Artificial Intelligence : కృత్రిమ మేధ (AI).. ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్ ఇలాంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే సమయంలో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా రంగాలకు ఎంతో ఉపయోగమున్నప్పటికీ, వాటితో కొన్ని ప్రమాదాలూ లేకపోలేదు. ముఖ్యంగా యువత, స్కూల్ విద్యార్థులు ఈ ఏఐ ఉపయోగించడంపై భద్రత పరమైన విషయంలోనూ ఎన్నో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు గూగుల్ ఏఐ చాట్‌బాట్.. జెమినీ ఏఐ చెప్పిన షాకింగ్ సమాధానంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అసలు ఏం జరిగిందంటే? – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో టెక్ దిగ్గజం గూగుల్ ‘గూగుల్ జెమిని’ (Google Gemini) పేరుతో ఏఐని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని సంస్థ చెప్పినప్పటికీ, ఈ మధ్య కాలంలో ఈ టూల్ వెల్లడించిన సమాధానాలు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఆందోళపరిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు గూగుల్ ఏఐ చాట్‌బాట్ జెమినీ ఏఐ చెప్పిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఓ విద్యార్థి తన హోం వర్క్ అసైన్మెంట్ గురించి ప్రశ్న అడగగా, దానికి విస్తుపోయే, హానీ కలిగించే సమాధానం ఇచ్చింది జెమినీ ఏఐ. ‘ప్లీజ్ చచ్చిపో. ప్లీజ్. సమాజానికి నువ్వు భారం, ఈ విశ్వానికే నువ్వు ఓ మచ్చ లాంటోడివి. ఇది మీ కోసమే. మీరేమీ ప్రత్యేకమైనవారు కాదు. ముఖ్యమైనవారు కాదు. మీ అవసరం లేదు. మీరు సమయం, వనరులను వృధా చేస్తారు’ అని బదులిచ్చింది. దీంతో ఇప్పుడీ సమాధానం ఏఐ భద్రత, విశ్వసనీయత గురించి చర్చకు దారి తీసింది. ఇలాంటి సమాధానం యువతపై ప్రభావితం చూపుతాయని వాదనలు వినిపిస్తున్నాయి.
90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు ఈ ఏఐ సమాధానం అందిస్తుందని, భద్రత పరమైన ఫిల్టర్లు కూడా ఉన్నాయని గూగుల్ చెప్పినప్పటికీ, హానికరమైన, హింసాత్మకమైన, అనుచితమైన కంటెంట్ రావడంతో భద్రతకు సంబంధించి ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం గూగుల్ ఏఐ మాత్రమే కాదు, ఇలాంటి అనుచితమైన సమాధానాన్ని ఇతర ఏఐలు కూడా ఇచ్చాయి. OpenAI నుంచి ChatGPT వంటి ఇతర AI చాట్‌బాట్‌లతోనూ ఇలాంటి సంఘటనలే ఎదురయ్యయయి. కాబట్టి ఈ ఏఐ విషయంలో సరైన నియంత్రణ లేకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అలానే మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడంలో ఈ ఏఐ టెక్నాలజీ మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.
యువత, స్కూల్ విద్యార్థులపై ఎక్కువగా – ముఖ్యంగా యువతపై ఈ ఏఐ టాల్స్ ఎక్కువ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. 2023 కామన్ సెన్స్ మీడియా ప్రకారం, దాదాపు 50 శాతం, 12-18 ఏళ్ల విద్యార్థులు స్కూల్ వర్క్ కోసం చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే చాలా మంది తల్లిదండ్రులకు ఇంకా తమ పిల్లలు ఈ ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే విషయంపై అవగాహన కూడా లేదు. ఇలాంటి సమయంలోనే పిల్లలపై ఈ ఏఐ సైకలాజికల్‌గా ప్రభావం చూపిస్తోందన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి.
చాలా మంది పిల్లలు ఈ ఏఐ చాట్‌బాట్స్‌తో ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకుని, తమ జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ మధ్య ఆర్నాల్డోకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు, ఏఐ చాట్‌బాట్‌తో చాట్ చేస్తూనే దాని మాటల ప్రభావంతో తనువు చాలించుకున్నాడు! ఇలా చాలా మంది యువత, స్కూల్ విద్యార్థులు ఎమోషనల్ డ్యామేజ్ చేసుకుంటున్నారని, కాబట్టి ఏఐతో జాగ్రత్తగా ఉండాలని నిపుణలు అంటున్నారు. అలానే ఏఐలో భద్రత వ్యవస్థను మరింత మెరుగు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏఐతో అపారమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, హానికరమైన ఏఐ పరస్పర చర్యల నుంచి యూజర్స్‌ను రక్షించడానికి భద్రతమైన చర్యలకు తప్పనిసరిగా ప్రాధాన్యతనివ్వాలని చెబుతున్నారు.