Sudden Gamer Death| ఇటీవలే ఒక 13 ఏళ్ల బాలుడు ఫ్రీ ఫైర్ మొబైల్ గేమ్ ఆడుతూ అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో జరిగింది. ఆ బాలుడు తన గదిలో బెడ్ మీద పడుకొని గేమ్ ఆడుతూ ప్రాణాలు వదిలాడు. అతను చనిపోయినట్లు చాలా ఆలస్యంగా గుర్తించారు.
అతని సోదరి అతడిని చూసి నిద్రపోతున్నాడని భావించింది. చాలా సేపు అతను కదలకుండా ఉండడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతడు చనిపోయాడని నిర్ధారించారు. కేవలం లక్నో నగరంలో గత రెండు నెలల్లో గేమింగ్ వల్ల ఇది మూడో మరణం. దీన్ని నిపుణులు సడెన్ గేమర్ డెత్ అని అంటున్నారు.
ఈ దుర్ఘటన “సడన్ గేమర్ డెత్”ను సూచిస్తుంది. సడన్ గేమర్ డెత్ అంటే వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు అనూహ్యంగా జరిగే మరణం. ఈ విధంగా మరణించిన వారి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించవు. గేమింగ్ కారణంగానే చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి కేసులు గత కొంత కాలంగా వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్థలు ఈ సమస్యను గుర్తించాయి. ఇలాంటి కేసులు గేమింగ్ వ్యసనం, ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుపుతోంది.
అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఈ మొబైల్ గేమ్స్ మరణాలపై అధ్యయనం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 24 మరణాలు, వాటి కారణాల గురించి శోధించారు. మొదటి డాక్యుమెంటెడ్ మరణం 1982లో జరిగింది. చాలా కేసులు 2002 నుండి 2021 మధ్య జరిగాయి. బాధితులు చాలామంది పురుషులు. వారి వయసు 11 నుండి 40 ఏళ్ల మధ్య ఉంది. ఈ రీసెర్చ్ గేమింగ్ వల్ల హార్ట్ బీట్ రేట్, బ్లడ్ ప్రెషర్ పెరగడాన్ని చూపించింది.
రిపోర్ట్ చేసిన చాలా కేసులు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో జరిగాయి. సింగపూర్, ఇండోనేషియా, మలేషియాలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. పరిశోధకులు ఈ డేటాను వార్తాపత్రికలు, ఆన్‌లైన్ పోర్టల్‌ల నుండి సేకరించారు. భారతదేశంలో కూడా ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌ల వల్ల.
అధ్యయనం చేసిన పరిశోధకులు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. చాలామంది ప్లేయర్లు సుదీర్ఘంగా గేమ్స్ ఆడుతుంటారు. ఒక్క నిమిషం బ్రేక్ తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా.. చిన్న బ్రేక్‌లు ఏ మాత్రం సహాయపడవు. ఒకే పొజిషన్‌లో చాలా సేపు కూర్చోవడం లేదా పడుకొని గేమ్స్ ఆడడం ఆరోగ్యానికి హానికరం. గేమ్ ఆడటం వల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ పెరుగుతాయి. ఇవే మరణాలకు కారణమవుతాయి.
పరిశోధనలో కొన్ని నిర్దిష్ట కండిషన్‌లను కారణాలుగా చెప్పారు. 24 కేసుల్లో 5 మంది (పల్మనరీ ఎంబోలిజం) ఊపరితిత్తుల్లో సమస్యల వల్ల చనిపోయారు. రెండు కేసుల్లో సెరిబ్రల్ హెమరేజ్ (మెదడులో రక్త స్రావం) వల్ల మరణం జరిగింది. మెదడులో రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరిగింది. మరొక కారణం కార్డియాక్ అరిథ్మియా అంటే అసాధారణ హార్ట్ బీట్. ఇవి గేమింగ్ ఆడే సమయంలో ఒత్తిడి వల్ల జరిగింది.
ఈ మరణాలు గేమింగ్ వ్యసనంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల యాక్టివిటీలను మానిటర్ చేయాలి. గంటల తరబడి బ్రేక్‌లు తీసుకోకుండా ఆడకూడదు. తరుచూ బ్రేక్ తీసుకోవాలి. గేమింగ్ టైమ్‌ను 1-2 గంటలకు పరిమితం చేయండి, వ్యాయామం చేస్తూ ఉండాలి.. తగిన విశ్రాంతి కూడా తీసుకోవాలి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే