Let them go: ‘ఉండిపోయే వాళ్లు వచ్చేవరకు.. వచ్చిన వాళ్లందరూ వెళ్లిపోతూనే ఉంటారు’ ఇది ఒక సినిమాలోని డైలాగ్. ఇలాంటి ఫార్ములానే మన నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది అంటున్నారు నిపుణులు. మనకు ఉన్నది ఒకటే జీవితం కాబట్టి.. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి. నచ్చినవాళ్లు వదిలేసి వెల్లారని, వాళ్లనే తలుచుకుని మనసును బాధ పెట్టుకోవడం కంటే.. ప్రశాంతతను, సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోవడమే ఉత్తమం. మనసుకు నచ్చినట్టు జీవించాలంటే.. జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
మీ జీవితంలో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న వాళ్లని ఆపడం వల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు.. ఒక్క బాధ తప్ప. వెళ్లిపోతా అంటున్నవారిని ప్రాధేయపడి జీవితంలో భాగం చేసుకోవద్దని, మిమ్మల్ని అర్థం చేసుకున్నవాళ్లు వదిలేసి వెళ్లిపోరని చెబుతున్నారు సైకాలజిస్టులు. మీ ప్రియమైన వాళ్లు ఒకవేళ వదిలేసి వెళ్లిపోయినా.. మిమ్మల్ని అర్థం చేసుకోలేదని తెలుసుకోండి. అలాంటి వారిని వెళ్లిపోనివ్వడమే మంచిదని సూచిస్తున్నారు.
జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. మన ప్రమేయం లేకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేమని గుర్తుంచుకోవాలి. అలాంటి వాటి గురించి ఆలోచిస్తే ప్రశాంతత కోల్పోతామని, వాటిని అలాగే వదిలేయమని, ఎలాంటి ఫలితాలు వచ్చినా స్వీకరించమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలే మన చేతుల్లో ఉంటాయి. వాటిపైనే మాత్రమే దృష్టిపెట్టాలని వివరిస్తున్నారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్ కొలీగ్స్.. ఇలా ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే.. వెంటనే వాళ్లమీద అరవొద్దు. ఏదో క్షణికావేశంలో మాట్లాడారని అనుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. వారి మాటలు పట్టించుకోకుండా, వదిలేయాలని చెబుతున్నారు. ఇతరులు మాట్లాడే మాటలు, చేతలు మనసుకు తీసుకుంటే మన మనసుకే బాధగా ఉంటుంది.
జీవితంలో కొన్ని పరిస్థితులు, బంధాలు అనుకోకుండానే వస్తుంటాయి. అదే దారిన అనుకోకుండానే వెళ్లిపోతుంటాయి. వాటి గురించి బాధపడుతూ కూర్చుంటే.. మిగిలి ఉన్న జీవితాన్ని కూడా బాధతోనే కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి.. ఆ ఆలోచనలను వదిలేసి, ముందుకు సాగిపోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
లైఫ్‌లో ఎవరు, ఎప్పుడు, ఎలా మారిపోతారో చెప్పలేని పరిస్థితి. అందుకే.. ఎవరిపైనా అతిగా ప్రేమను పెంచుకోవద్దు అంటున్నారు నిపుణులు. ఎలాంటి బంధానికి అయినా హద్దులు పెట్టుకోవాలని, వాటిని దాటి వెళ్తే అవమానపడతారని అంటున్నారు. ఇతరుల గురించి కాకుండా మనపై మనం దృష్టి పెట్టాలని, అందుకు తగిన సమయం కేటాయించుకోవాలని సలహా ఇస్తున్నారు.