Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారిన వేళ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు ఖాయమని ప్రముఖ సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో నవీన కుమార్ కు మద్ధతుగా నటుడు సుమన్ ప్రచారం నిర్వహించారు.
గెలుపుపై హీరో సుమన్ ధీమా
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నవీన్ కుమార్ యాదవ్ గెలుపుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానికంగా కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ, మద్దతు అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. ‘కాంగ్రెస్ అభ్యర్థికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వారి విజయం పట్ల నాకు ఎలాంటి డౌట్’ అని సుమన్ వ్యాఖ్యానించారు.
ప్రచారంలో చురుకుగా పాల్గొన్న సుమన్
నిజానికి.. హీరో సుమన్ గత కొంతకాలంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ అభ్యర్థికి మద్దతుగా ఓటర్లకు చేరువ అవుతున్నారు. ఈ సందర్భంగానే ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీస్తున్న గాలి ఈ విజయాన్ని మరింత సులభతరం చేస్తాయని సుమన్ చెప్పుకొచ్చారు.
నటుడు సుమన్ మాటలు నిజం కానున్నాయా..?
ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్న ఈ తరుణంలో.. సినిమా గ్లామర్ ఉన్న సుమన్ వంటి వ్యక్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా.. రావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. సుమన్ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హీరో సుమన్ మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే..ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.