కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఈరోజే అమలులోకి వచ్చింది. ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాది కేవలం 2 లక్షల 30వేలమంది ఆటో డ్రైవర్లకి ఒక్కొకరికి రూ.10వేలు ఇచ్చింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం తొలి ఏడాది 2.90 లక్షల మందికి పైగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఒక్కొకరికి రూ.15వేలు ఇస్తోంది. తేడా స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ. గత ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కంటే ఈ ప్రభుత్వం అదనంగా రూ.5వేలు ఇస్తోంది. సో ఆటో డ్రైవర్ల విషయంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి.
విమర్శలు చేయాల్సిందే
ప్రభుత్వం కొత్తగా ఏ పథకం తెరపైకి తెచ్చినా సహజంగా ప్రతిపక్షం నుంచి విమర్శలు వినిపిస్తాయి. ఇక్కడ వైసీపీ కూడా అదే చేస్తోంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకంపై విమర్శలు మొదలు పెట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ తరపున ఈరోజు ఆయన ఒక్కరే బయటకు వచ్చారు. అసలు ఈ పథకం బాగోలేదని, దసరాకు పండగ చేసుకోమంటున్న సీఎం చంద్రబాబు, రూ.15వేలతో ఏం పండగ చేసుకుంటారో చెప్పాలన్నారు. మరి వైసీపీ ఇచ్చిన రూ.10వేలతో ఏం పండగ చేసుకున్నారో ఆటో డ్రైవర్లే పేర్ని నానికి చెప్పాలంటున్నారు కూటమి నేతలు. వారు ఇచ్చింది తక్కువ, ఇప్పుడు చేస్తున్న విమర్శలు ఎక్కువ అని కౌంటర్లిస్తున్నారు.
వైసీపీ పాచిక పారలేదు..
ఓవైపు స్త్రీ శక్తి సక్సెస్, మరోవైపు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టినా దక్కని ఫలితం. ఇలా రెంటికీ చెడ్డ రేవడిలా వైసీపీ పరిస్థితి తయారైందని అంటున్నారు నెటిజన్లు. చివరకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం తమ ప్రతాపమే అని వైసీపీ చెప్పుకోవాల్సి వస్తోంది. తమ వల్లే ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అంటున్నారు వైసీపీ నేతలు. కానీ జనాలకు, ఆటో డ్రైవర్లకు ఏది ఎంతమేరకు అర్థం కావాలో అంతమేర అర్థమైపోయింది.
– తల్లికి వందనం అందరికీ ఇవ్వలేరని వైసీపీ విమర్శించింది – కానీ కూటమి చేసి చూపెట్టింది.
– మహిళలకు ఉచిత రవాణా అసాధ్యం అని, జిల్లాకే పరిమితం అని వైసీపీ విమర్శించింది – కూటమి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అమలు చేసింది.
– స్త్రీ శక్తితో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ విమర్శించింది – సైలెంట్ గా ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి కూటమి శ్రీకారం చుట్టింది.
Also Read: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్
ఎలా చూసుకున్నా వైసీపీని కూటమి ఊపిరితీసుకోకుండా చేస్తోంది. పథకాల విషయంలో వైసీపీ వంక పెట్టడానికి కూడా ఏమీ దొరకడంలేదు. లబ్ధిదారుల సంఖ్య, అందిస్తున్న ఆర్థిక సాయం స్పష్టంగా తేడా ఉన్నా కూడా ఇంకా ఆటో డ్రైవర్ల సేవలో పథకంపై విమర్శలు చేస్తున్నారంటే కచ్చితంగా వైసీపీ సెల్ఫ్ గోల్ కోసం చేజేతులా ప్రయత్నిస్తున్నట్టేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అవకాశం కోసం వేచి చూడటం మినహా వైసీపీ చేయగలిగిందేమీ లేదని అంటున్నారు.