Oneplus Shutdown| ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్ టెక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వన్‌ప్లస్ బ్రాండ్ ఇప్పుడు పెద్ద మార్పుల దశలో ఉందని ఈ రిపోర్ట్ ద్వారా తెలిసింది. వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే మరో కంపెనీలో విలీనం కాబోతోందని సమాచారం. దీంతో వన్‌ప్లస్ తన స్వతంత్ర గుర్తింపును నెమ్మదిగా తగ్గిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ అనే ప్రముఖ టెక్ పబ్లికేషన్ ఈ రిపోర్ట్ విడుదల చేసింది. వన్‌ప్లస్ ఒక్కసారిగా మూసివేయబడుతోందని కాదు. ఇలాగే గతంలో బ్లాక్‌బెర్రీ, నోకియా, ఎల్‌జీ లాంటి బ్రాండ్ల విషయంలో జరిగింది.
2024లో వన్‌ప్లస్ గ్లోబల్ షిప్‌మెంట్స్ గణనీయంగా తగ్గాయి. సుమారు 20 శాతం కంటే ఎక్కువ తగ్గుదల రికార్డ్ అయింది. గతంలో సంవత్సరానికి 17 మిలియన్ ఫోన్లు అమ్ముడయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 13-14 మిలియన్‌కి తగ్గిపోయింది. ఇలా సేల్స్ భారీ స్థాయిలో పడిపోవడం బ్రాండ్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
భారత్ వన్‌ప్లస్‌కు అతి ముఖ్యమైన మార్కెట్. కానీ ఇక్కడ కూడా మార్కెట్ షేర్ తగ్గింది. 6.1 శాతం నుంచి 3.9 శాతానికి దిగివచ్చింది. చైనాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గింది. ఇది హోమ్ మార్కెట్‌లో కూడా డిమాండ్ తగ్గుతోందని చూపిస్తోంది.
అదే సమయంలో ఓప్పో సేల్స్ 2.8 శాతం పెరిగాయి.
రిపోర్ట్ ప్రకారం.. ఓప్పో కంపెనీలో వన్‌ప్లస్ బ్రాండ్ విలీనం జరుగుతోంది. వన్‌ప్లస్‌లోని చాలా కీలక విభాగాలను ఓప్పో నియంత్రిస్తోంది. ప్రొడక్ట్ స్ట్రాటజీ, R&D, మార్కెటింగ్ నిర్ణయాలు ఓప్పో చేతిలో ఉన్నాయి. ఈ కారణాలతో వన్‌ప్లస్ స్వతంత్ర బ్రాండ్‌గా ఇప్పుడు స్వేచ్ఛ తగ్గింది. వన్‌ప్లస్‌కు చెందిన చాలా టీమ్స్ ఇప్పుడు ఓప్పో మేనేజ్‌మెంట్ కింద పనిచేస్తున్నాయి.
చాలా దేశాల్లో వన్‌ప్లస్ బ్రాండ్ తన ప్రెజెన్స్‌ను తగ్గించింది. కొన్ని ప్రాంతాల్లో ఆపరేషన్స్ స్కేల్ డౌన్ చేసింది లేదా ఎగ్జిట్ అయింది.
ప్రాధాన్యత ఉన్న మార్కెట్లపై దృష్టి పెట్టింది. ఇది కాస్ట్ కంట్రోల్, కన్సాలిడేషన్‌కు సంకేతం. కానీ గ్లోబల్ బ్రాండ్ విజిబిలిటీ తగ్గుతోంది.
భారత్ వన్‌ప్లస్‌కు అతి పెద్ద మార్కెట్. వార్షిక సేల్స్‌లో సగం భారత్ నుంచే వస్తుంది. ఇక్కడ ఆపరేషన్స్ సాధారణంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 టాబ్లెట్ లాంచ్ చేసింది. మిగతా దేశాల కంటే భారత్‌లో బలమైన మార్కెటింగ్ కొనసాగుతోంది. ఇటీవల వన్‌ప్లస్ భారతో తన కార్యకలాపాలను నిలిపివేయనుందని మార్కెట్లో అనధికారికంగా సమాచారం వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కంపెనీ సీఈఓ రాబిన్ బ్లూ తెలిపారు. క్రికెటర్లు జస్ప్రిత్ బుమ్రా, స్మృతి మంధాన వంటి సెలబ్రిటీలు ఇప్పటికీ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు.
ఓప్పోలో వన్‌ప్లస్ విలీనం విషయం తెలిసి వారంటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఉన్న యూజర్లకు ఎలాంటి రిస్క్ లేదు. వారంటీ, ఆఫ్టర్-సేల్స్ సర్వీసెస్ కొనసాగుతాయి. ఎక్సిస్టింగ్ డివైసెస్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి. కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికీ డెవలప్ అవుతున్నాయి.
Also Read: బ్యాంక్ అకౌంట్ దోచుకుంటున్న ఈ నకిలి యాప్.. వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి
వన్‌ప్లస్ ఇండియా ఈ రిపోర్టులపై స్పందించింది. ఆండ్రాయిడ్ అథారిటీతో మాట్లాడుతూ భారత్ ఆపరేషన్స్ సాధారణంగా కొనసాగుతున్నాయని చెప్పింది. కంపెనీ పూర్తిగా మూసివేసే ప్లాన్లు లేవని స్పష్టం చేసింది.