Producer Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు(Cine Workers) వేతనాలు పెంచాలి అంటూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఇలా నాలుగు రోజులపాటు కార్మికులు తమకు వేతనాలు పెంచాలి అంటూ షూటింగ్స్ అన్నీ కూడా బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం కాస్త సీనియర్ హీరోల వద్దకు వెళ్ళింది. ప్రస్తుతం కార్మికుల వేతనాలు పెంచే ఆలోచనలు నిర్మాతలు కూడా లేరని స్పష్టం అవుతుంది. నియమ నిబంధనల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సినీ కార్మికులకు వేతనాలు పెంచాలి అయితే మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు సినీ కార్మికులకు వేతనాలు పెంచలేదని , వెంటనే తమకు 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు హాజరు అవుతామని సమ్మె చేస్తున్నారు.
చిన్న సినిమాలతో ఉపాధి…
ఇకపోతే తాజాగా నిర్మాత సి. కళ్యాణ్ (C.Kalyan) కార్మికుల వేతనాల గురించి సమ్మె గురించి మీడియాతో మాట్లాడారు. ఫిలిం ఛాంబర్ లో చిన్న సినిమాల నిర్మాతలతో భేటీ నిర్వహించిన ఈయన ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ నుంచి సుమారు 230 నుంచి 40 సినిమాల వరకు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చిన్న సినిమాల నిర్మాతలు కార్మికులకు వేతనాలు పెంచలేరని ఈయన స్పష్టం చేశారు.
పెద్ద సినిమాలతో మాకు సంబంధం లేదు…
ప్రస్తుతం చిన్న సినిమాలకు చిన్న సినిమాల నిర్మాతలు ఇచ్చే వేతనాలతో పనిచేసే కార్మికులు ఉన్నారని ఈయన వెల్లడించారు. పెద్ద సినిమాల వేతనాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే చిన్న సినిమాల షూటింగులు ఈరోజు నుంచి ప్రారంభించుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ తెలిపారు. చిన్న సినిమాల నిర్మాతలు వారికి ఉన్న బడ్జెట్ తో కార్మికులకు అనుకూల వేతనాలు ఇచ్చి వారు పనులు చేయించుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయాలన్నింటిని కూడా చిన్న నిర్మాతల ప్రతినిధిగా నన్ను వెల్లడించమని చెప్పినట్లు మీడియా సమావేశంలో కళ్యాణ్ తెలియజేశారు.
నిలిచిపోయిన సినిమా షూటింగ్స్…
ఇలా ఫిలిం ఛాంబర్ లో చిన్న సినిమా నిర్మాతలు భేటీ అయి తీసుకున్న ఈ నిర్ణయాలను తమ విధివిధానాల ప్రకారం మా నిర్ణయాన్ని చాంబర్ కు, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు తీసుకెళ్తామని తెలిపారు. పెద్ద సినిమాలకు పని చేసే కార్మికులు మాత్రం తమకు వేతనాలు పెంచితేనే షూటింగ్స్ లోకి అడుగు పెడతాము అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం 30% పెంచడం అంటే కష్టమవుతుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంత మొత్తంలో వేతనాలు పెంచి ఇవ్వలేమని తెలుపుతున్నారు. ఇప్పటికే ఇదే విషయం గురించి మెగాస్టార్ చిరంజీవిని అలాగే బాలకృష్ణ అని కూడా నిర్మాతలు సంప్రదించి పరిస్థితులను వివరించారు. మరి వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికుల సమ్మె విషయంలో ఫెడరేషన్, నిర్మాత మండలి ఏ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయని తెలుస్తోంది.
Also Read: Ntr -Hrithik: ఎన్టీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ పంపిన హృతిక్… అసలైన వార్ అప్పుడే అంటూ తారక్ రిప్లై!