ChatGpt Refund| టెక్నాలజీ రంగంలో ఈ రోజుల్లో ఏఐ (కృత్రిమ మేధ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) రాజ్యమేలుతోంది. సామాన్యులకు సైతం అరచేతిలో ఏఐ అందుబాటులో కి వచ్చేసింది. ఆఫీసులో కొత్తగా కోడింగ్, ప్రొగ్రామింగ్ చేయాలన్నా, ఇంట్లో పిల్లలకు పాఠాలు చెప్పాలన్నా.. ఏఐతో పని ఈజీ అయిపోతుంది. ముఖ్యంగా ఏఐ చాట్ బాట్స్‌లో చాట్ జిపిటిదే అగ్రస్థానం. తాజాగా ఒక ప్రయాణికుడు తాను నష్టపోయిన రూ.2 లక్షలు తిరిగిపొందాడు. దీనికి చాట్ జిపిటీని లాయర్‌గా ఉపయోగించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఒక అమెరికన్ ప్రయాణికుడు తన కలల పర్యటనను కొలంబియాలోని మెడెల్లిన్‌కు ప్లాన్ చేశాడు. అందుకోసం అతను ఎక్స్‌పీడియా ప్లాట్‌పామ్ ద్వారా హోటల్ రూమ్, విమాన టికెట్లు బుక్ చేశాడు. అందుకు దాదాపు రూ.2,10,000 ఖర్చు చేశాడు. కానీ చివరి నిమిషంలో అరోగ్యం విషమించడం కారణంగా ఆ పర్యటనను రద్దు చేయాల్సి వచ్చింది.
దీంతో అతను బుక్ చేసిన హోటల్, విమాన టికెట్లు రద్దు చేయడానికి ప్రయత్నించాడు. కానీ హోటల్, విమాన సంస్థలు రెండూ “రీఫండ్ లేదు, మినహాయింపులు లేవు” అని స్పష్టంగా చెప్పాయి. అలా ఆ ప్రయాణికుడు రూ.2 లక్షలకు పైగా నష్టపోయి నిరాశకు గురయ్యాడు. అయినా తన కోల్పోయిన డబ్బుని తిరిగి పొందాలని మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. చివరకు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఈ సమస్యను పరిష్కాంచాలని నిర్ణయించుకున్నాడు.
అయితే అతను ట్రిప్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. అందుకే హోటల్, విమాన సంస్థలు రీఫండ్ ఇవ్వడానికి నిరాకరించాయి. అయినా అతను తన వైద్య సమస్య—జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ (GAD)—ను చెప్పి, డాక్టర్ నోట్‌తో సహా ఆధారాలు సమర్పించాడు. అయినప్పటికీ, మొదట రెండు సంస్థలు తిరస్కరించాయి. అప్పుడు అతను చాట్‌జీపీటీని తన లాయర్ పాత్ర పోషించమని అడిగాడు.
వెంటనే చాట్‌జీపీటీ.. ఎక్స్‌పీడియా, హోటల్, విమాన సంస్థల విధానాలను పరిశీలించి, వైద్య కారణాలతో ఒక బలమైన అప్పీల్ లేఖను రాసింది. ఈ లేఖ చదివిన తరువాత హోటల్ యజమాన్యం అతడి సమస్యను గుర్తించి.. రీఫండ్ ఇవ్వడానికి అంగీకరించారు. కానీ విమాన సంస్థ మాత్రం గట్టిగా నిరాకరించింది. వారి విధానం ప్రకారం.. కేవలం మరణం లేదా తీవ్ర అనారోగ్యం మాత్రమే రీఫండ్‌కు అర్హత కల్పిస్తాయని, అతడి అనారోగ్య సమస్య (GAD) అందులో లేదని చెప్పారు.
Also Read: రాత్రికి రాత్రికి జెండా ఎత్తేసిన దుబాయ్ కంపెనీ.. భారతీయులకు రూ. కోట్లలో నష్టం
ఈ సమాచారాన్ని ఆ ప్రయాణికుడు ఈ తిరస్కారాన్ని చాట్‌జీపీటీకి చెప్పాడు. దీంతో ఏఐ మరో లేఖ రాసింది, ఈసారి అతని మానసిక ఆరోగ్య సమస్య విమాన ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, విమాన సంస్థ విధానం మానసిక అనారోగ్యంపై వివక్ష చూపుతోందని వాదించింది. ఈ లేఖ పంపిన ఒక గంటలోనే విమాన సంస్థ తన నిర్ణయాన్ని మార్చి, పూర్తి రీఫండ్ ఇవ్వడానికి అంగీకరించింది. అలా ఆ ప్రయాణికుడు తాను నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందాడు.
ఈ కథ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో బాగా వైరల్ అయింది. చాలా మంది అతని పట్టుదలను, ఏఐ ఉపయోగాన్ని ప్రశంసించారు. ఒక వ్యక్తి, “ఇది భవిష్యత్తు!” అని అన్నాడు. మరొకరు, “చాట్‌జీపీటీ ఒక్కసారిలోనే తన విలువను వంద రెట్లు పెంచేసింది” అని వ్యాఖ్యానించారు. అయితే, కొందరు ఈ విధానాన్ని తప్పుబట్టారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “మీ లాంటి వాళ్ల వల్ల కంపెనీలు.. నిజంగా సమస్యలున్న కస్టమర్లను చెడుగా చూస్తాయి. మీకు నీతి, న్యాయం అనే విలువలు లేవా?” అని రాశాడు.
దీనికి సమాధానంగా ఆ ప్రయాణికుడు.. చాట్‌జీపీటీ ఎటువంటి ఫేక్ కారణాలను సృష్టించలేదు. నిజమైన వైద్య సమస్యను సమర్థవంతంగా, ఆధారాలతో వివరించడంలో సహాయపడింది. “నేను చాట్‌జీపీటీ ఉపయోగించకపోతే, ఒక పారలీగల్‌ను నియమించాల్సి వచ్చేది. అది మరింత ఖర్చు అయ్యేది,” అని అతను చెప్పాడు.