Fake UPI Apps: దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. Google Pay, PhonePe, Paytm వంటి పలు యాప్‌ల వల్ల అనేక మంది కొన్ని సెకన్లలోనే డబ్బును బదిలీ చేసేస్తున్నారు. కానీ, ఇదే అవకాశాన్ని పలువురు మోసగాళ్లు వారి స్వార్థానికి ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సైబర్ నిపుణులు UPI వినియోగదారులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. సైబర్ మోసగాళ్లు అసలు యాప్‌ల మాదిరిగా కనిపించే నకిలీ UPI యాప్‌లను అభివృద్ధి చేసి, ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నకిలీ UPI యాప్‌ల మోసం ఎలా జరుగుతోంది
ఈ మోసం ప్రధానంగా చిన్న వ్యాపారులు, దుకాణదారులు, రిటైల్ షాప్ యజమానులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మోసగాళ్లు నకిలీ UPI యాప్‌లను ఉపయోగించి, డబ్బు బదిలీ చేయకుండా చెల్లింపు అయినట్టు నమ్మిస్తున్నారు. అంతే కాదు, దుకాణాల్లోని సౌండ్‌బాక్స్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. కానీ వారి బ్యాంకు ఖాతాలోకి మాత్రం డబ్బు రావడం లేదు.
సోషల్ మీడియా
ఈ నకిలీ యాప్‌లు టెలిగ్రామ్, డార్క్ వెబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో అవి ఎక్కువమందికి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మోసాల వల్ల అనేక మంది వ్యాపారులు, చిన్న దుకాణదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
Read Also: QLED TV Launch Offer: రూ.6 వేలకే బ్రాండెడ్ QLED స్మార్ట్ .
నకిలీ UPI యాప్‌లు ఎలా పని చేస్తాయి?
-మోసగాళ్లు ప్రసిద్ధ UPI యాప్‌లను క్లోన్ చేసి, వాటితో సమానమైన ఇంటర్‌ఫేస్‌తో నకిలీ యాప్‌లను రూపొందిస్తారు.
-ఈ యాప్‌లు తప్పుడు చెల్లింపు నిర్ధారణను ప్రకటిస్తాయి. లావాదేవీ కాకున్నా కూడా విజయవంతమైందని చూపిస్తాయి.
-దుకాణదారులను నమ్మించేందుకు, నకిలీ చెల్లింపు ప్రాసెసింగ్ స్క్రీన్ను ప్రదర్శిస్తాయి.
-సౌండ్‌బాక్స్ కూడా అసలైన చెల్లింపు జరిగినట్టు తప్పుదోవ పట్టిస్తుంది
నకిలీ UPI యాప్‌లకు బలవుతున్న వ్యాపారులు
ఓ వ్యక్తి తన చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. ఇటీవల అతను ఒక కస్టమర్ నుంచి రూ.5000 తీసుకున్నట్లు UPI నోటిఫికేషన్ పొందాడు. కానీ అతను తన బ్యాంక్ ఖాతాను చెక్ చేసినప్పుడు, డబ్బు జమ కాలేదని గమనించాడు. అప్పుడు అది నకిలీ UPI యాప్ మోసమని అర్థమైంది. ఈ మోసం గురించి అర్థం చేసుకునే సమయానికి ఆ కస్టమర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నాయి.
ఈ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి?
సైబర్ మోసాల పెరుగుదల నేపథ్యంలో, UPI వినియోగదారులు తమ చెల్లింపులపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి. లావాదేవీలను ఎల్లప్పుడూ బ్యాంక్ ఖాతా లేదా అసలు UPI యాప్‌లో ధృవీకరించుకోండి. నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన, చెల్లింపు పూర్తయిందని అనుకోవద్దు. మీ UPI యాప్‌లో లేదా బ్యాంక్ స్టేట్మెంట్‌లో లావాదేవీ నమోదైందో లేదో చూసుకోవాలి. సౌండ్‌బాక్స్ నోటిఫికేషన్‌లను నమ్మకూడదు. నకిలీ UPI యాప్‌లు కూడా సౌండ్‌బాక్స్ ద్వారా నకిలీ నోటిఫికేషన్లు ప్లే చేయగలవు. కాబట్టి, డబ్బు మీ ఖాతాలో జమ అయిందో లేదో మీరు స్వయంగా చెక్ చేసుకోవడం మంచిది.
వెబ్‌సైట్‌ల నుంచి ఏదైనా
అధికారిక UPI యాప్‌లను మాత్రమే ఉపయోగించండి. Google Play Store లేదా Apple App Store వంటి నుంచి మాత్రమే UPI యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయడం, ఉపయోగించడం చాలా ప్రమాదకరం. ఏ కొత్త చెల్లింపు యాప్ వచ్చినా కూడా పరిశీలించండి. తప్పుడు లావాదేవీలతో కస్టమర్ల డేటా కూడా దుర్వనియోగం అయ్యే అవకాశముంది. ఒకవేళ మోసపోతే, వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయండి.