AI Dream Recorder| మీరెప్పుడైనా మీ కలలను రికార్డ్ చేసుకోవాలని ఆలోచించారా? ఇప్పుడు ఒక ప్రయోగాత్మక పరికరం దీన్ని సాధ్యం చేస్తోంది. దీని పేరు డ్రీమ్ రికార్డర్ AI. ఇది మీ మెదడులో ఆలోచనలను చదవదు. కానీ మీరు గుర్తుపెట్టుకున్న కలలను వివరించడం ద్వారా వీడియోలుగా మారుస్తుంది.
ఇది ఒక ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్. మీరే స్వయంగా తయారు చేసుకోవాలి. మీరు వివరించిన కలలను ఇది కొన్ని నిమిషాల వీడియో క్లిప్‌లుగా మారుస్తుంది. ఇది మార్కెట్‌లో రెడీమేడ్‌గా లభించదు. దీన్ని రూపొందించిన టీమ్ అన్ని బ్లూప్రింట్‌లను ఉచితంగా ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ ప్లాన్లను ఉపయోగించి ఎవరైనా తమకోసం ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మీ కలలను సినిమాటిక్ స్టైల్‌లో ప్రదర్శిస్తుంది.
నిద్రలో వచ్చే కలలను రికార్డ్ చేసే ప్రక్రియ చాలా సరళమైనది. మీరు నిద్రలేచిన తర్వాత మాత్రమే ఇది పని చేస్తుంది. ముందుగా, మీరు మీ కలను మీ వాయిస్ ద్వారా వివరించాలి. తర్వాత, ఈ పరికరం ఆ వాయిస్‌ను టెక్స్ట్‌గా మారుస్తుంది. ఆ టెక్స్ట్‌ను AI మోడల్స్ విశ్లేషిస్తాయి. చివరగా, ఆ వివరణ ఆధారంగా ఒక లో-డెఫినిషన్ వీడియోను జెనరేట్ చేస్తుంది. ఫలితంగా వచ్చే వీడియో మసకగా, ప్రతీకాత్మకంగా ఉంటుంది.
ఈ పరికరం AI టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ వివరణను వీడియోగా మారుస్తుంది. ఇది గరిష్ఠంగా ఏడు కలలను ఒక వారం పాటు స్టోర్ చేస్తుంది. ఈ ప్రక్రియలో మెదడు స్కానింగ్ లేదా శరీరంలోకి ఎలాంటి చొరబాటు లేదు. ఒక పరికరాన్ని తయారు చేయడానికి సుమారు 285 యూరోలు ఖర్చు అవుతాయి. ఇది పూర్తిగా ‘డు ఇట్ యువర్‌సెల్ఫ్’ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
క్రియేటివ్ టీమ్ మోడెమ్ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఈ టీమ్ తమను తాము ఒక థింక్ ట్యాంక్ డిజైన్ స్టూడియో అని చెప్పుకుంటోంది. AI భవిష్యత్తు పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే చెందకూడదని ఈ టీమ్ నమ్మకం. దీన్ని ఓపెన్-సోర్స్‌గా చేయడం ద్వారా.. AI టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది వారి ఆలోచన.
ఈ ప్రాజెక్ట్ కోసం మోడెమ్ 2030 వరకు గడువుగా నిర్దేశించారు. ఇది ఎప్పటికీ కొనసాగే వ్యాపార ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కళాత్మక, టెక్నికల్ ప్రయోగం. టెక్నాలజీ “ఏం చేయగలదు” అని భావించే దాని కంటే “ఏం చేయాలి” అనే ప్రశ్నను ప్రజలు అడగాలని ఈ టీమ్ ప్రోత్సహిస్తోంది.
ఈ పరికరం.. హార్డ్‌వేర్ డిజైన్, కోడ్‌ను GitHub నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది టెక్ ని ప్రేమించే వారికి సొంత పరికరాలను నిర్మించడానికి అనుమతిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ప్రయోగం మాత్రమే. భవిష్యత్తులో మానవుల కలలను అర్థం చేసుకోవడానికి ఇది పరిశోధనలో ఉపయోగపడవచ్చు.
Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్