CM Revanth Reddy: పేరుకే ఏడాది పాలన పూర్తి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగింది కేవలం 4 లేక 5 నెలలు. కొన్ని నెలల్లోనే పాలన అద్భుతః అంటున్నారు తెలంగాణ ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన అభివృద్ధి చూడాలంటే.. కళ్లు తెరిచి చూడాలని, బీఆర్ఎస్ నేతల మాదిరిగా కళ్లు మూసుకుంటే సరిపోదని సోషల్ మీడియా కోడై కూస్తోంది. పదేళ్ల పాలనంతా.. ప్రజలకు చిప్పే మిగిలింది. కానీ కాంగ్రెస్ పాలన ఏమి చేసిందో ఒక్క కళ్లు తెరిచి చూడండయ్యా అంటూ.. బీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకుంటున్నారు నెటిజన్స్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఇప్పటికే డిసెంబర్ 7, 8, 9 తేదీలలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వాడవాడనా సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల ఆశయం ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే పాలన తెలంగాణలో సాగుతున్న వేళ.. మీ గోల ఏమిటి అంటూ బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్స్.
బీఆర్ఎస్ కు నెటిజన్స్ సంధిస్తున్న ప్రశ్నలు ఇవే..
1. మీ పాలనలో రుణమాఫీ పూర్తిగా జరిగిందా? 2. మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేశారా? 3. ఉపాధ్యాయ బదిలీలు కాదు సుమా.. ప్రమోషన్స్ ఇచ్చారా? 4. ఇందిరమ్మ ఇళ్లు కాకున్నా.. ఎవరికి (మీ నేతలకా) డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారు? 5. సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చారా? 6. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? 7. అవినీతికి తావు లేకుండా పాలన సాగిందా? 8. ఉద్యోగాలు ఒక్కటైనా భర్తీ చేశారా? 9. డీఎస్సీ నిర్వహించారా? 10. కానిస్టేబుల్స్ నియామకాలు సాగాయా? 11. మోటార్ ట్రాన్స్ పోర్ట్ విభాగం పోస్టులు భర్తీ చేశారా? 12. గృహజ్యోతి అమలైందా? 13. ఏనాడైనా ఉచిత విద్యుత్ ఇచ్చారా? 14. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? 15. విద్యార్థుల సమస్యలు పట్టాయా? 16.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ సాధ్యమైందా? 17. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆలోచన వచ్చిందా? 18. మూసీనది పవిత్రత ఎప్పుడైనా ప్రజలకు చాటిచెప్పారా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది.
పదేళ్లు అధికారంలో ఉండి, చేసింది గోరంత చెప్పుకుంది కొండంత కదా మీ నైజం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలు వచ్చాయి. అయినా పాలనపై పట్టు సాధించి చెప్పినా, చెప్పని హామీలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమంటూ సోషల్ మీడియా పోస్టుల హవా సాగుతోంది. ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చూసినా అవినీతి మయం. ఏ నగరం చూసినా డ్రగ్స్ మయం. డ్రగ్స్, గంజాయి పేరెత్తాలంటే భయపడే స్థితి కాంగ్రెస్ తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. సోషల్ మీడియా బ్యాచ్ ను ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూస్తే ప్రజలకు తెలియదా అసలు వాస్తవం అంటూ కాంగ్రెస్ అనుకూల మీడియా వాదన.
పదేళ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా రూ. 6500 కోట్లు వడ్డీ కడుతూ.. ఓ వైపు ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తూ.. ప్రజా సంక్షేమ పథకాలు సాగిస్తుంటే.. ఇది మీకు తగునా అంటూ బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు తీవ్రమయ్యాయి. పట్టుమని 5 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ తెలంగాణలో కనిపించిందని, మరో నాలుగేళ్లలో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే రోజు వస్తుందని, మీరు తలదించుకుని ఆ రోజు చూడండి సుమా అంటూ వస్తున్న విమర్శలు బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఏదిఏమైనా ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు జిల్లాలలో విజయోత్సవ సభలను నిర్వహించగా, భారీగా జన సందోహం హాజరై మద్దతు పలకడంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది.