Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన కొత్త ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను తీవ్రంగా అసహనానికి గురిచేస్తోంది. గతంలో మనం ఏ రీల్ నచ్చిందో దాన్ని లైక్ చేసి ఊరుకుంటే చాలు, అది మనకే కనిపించేది. కానీ ఇప్పుడు ఆ సౌలభ్యం ఇక లేదు. మెటా సంస్థ రూపొందించిన ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు లైక్ చేసిన వీడియోలు, రీల్స్ అన్నీ మీ ఫ్రెండ్స్‌కి కూడా కనిపిస్తాయి. ఇవి ఇప్పుడు “Friends” అనే ప్రత్యేక ట్యాబ్‌లో ప్రదర్శితమవుతున్నాయి. ఈ ట్యాబ్ లోకి వెళ్ళితే మీ ఫ్రెండ్స్ లైక్ చేసిన వీడియోలు ఏవో, ఎప్పుడు లైక్ చేసారో అన్నీ అక్షరాలా మీకు కనిపిస్తాయి.
మా పర్సనల్ వేరే వారికి తెలిస్తే ఎలా
ఈ ఫీచర్ ఇప్పటికే అమెరికాలో అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తున్నారు. దీనిపై చాలా మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తున్నదిగా భావిస్తున్నారు. సామాన్యంగా మనం లైక్ చేసే వీడియోలు కొన్ని వ్యక్తిగత భావోద్వేగాలకు సంబంధించినవై ఉండవచ్చు. ఉదాహరణకి, మీరు ఓ డిప్రెషన్ రీల్ లైక్ చేస్తే, మీ మూడో ఫ్రెండ్ అది చూసి మీ మనస్థితిని ఊహించుకుంటాడు. అలానే, ఒక మహిళ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది – తన విడాకులు తీసుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ ఒకేలా సెల్ఫ్ హెల్ప్ రీల్స్‌కి లైక్ చేయడాన్ని గమనించానని చెప్పింది. ఇంకోపక్క తనకు ఎవరూ తెలియకుండా, ఓ సింగిల్ ఫ్రెండ్ మాత్రం నాలుగు వెడ్డింగ్ డ్రెస్ రీల్స్‌కి లైక్ చేయడం చూసి ఆశ్చర్యపోయిందట.
ఇలాంటి పరిణామాలు యూజర్లను అసహనానికి గురిచేశాయి. కొంతమంది ఈ ఫీచర్‌ను “ఇన్వేసివ్” అంటే ప్రైవసీకి హాని కలిగించేదిగా, మరికొందరు “డయాబాలికల్” అంటే కష్టమైన, ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తున్నారు. ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఇలా కామెంట్ చేశాడు – “ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి ఫ్రెండ్స్ లైక్స్ చూపించడం దారుణం. నాకు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది.”
ఎందుకు తీసుకువచ్చారు..
ఈ ఫీచర్ ఎందుకు తీసుకువచ్చారంటే, ఇన్‌స్టాగ్రామ్ అధిపతి అడమ్ మోసెరి చెబుతున్నట్టుగా – “ఇన్‌స్టాగ్రామ్ అనేది కేవలం చూసి వదిలేసే యాప్ కాదు, మిత్రులతో కలిసి అభిరుచుల్ని పంచుకునే సామాజిక వేదిక కావాలి” అన్నమాట. కానీ ఈ ప్రయత్నం వ్యర్థమైపోయినట్టు కనిపిస్తోంది. చాలా మంది ఈ ఫీచర్ వలన ఇకపై లైక్స్ వేయడమే మానేస్తామని అంటున్నారు. ఎందుకంటే తమ అభిరుచులు ఇతరులకు తెలియడం ఇష్టం లేని వాళ్లే ఎక్కువ. ఇది వలన ప్లాట్‌ఫామ్ ఎంగేజ్‌మెంట్ దారుణంగా పడిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇంకా ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ కూడా ప్రవేశపెట్టింది. అదే Repost ఫీచర్. ఇది ట్విట్టర్ లేదా X లాంటిదే. మీరు నచ్చిన రీల్స్‌కి లేదా ఫొటోలకు రీపోస్ట్ ఆప్షన్ ఉపయోగించి వాటిని మీ ప్రొఫైల్‌లో షేర్ చేయొచ్చు. ఈ రీపోస్ట్స్ ప్రత్యేక ట్యాబ్‌లో ఉంటాయి. దీన్ని “మీ స్వంత Highlights” లా ఉపయోగించవచ్చని సంస్థ చెబుతోంది.
ఇదిలా ఉంటే, X యాప్‌లో ఎలాన్ మస్క్ గతంలో లైక్స్‌ను ప్రైవేట్ చేశారు. ఎందుకంటే, వాదనలు, ట్రోలింగ్, క్యాన్సల్ కల్చర్ వంటివి పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లు ఏమి లైక్ చేస్తున్నారో ఇతరులకు కనిపించకుండా చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. కానీ, ఇన్‌స్టాగ్రామ్ మాత్రం పూర్తిగా విరుద్ధ దిశలో వెళ్తోంది. లైక్స్‌ను మరింత బహిరంగంగా చూపించే ఫీచర్‌ను తీసుకురావడం వినియోగదారుల అభిరుచులకు అనుకూలంగా లేదనే అభిప్రాయం వ్యాపిస్తోంది.
ఈ సెట్టింగ్ చేయండి.. గోప్యతను పాటించండి
అయితే ఈ కొత్త ఫీచర్‌ను ఆపేయాలనుకుంటే, ఒక చిన్న సెట్టింగ్స్ మార్పుతో మీరు గోప్యతను రక్షించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో Settings సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ “Who can see your content” అనే విభాగంలో “Activity in Friends tab” అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని “No one” అనే ఆప్షన్‌కి మార్చేస్తే, ఇక మీ లైక్స్ ఇతరులకు కనిపించవు. ఇది చాలామందికి ఉపశమనం కలిగించే మార్గం.
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు టిక్‌టాక్, ట్విట్టర్ లాంటి యాప్స్ ఫీచర్లను కలిపేస్తూ, ఓ కొత్త దిశలో ప్రయాణిస్తోంది. కానీ ప్రతి ఫీచర్ వినియోగదారుల ఆమోదం పొందుతుందా అనేది పెద్ద ప్రశ్న. సోషల్ మీడియా అనేది వ్యక్తిగత భావాల వేదిక కావాల్సింది, గోప్యతకు హాని కలిగించే వేదిక కాదు. మన అభిరుచులు మనతోనే పరిమితమైతేనే మనం సౌకర్యంగా ఫీలవుతాం. ఈ నేపథ్యంలో, ఇలాంటి ఫీచర్లపై స్పష్టమైన నియంత్రణలు అవసరమయ్యే అవకాశం ఉంది.