Kashibugga: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 15లక్షల ఎక్స్‌గ్రేషియో.. తీవ్ర గాయాలైన వారికి 3లక్షల పరిహారం.. చనిపోయిన వారి అంత్యక్రియలకు 10వేల రూపాయలు ఇస్తామన్నారు నారా లోకేష్. ఘటనపై విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఆలయం నాలుగు నెలల కిందటే ప్రారంభమైందని నారా లోకేష్ వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా పలాసకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. నేరుగా కాశీబుగ్గ ఆలయానికి వెళ్లి తొక్కిసలాట ప్రాంతాన్ని పరి శీలించారు. ప్రమాదం వివరాలను సంబంధిత అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లోకేష్‌తోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత కూడా కాశీబుగ్గ ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం పలాస ఆసుపత్రికి చేరుకున్నారు నారా లోకేష్. ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను పరామర్శించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.
అంతకుముందు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.. హృదయ విదారక ఘటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేంద్రం 2లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించిందని చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు గౌతు శిరీష.
మరోవైపు 12 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. బాధిత కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించా రు. కాశీబుగ్గ ఘటనలో 12 మంది చనిపోయారని.. 13 మంది గాయపడ్డారని కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఘటనలో గాయ పడ్డ వారికి పలాస ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతోంది.