No Cost EMI| అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సెప్టెంబర్ 23, 2025న ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 22 నుండి కొత్త GST రేట్లు అమలులోకి వస్తాయి. దీనివల్ల ఎలెక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. జిఎస్‌టీ ధరల తగ్గుదలతో ఎలక్ట్రానిక్స్, రోజువారీ అవసరాలు మునుపటి వారాల కంటే చౌకగా కనిపించవచ్చు.
కానీ, ‘నో-కాస్ట్’ EMI డీల్స్‌పై జాగ్రత్తగా ఉండండి. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్.. ధరలను పెంచడానికి ఈ డీల్స్ ను ఒక మార్గంగా ఉపయోగిస్తున్నాయి. ‘నో-కాస్ట్’ EMI అని చెప్పినప్పటికీ, కొన్ని రహస్య ఛార్జీ వల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చెల్లించవలసి రావచ్చు.
అనవసర ఖర్చులు
‘నో-కాస్ట్’ EMIలు షాపింగ్‌ను సౌకర్యవంతంగా మార్చినప్పటికీ, అవి మీరు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు, ఒక గాడ్జెట్‌ను EMIలో కొనడం సులభమని అనిపించవచ్చు, కానీ అది తప్పుడు నిర్ణయం కావచ్చు. ఎందుకంటే ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే మీకు డబ్బు ఆదా అవుతుంది. మీ బడ్జెట్‌లో ఆ గాడ్జెట్ సరసమైన ధరకు లభిస్తుంది. బడ్జెట్‌కు కట్టుబడి ఉండాలనుకునే యూజర్లను ప్రభావితం చేసేందుకే నో కాస్ట్ ఈఎంఐని ఆయుధంగా వినియోగిస్తారు.
యూజర్లకు చెప్పకుండానే ఫీజులు వసూలు
‘నో-కాస్ట్’ EMIలలో దాచిన ఫీజులు ఉంటాయి. బ్యాంకులు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయవచ్చు. కొన్ని కంపెనీలు నో-కాస్ట్ వ్యవధిని పరిమితం చేస్తాయి. ఈ వ్యవధి తర్వాత, మీరు తెలియని లేదా సూక్ష్మంగా ఉండి కనిపించని షరతుల కారణంగా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. అందుకే, ఏదైనా ఈఎంఐ ఒప్పందం చేసే ముందు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. ఏదైనా అనుమానం ఉంటే, పేపర్‌వర్క్ అడగండి. సంతకం చేసే ముందు పూర్తిగా అర్థం చేసుకోండి.
బడ్జెట్‌పై ప్రభావం
EMI చెల్లింపులు చేస్తున్నప్పుడు, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో కొంత భాగం బ్లాక్ అవుతుంది. ఉదాహరణకు, రూ. 40,000 ధర ఉన్న టీవీ కొనుగోలు చేస్తే, ఆ మొత్తం మీ కార్డ్ లిమిట్ నుండి బ్లాక్ అవుతుంది. దీనివల్ల మీ కార్డ్ లిమిట్ తగ్గుతుంది. చెల్లింపు చేయడంలో ఆలస్యం అయితే, ఆలస్య రుసుము, అధిక వడ్డీ రేట్లు విధించబడతాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాక, EMI చెల్లింపులపై సాధారణంగా క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్‌లు లభించవు.
నో-కాస్ట్ EMI ప్రయోజనాలు
మొత్తం ధరను ఒకేసారి చెల్లించలేని వారికి నో-కాస్ట్ EMI ఉపయోగకరం. ఇది చిన్న మొత్తాలలో చెల్లింపులను అనుమతిస్తుంది. అవి సులభంగా ప్రాసెస్ చేయబడతాయి. కొన్ని క్రెడిట్ కార్డ్‌లు నిజమైన డిస్కౌంట్‌లను అందిస్తాయి. అయితే, EMIలకు కట్టుబడే ముందు దాని రిస్క్‌లను జాగ్రత్తగా పరిశీలించండి. మీ బడ్జెట్‌లో ఈ చెల్లింపులు సరిపోతాయా? లేదా? అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
సేల్ సమయంలో స్మార్ట్ షాపింగ్
పండుగ సేల్స్ సమయంలో తక్కువ ధరలు, మంచి ఆఫర్లతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నో-కాస్ట్ EMI మీ ఖర్చులను తగ్గించవచ్చని మీరు భావించవచ్చు, కానీ దాని వల్ల దాగి ఉన్న ఖర్చులు త్వరగా పేరుకుపోతాయి. కొనుగోలు చేసే ముందు మీ బడ్జెట్ పై శ్రద్ధ వహించండి. చెల్లింపులు చేయగల సామర్థ్యం ఉందని నిర్ధారించుకోండి, ధరలను సరిపోల్చండి. షరతులను పూర్తిగా అర్థం చేసుకోండి. స్మార్ట్ షాపింగ్‌తో దీర్ఘకాలంలో డబ్బు ఆదా చేయడంతో మీ క్రెడిట్ అలవాట్లకు మేలు చేస్తుంది.
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి