Hyderabad Crime: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో యువతి(22) మృతదేహం కలకలం రేపుతోంది. లేక్ పోలీసుల వివరాల ప్రకారం.. హుస్సేన్ సాగర్ లో గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతున్న విషయాన్ని ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని యువతి మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. యువతి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. యువతి ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ యువతి ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపుతుంది. నవీపేట మండలంలోని ఫకీరాబాద్ మిట్టాపూర్ లో తల లేని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాసర మెయిన్ రోడ్డుకు సమీపంలో నగ్నంగా మహిళ మృతదేహం పడి ఉంది. మహిళ చేయి, చేతి వేళ్లు, తల తొలగించి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఆ మహిళ ఎవరు? డెడ్‌బాడీ నగ్నంగా ఉండటంతో అత్యాచారం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగ్నంగా మహిళ మొండెం మాత్రమే దొరకడంతో ఆమె తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగ్నంగా తలలేకుండా మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Road Accident: స్కూటీని ఢీకొట్టిన లారీ.. డ్యాన్సర్ మృతి