పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో చాలా మంది రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీపావళికి సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే, పండుగ సీజన్ లో ఎక్కువ డిమాండ్ కారణంగా టికెట్లు వెంటనే అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తత్కాల్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. రైలు షెడ్యూల్ సమయాని సరిగ్గా ఒక్కరోజు ముందు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈజీగా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణ టికెట్లు 60 రోజుల ముందుగానే బుక్ చేసుకోగలిగినప్పటికీ, భారతీయ రైల్వే తత్కాల్ టికెట్లు రైలు బయలుదేరే స్టేషన్ నుంచి ఒక రోజు ముందు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తుంది. చివరి నిమిషంలో ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు ఈ టికెట్లను ప్రయత్నిస్తారు. అందుకే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక తత్కాల్ టికెట్ కోటా పరిమితంగా ఉంటుంది. మొత్తం సీట్ల సంఖ్యలో 10 నుంచి 30 శాతం అందుబాటులో ఉంటాయి. అందుకే, బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడు అవుతాయి.
తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి నిర్ణీత సమయం ఉంటుంది. AC తరగతులకు (1A, 2A, 3A, CC, EC) ఉదయం 10 గంటలకు, నాన్-AC తరగతులకు (స్లీపర్, 2S) ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది. ప్రయాణీకులు సకాలంలో లాగిన్ కాకపోతే కన్ఫార్మ్ టికెట్ పొందడం చాలా కష్టం. భారతీయ రైల్వే లో తత్కాల్ టికెట్ బుకింగ్ సక్సెస్ కావడానికి స్మార్ట్ పద్దతులు పాటించాలి. ప్రయాణీకులు ముందుగానే లాగిన్ అయి, ప్రయాణ వివరాలు, ప్రయాణీకుల సమాచారాన్ని సేవ్ చేసుకోవాలి. వేగవంతమైన చెల్లింపు పద్ధతిని (UPI, నెట్ బ్యాంకింగ్, ఇ-వాలెట్ వంటివి) ఉపయోగించాలి. నిర్ధారణ తర్వాత వెంటనే చెల్లింపు చేయాలి. అలాగే, బ్రౌజర్ ఆటోఫిల్, IRCTC క్విక్ బుక్ ఫీచర్ కూడా సమయాన్ని ఆదా చేస్తాయి. టికెట్ బుక్ చేసుకున్నట్లు నిర్థారిస్తాయి.
Read Also: 300 మైళ్ల ప్రయాణం.. రూ. 350కే టికెట్.. మయన్మార్ లో ట్రైన్ జర్నీ ఇలా ఉంటుందా?
తత్కాల్ టికెట్లు సాధారణ టికెట్ల కంటే ఎక్కువ ధర పలుకుతాయి. ఎందుకంటే, తత్కాల్ టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంతేకాదు, వీటిని ప్రయారిటీ సర్వీస్ గా రైల్వే భావిస్తుంది. ప్రీమియం తత్కాల్ టికెట్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, విమాన టికెట్ల మాదిరిగానే డైనమిక్ ధరలపై ఆధారపడి ఉంటాయి. అంటే, డిమాండ్ కు తగినట్లుగా ధరలు పెరుగుతాయి.
Read Also: ఇండియాలో స్పెషల్ రైలు, ఇందులో టికెట్ లేకుండా ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు!