Jubilee Bypoll: హైవోల్టేజ్ పొలిటికల్ వార్ కు జూబ్లీహిల్స్ వేదికైంది. మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు ఖరారయ్యారు. ఫైటింగ్ పై క్లారిటీ వచ్చింది. తెరవెనుక రహస్య వ్యూహాలు పదునెక్కుతున్నాయ్. ఒకరిది సెంటిమెంట్ పై ఆశలు, మరొకరిది అభివృద్ధిపై ఆశలు, ఇంకొకరిది వరుస ఓటములపై రివేంజ్ ప్లాన్స్.. ఎవరు నెగ్గుతారు.. బలాబలాలేంటి?
గ్రేటర్‌లో బోణీ కొట్టాలనుకుంటున్న కాంగ్రెస్
జూబ్లీహిల్స్ పోల్ ఈసారి చాలా డిఫరెంట్. సిట్టింగ్ సీటు గెలిచి.. తమ ఇమేజ్ డౌన్ కాలేదు అని కచ్చితంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ ముందు ఉంది. అటు రాష్ట్రమంతా హవా చూపి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. గ్రేటర్ లో మాత్రం బోణీ కొట్టలేదు. సో ఈ జూబ్లీ బైపోల్ లో గెలవడం ద్వారా తమ జైత్రయాత్ర మొదలు పెట్టాలనుకుంటున్నారు. పైగా పార్టీ అధికారంలో ఉండడంతో విక్టరీ కొట్టడం కాంగ్రెస్ కు చాలా ప్రతిష్ఠాత్మకంగా అంతకు మించి సవాల్ గా మారింది. ఇక బీజేపీ కూడా ఎప్పుడూ మూడోస్థానానికే పరిమితం కాకుండా.. ఎఫెక్ట్ చూపించేందుకు వ్యూహాలు మారుస్తోంది. పైగా ఇక్కడ బరిలో ఉన్న ముగ్గురు ప్రధాన అభ్యర్థులు నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి, మాగంటి సునీత స్థానికులే. అందుకే ఈ బైపోల్ వార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉత్కంఠగా మారిపోయింది.
నవంబర్ 11న పోలింగ్, 14న రిజల్ట్
జూబ్లీహిల్స్ లో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న రిజల్ట్ రానుంది. సో టైం చాలా తక్కువగా ఉంది. ఫస్ట్ అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్లస్ మైనస్ లు చూద్దాం. కాంగ్రెస్ కు విక్టరీ చాలా సవాల్ గా మారింది. చాలా కసరత్తుల తర్వాత స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను ఇక్కడ ప్రచారంలో దింపింది. ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది కూడా. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టినా గ్రేటర్‌లో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దారి ఏర్పడుతుందనుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్ లో కథ మార్చాలనుకుంటున్నారు.
బీసీ ఫ్యాక్టర్ పని చేస్తుందని హస్తం ఆశలు
నవీన్ యాదవ్ బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ అభ్యర్థి కావడం ప్లస్ పాయింట్. ప్రస్తుతం తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ ఫ్యాక్టర్ ఎన్నికల్లో పని చేస్తుందని ఆశలు పెట్టుకుంటోంది కాంగ్రెస్. నవీన్ గతంలో రెండు సార్లు ఓడిపోయారన్న సెంటిమెంట్ ఉంది. పైగా అతడు చేసే సేవా కార్యక్రమాలు గట్టెక్కిస్తాయనుకుంటున్నారు. నవీన్ యాదవ్ తండ్రికి ఈ సెగ్మెంట్లో గత 4 దశాబ్దాలుగా బలమైన అనుబంధం ఉంది. కొన్ని రోజులుగా ఈ సెగ్మెంట్లో వరుసగా మంత్రుల పర్యటనలు, భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగడం పాజిటవ్ గా ఉంది. పైగా నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం.. మైనార్టీ వర్గాల సపోర్ట్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వీరి కుటుంబంపై ఉన్న కేసులను ప్రత్యర్థి పార్టీలు అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి లాంటి వాళ్లను ఇప్పటికే బుజ్జగించారు. అయితే వారు ఎంత వరకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారన్నది కీలకంగా మారుతోంది. అటు బీఆర్ఎస్ కు ధీటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవట్లేదన్న టాక్ వినిపిస్తోంది. సో ఈ మైనస్ పాయింట్లను అధిగమిస్తే విజయానికి మరింత దగ్గరవుతారన్న లెక్కలైతే ఉన్నాయి.
ఓట్ చోరీ పాలిటిక్స్, వివిధ వర్గాలు పోటీకి దిగుతామని సవాళ్లు చేస్తుండడం జూబ్లీహిల్స్ బైపోల్ లో హీట్ పెంచుతున్నాయి. ఇక మాగంటి సునీత, అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల వ్యూహాలు, మధ్యలో ఎంఐఎం గేమ్ ఇవన్నీ కీ ఫ్యాక్టర్ అవుతున్నాయి. బీఆర్ఎస్ శకం ముగిందిన్న పాయింట్ ను కాంగ్రెస్ హైలెట్ చేస్తోంది.
పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ల నామినేషన్లు
అన్ని రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ బైపోల్ భవిష్యత్ దిశానిర్దేశంగా ఉంటుందన్న వాదన పెరుగుతోంది. అందుకే అన్ని పార్టీలు శక్తికి మించి పని చేస్తున్నాయి. ఈ బైపోల్ లో ముగ్గురు అభ్యర్థులే కాదు.. ఇండిపెండెంట్ గా చాలా మంది రంగంలో దిగే అవకాశాలు పెరుగుతున్నాయ్. వంద మందికి పైగా పోటీ చేసే చాన్స్ ఉందంటున్నారు. ట్రిపుల్‌ఆర్ రైతులు, ఇతరత్రా భూసేకరణ బాధితులు, గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కొందరు ఇలా చాలా మంది జూబ్లీహిల్స్ బైపోల్ ను వేదికగా చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే 30 మందికి పైగా బరిలో దిగారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అసలైన పోటీదారులపై క్లారిటీ రానుంది.
బూత్ స్థాయిలో వర్కవుట్ చేస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ బూత్ స్థాయిలో వర్కవుట్ చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అజారుద్దీన్, స్థానిక సీనియర్ నాయకులు రహమత్ నగర్ డివిజన్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ శకం ముగిసిందన్నారు. జూబ్లీ హిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
సానుభూతి పవనాలపై సునీత ఆశలు
ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఆమె తన కూతుళ్లతో కలిసి డివిజన్లలో ప్రచారాలు పెంచేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్.. ప్రచారం కోసం 40 లక్షల చెక్కు ఇచ్చి పంపించారు. గత 3 టర్మ్ లో భర్త గెలవడం, ఆయన చేసిన అభివృద్ధి పనులు, చనిపోవడంతో జనంలో సానుభూతి పవనాలపై ఆశలు పెట్టుకున్నారు. సునీత గెలుపు కోసం కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలగాలను బీఆర్ఎస్ మోహరిస్తోంది. సెటిలర్ల ఓట్లు తమకే వస్తాయనుకుంటున్నారు. మరోవైపు బలహీనతలూ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపడం, మాగంటి వర్గీయుల్లో చీలికలు, MIM సపోర్ట్ దూరమవడం వంటివి ఉన్నాయి.
బీఆర్‌ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా గ్రేటర్‌లో మాత్రం పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని గ్రేటర్‌లో అన్ని వర్గాలు తమవైపే ఉన్నాయని నిరూపించుకుంది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న బైపోల్ లో మాగంటి సునీతను గెలిపించుకోవడం ద్వారా తమ పట్టు సడలలేదు అని నిరూపించుకోవాలనుకుంటున్నారు. కేటీఆర్, హరీష్‌రావులు ఇక్కడ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీలోనూ ప్రభావం చూపొచ్చని బీఆర్ఎస్ అనుకుంటోంది. జూబ్లీహిల్స్‌లో జరిగే ఉప ఎన్నిక పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని పదేళ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని కేటీఆర్ డైలాగ్ వార్ పెంచుతున్నారు. అటు ఓట్ చోరీపైనా కౌంటర్లు, ఎన్ కౌంటర్లు నడుస్తున్నాయ్.
తన పనితీరు గెలిపిస్తుందన్న ఆశలో బీజేపీ
అటు అన్ని పార్టీల కంటే లేట్ గా బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మరోసారి లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్ రెడ్డి 26 వేల ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటాయని, మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక వస్తాయన్న ఆశల్లో ఉంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో 48 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. జూబ్లీహిల్స్ లో గెలవడం ద్వారా గ్రేటర్ పీఠానికి మరింత దగ్గరవ్వాలన్న ప్లాన్ తో బీజేపీ ఉంది. అందుకే వ్యూహాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం సానుభూతి కింద కన్వర్ట్ అవుతుందనుకుంటున్నారు. టీడీపీ సపోర్ట్ కూడా ఉంటుందనుకుంటున్నారు. టికెట్ ఆలస్యంగా ప్రకటించడం, అగ్రనేతల పర్యటనలు పెద్దగా లేకపోవడం, బైపోల్ ను సీరియస్ గా తీసుకోవట్లేదన్న ప్రచారం జరగడం మైనస్ గా కనిపిస్తోంది.
Also Read: ర్యాగింగ్ భూతం.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఇంటర్ విద్యార్థులు
సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయ్. ఇక్కడ మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉండగా, బీసీలు, ముస్లింలు కీలక ఓటర్లుగా ఉన్నారు.
Story By Vidya Sagar, Bigtv