Geyser : గీజర్.. చలికాలంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అత్యవసర వస్తువు. సాధారణంగా ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంది. నిత్యవసరంగా మారిపోయిన ఈ గీజర్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే అవకాశం సైతం అంతే ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న తప్పులే పెను ప్రమాదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. అందుకే గీజర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
గీజర్ ను ఉపయోగించే ప్రతీ ఒక్కరూ కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. చలికాలం రాగానే గీజర్ ను తెగ వాడేస్తుంటారు. రోజూ ఉదయాన్నే గీజర్ లేకపోతే పని జరగదు అన్నట్టు ఉపయోగించే ఈ వస్తువుతో ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయం తెలిసినప్పటికీ కాస్త అజాగ్రత్త వహిస్తూనే ఉంటున్నారు. అయితే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్త పనికిరాదు.
⦿ ముఖ్యంగా గీజర్ ను ఆన్ చేసినప్పుడు నీరు నిమిషాలు వ్యవధిలోనే వేడెక్కుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే దీన్ని ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు. నిజానికి గీజర్ ను ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచడం వల్ల వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సమయం చూసుకొని వేడెక్కిన వెంటనే ఆపేయటం మంచిది. దీనివల్ల కరెంటు ఆదా కావడంతో పాటు ప్రమాదాలను సైతం నివారించే అవకాశం ఉంటుంది.
⦿ గీజర్ ను కొనుగోలు చేసినప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని స్థానిక కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే అలాంటి గీజర్స్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసినప్పుడే బ్రాండెడ్ కంపెనీ కొనడం మంచిది.
⦿ బాత్రూంలో గీజర్ ను సరైన స్థలంలో ఉంచడం అవసరం. ఒకవేళ ప్రమాదం జరిగినా మీద పడే అవకాశం లేకుండా బాత్రూంలో నీరు చేరని చోట గీజర్ ను ఉంచాలి.
⦿ ఇక స్నానం చేయటానికి వెళ్లే ముందే గీజర్ ను స్విచ్ ఆఫ్ చేయడం తప్పనిసరి. ఇలా చేయకుండా గీజర్ ను ఆన్ లోనే ఉంచి స్నానం చేయడం వల్ల కొన్నిసార్లు కరెంట్ సప్లై అయ్యి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.
⦿ ఇక కొందరు గీజర్ ను 10 ఏళ్లు, 15 ఏళ్లు సైతం వాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో గీజర్ లోపల పేరుకుపోయే వ్యర్ధాలను గుర్తించే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే కనీసం రెండేళ్లకు ఒకసారి గీసర్ ను క్లీన్ చేయించడం అత్యవసరం.
⦿ గీసర్ ను ఏళ్ల తరబడి క్లీన్ చేయించకుండా వాడటం వలన ఎన్నో నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక జుట్టు ఊడిపోవడం, చిన్న పిల్లలకు అలర్జీ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలి.
⦿ ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు గీజర్ తో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది
ALSO READ : క్రోమ్ వాడుతున్నారా.. ఒక్క సెట్టింగ్ మార్చకపోతే..!!