స్కామర్లు తెలివి మీరిపోయారు. డిజిటల్ అరెస్ట్ ల వంటివి పాతబడిపోయాయి. ఇప్పుడు కొత్తగా మరో స్కామ్ తో వచ్చేస్తున్నారు. అదే స్టిగనోగ్రఫీ స్కామ్. దీనికి వాట్సప్ వేదిక కావడం అత్యంత ఆందోళనకరం. ఎందుకంటే దాదాపుగా స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సప్ ఇన్ స్టాల్ చేసుకుంటారు. అయితే ఈ వాట్సప్ ద్వారా ఇది సులువుగా మన మొబైల్ ఫోన్ లో తిష్ట వేస్తుంది. ఆ తర్వాత మన బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తుంది. ఇదంతా మనకు తెలిసే టైమ్ కి మన బ్యాంకులో డబ్బులు మాయం అవుతాయి. ఇంత తెలిసినా మనం దీన్ని అడ్డుకోలేమా అంటే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ స్కామ్ కి మనం బలికాకుండా ఉండగలం. ఇంతకీ ఈ స్కామ్ ఎలా చేస్తారు, దీని నుంచి మనం రక్షణ పొందడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫొటోలు, వీడియోలు.
వాట్సప్ లో మనకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా ఫొటో పంపిస్తే మనం ఏం చేస్తాం. దాదాపుగా అందరూ ఏంటా అది అని ఓపెన్ చేసి చూస్తారు. మనకెందుకులే అనుకుంటే ఆ మెసేజ్ ని చూడకుండానే డిలీట్ చేస్తారు. కానీ సహజంగా మనుషులకు ఉండే కుతూహలం ఆ ఫొటోని ఓపెన్ చేసేలా చేస్తుంది. ఈ కుతూహలాన్ని అడ్డు పెట్టుకునే స్టిగనోగ్రఫీ స్కామ్ మొదలైంది. వాట్సప్ లో అన్ నోన్ నెంబర్స్ నుంచి వచ్చే ఫొటోలను డౌన్ లోడ్ చేస్తే మాల్ వేర్ మన ఫోన్లో తిష్ట వేస్తుంది. మనం దాని గురించి తెలుసుకునే లోపు అది మన బ్యాంక్ అకౌంట్ ని హ్యాక్ చేస్తుంది. మన ఫోన్ కి వచ్చే ఓటీపీలన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. దీంతో మన బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.
సైబర్ నేరగాళ్లు ఫోటోలు, వీడియోలు లేదా ఇతర ఫైల్స్‌లో మాల్వేర్‌ను పంపించడమే ఈ స్టిగనోగ్రఫీ స్కామ్. ఆ ఫొటోల్ని, లేదా వీడియోలను మనం డౌన్లోడ్ చేస్తే వాటిలో ఉన్న కోడ్ ద్వారా మన ఫోన్లోకి మాల్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత అనర్థం ఆటోమేటిక్ గా జరుగుతుంది. దీనికి విరుగుడు ఏమీ లేదు కానీ, తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లను మనం అడ్డుకుంటే చాలు.
ఆటో డౌన్ లోడ్..
కొంతమంది సెల్ ఫోన్లలో వాట్సప్ అకౌంట్ కి ఆటో డౌన్లోడ్ ఆప్షన్ పెట్టుకుంటారు. అంటే మనకు వచ్చిన ప్రతి ఫొటో, వీడియో, ఆడియో అన్నీ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతాయి. ముందు దీన్ని అన్ చెక్ చేయాలి. వాట్సప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ని అన్ చెక్ చేయాలి. మనకు ఏదైనా మెసేజ్ లు వస్తే మనం డౌన్లోడ్ చేస్తేనే అది డౌన్లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చాలి. ఇక చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు కూడా అనవసర మెసేజ్ ల జోలికి వెళ్లొద్దని వారికి గట్టిగా చెప్పాలి. లేదంటే పిల్లలకు ఫోన్ దొరక్కుండా చూడాలి. ఆయా ఫొటోలను డౌన్లోడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఆ మాల్వేర్ మన ఫోన్లోకి వచ్చేస్తుంది. అదే స్కామర్లకు అడ్వాంటేజ్ గా మారుతుంది. ఆ తర్వాత మన ఫోన్ లోని సమాచారం అంతా అవతలి వ్యక్తికి చేరుతుంది. బ్యాంక్ అకౌంట్ల సమాచారం తెలిస్తే ఖాతా ఖాళీ అవడం ఖాయం.