంచారు.
చంద్రుని ఉపరితలంపై అపోలో 15 ల్యాండింగ్ సైట్ సమీపంలో ‘ఫాలెన్ ఆస్ట్రోనాట్’ అని పిలువబడే ఒక చిన్న అల్యూమినియం శిల్పం ఉంది. బెల్జియన్ కళాకారుడు పాల్ వాన్ హోయ్ డాంక్ రూపొందించిన ఈ 3.5-అంగుళాల బొమ్మను 1971లో అంతరిక్ష పరిశోధనలో ప్రాణాలు కోల్పోయిన వ్యోమగాముల జ్ఞాపకార్థం అక్కడ ఉంచారు. శిల్పంతో పాటు అంతరిక్ష పరిశోధనల్లో మరణించిన 14 మంది వ్యక్తుల పేర్లతో కూడిన ఫలకాన్నిఉంచారు.
1969లో అపోలో 11 వ్యోమగాములు 73 దేశాల నాయకుల నుంచి గుడ్ విల్ మెసేజ్ లను కలిగి ఉన్న సిలికాన్ డిస్క్ ను చంద్రుడి మీద ఉంచారు. 50 సెంట్ల పరిమాణంలో ఉన్న ఈ డిస్క్ ను ప్రపంచ ఐక్యత, శాంతికి చిహ్నంగా చంద్రునిపై ఉంచారు. ఈ సందేశాలు శాంతియుత భవిష్యత్తు, అంతరిక్ష పరిశోధనలో ఉమ్మడి ఆసక్తిని సూచించడానికి ఉద్దేశించబడ్డాయి.
1971లో అపోలో 15 మిషన్ సమయంలో వ్యోమగాములు డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్, ఆల్ఫ్రెడ్ వోర్డెన్ అనధికారికంగా పోస్టల్ కవర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ స్టాంప్డ్, పోస్ట్ మార్క్ చేసిన ఎన్వలప్ లను తర్వాత ఒక స్టాంప్ డీలర్ విక్రయించారు. ఇది ఓ స్కామ్ కు కారణం అయ్యింది. వ్యోమగాములను NASA మందలించింది. ఈ సంఘటన అంతరిక్ష కార్యకలాపాలలో ఆస్ట్రోనాట్స్ నైతిక ప్రవర్తనకు మచ్చగా మారింది.
ఎలోన్ మస్క్ టెస్లా రోడ్ స్టర్, ఫిబ్రవరి 2018లో స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ లో ప్రయోగించబడింది. దీనిని ఉద్దేశపూర్వకంగానే టెస్టింగ్ పేలోడ్ గా సూర్యకేంద్ర కక్ష్యలోకి పంపారు. డ్రైవర్ సీటులో స్టార్‌మ్యాన్ అనే బొమ్మతో ఉన్న కారు ఇప్పటికీ సూర్యుని చుట్టూ తిరుగుతోంది.
Read Also: చందమామ మీదికి మీ పేరును పంపుకోండి, నాసా బంపర్ ఆఫర్!