Naveen Yadav: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. తండ్రి శ్రీశైలం యాదవ్ ఆశీర్వాదం తీసుకొని నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.
⦿ లోకల్ నినాదంతో దూసుకుపోతున్న నవీన్ యాదవ్..
బీఆర్‌ఎస్ దివంగత మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉపఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ తమ వైపు ప్రజలు ఎక్కువగా సానుభూతి చూపుతారనే నమ్మకం పెట్టుకుంది. అయితే.. కేవలం సానుభూతి పైనే ఆధారపడకుండా.. బీఆర్‌ఎస్ నాయకత్వం తమ ప్రచారంలో ప్రధానంగా ‘నకిలీ ఓట్లు’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కానీ ప్రజలు ఈ అంశాన్ని నమ్మే స్థితిలో లేరు. అధికారులు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనే మాటలకు బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఓవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానిక నినాదంతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ మాత్రం ఎలాంటి ఎదురుదాడి చేయకుండా.. తమ ఓటమి భయాన్ని సూచించే విధంగా ముందస్తు ఆరోపణల వ్యూహాన్ని అమలు చేస్తున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
⦿ నవీన్ యాదవ్‌కు యూత్ సపోర్ట్
నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా పండుగలు, ఇతర సందర్భాలలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన సామూహిక సీమంతాలు వంటి కార్యక్రమాలు మహిళా ఓటర్లలో సానుకూలతను పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యావంతుడైన యువకుడు కావడంతో యువతలో ఆయనకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిగా ఆయనను ఎంపిక చేయడం, బీసీలకు 42% రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం.. సుమారు 1.40 లక్షలు బీసీ ఓటర్లు, దాదాపు లక్ష మైనార్టీ ఓట్లు ఉన్న ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు అని చెప్పవచ్చు.
ALSO READ: జూబ్లీ కింగ్ ఎవరు..? నవీన్ యాదవ్ గెలుపు శాతమెంత..?