రిలయన్స్ జియో సంస్థ ఏది చేసినా సంచలనమే. తాజాగా అలాంటి మరో సంచలన ఆఫర్ తో మన ముందుకొచ్చింది జియో. 11 నెలల మొబైల్ రీచార్జ్ ని కేవలం రూ.895 లకే అందిస్తోంది. అంటే సగటున నెలకు దాదాపు 82 రూపాయలన్నమాట. ఇంత ఆఫర్ ఇస్తోంది అంటే కండిషన్స్ ఏవో పెట్టే ఉంటుందనేకదా మీ అనుమానం. అవును ఈ ప్లాన్ కి కండిషన్స్ అప్లై. అసలు పూర్తి ప్లాన్ ఏంటి.. దానికి ఉన్న నియమ నిబంధనలేంటి..? ఓసారి మీరే చూడండి.
11 నెలల సబ్ స్క్రిప్షన్..
ఉచిత డేటాతో మొబైల్ నెట్ వర్క్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన జియో.. ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరచుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఒక్కసారిగా ఫ్రీ డేటాతో కస్టమర్లందర్నీ తనవైపు తిప్పుకున్న తర్వాత మిగతా ఆపరేటర్ల లాగే జియో కూడా రేట్లు పెంచేసింది. ఓ దశలో జియో మంత్లీ ప్లాన్ల ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంది. తాజాగా మరోసారి జియో ఓ ఆఫర్ ప్రకటించింది. నెల నెలా మొబైల్ రీచార్జ్ కోసం ఇబ్బంది పడకుండా ఒకేసారి 11 నెలల సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం ఈ ప్లాన్ మెయిన్ అట్రాక్షన్. 11 నెలల రీచార్జ్, అది కూడా జస్ట్ రూ.895కే ఇస్తోంది జియో.
ప్రయోజనాలేంటి..?
– అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ)
– ప్రతి 28 రోజులకు 50 ఉచిత ఎస్ఎంఎస్ లు
– ప్రతి 28 రోజులకు 2GB డేటా.. మొత్తం ప్లాన్ లో 24GB డేటా..
ఈ ప్లాన్ వివరాలు పూర్తిగా తెలుసుకుంటే ఇది అందరికీ వర్కవుట్ అయ్యే ప్లాన్ కాదని అర్థమవుతుంది. అవును రోజుకి 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా వాడేవారికి ఇది ఏమాత్రం సరిపోదు. నెలనెలా రీచార్జ్ చేసుకోడానికి ఇబ్బంది పడుతూ, పెద్దగా డేటా వాడకంతో పనిలేని వారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారత్ లో స్మార్ట్ ఫోన్లు వాడేవారితోపాటు, బేసిక్ ఫోన్ల వాడేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారంతా ఉన్నఫళంగా స్మార్ట్ ఫోన్లకు మారే అవకాశం లేదు. సో.. అక్కడున్న మార్కెట్ ని కైవసం చేసుకోడానికి జియో ప్రయత్నిస్తోంది. బేసిక్ ఫోన్ల వినియోగదారులు ఎక్కువగా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పై ఆధారపడుతుంటారు. ఈ మార్కెట్ లో కూడా జియో తన ఆధిపత్యం చెలాయించేందుకు ప్లాన్ వేసింది.
జియో ఫోన్ వాడితేనే..
ఇక ఈ 11 నెలల ప్లాన్ కేవలం జియో ఫోన్ వాడేవారికి మాత్రమే. జియో బేసిక్ మోడల్, జియో భారత్ ఫోన్లు వాడుతున్నవారికి మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అంటే స్మార్ట్ ఫోన్లన్నిటిలో ఈ ప్లాన్ పనిచేయదు. ఇప్పటికే తమ స్మార్ట్ ఫోన్లలో జియో ప్లాన్ వాడుతున్నవారికి కూడా ఈ 11 నెలల ప్లాన్ వర్తించదు.
జియో ప్లాన్ లో ఇన్ని కండిషన్లు ఉన్నా కూడా 11 నెలల బేసిక్ ప్లాన్ రూ.895 లకు మాత్రమే లభించడం విశేషం. అందుకే ఈ ప్లాన్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. జియో ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లను బేస్ చేసుకుని రీచార్జ్ ప్లాన్లు విడుదల చేసింది. తొలిసారిగా బేసిక్ మొబైల్స్ ని టార్గెట్ చేస్తూ 11 నెలల లాంగ్ టర్మ్ ప్లాన్ రిలీజ్ చేసింది.