Oneplus Arrest Warrant: చైనా పొరుగు దేశమైన తైవాన్ లో అక్కడి ప్రభుత్వం.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్‌కు పెద్ద ఇబ్బంది తెచ్చిపెట్టింది. వన్‌ప్లస్ కంపెనీ కో-ఫౌండర్, సీఈఓ పీట్ లావ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్లూమ్‌బెర్గ్ మీడియా రిపోర్ట్ ప్రకారం తైవాన్ ప్రభుత్వం వన్‌ప్లస్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యకు ఆదేశించింది. తైవాన్ ఇంజినీర్లను, టెక్నాలజీ నిపుణులను చట్టవిరుద్ధంగా నియమించిన ఆరోపణలతో ఈ వారెంట్ జారీ అయింది.
తైవాన్‌లోని షిలిన్ జిల్లా ప్రాసిక్యూటర్లు వన్‌ప్లస్ కంపెనీలో ఉన్నతాధికారుల నియామకాలపై దర్యాప్తు చేశారు. దాదాపు 70 మంది తైవాన్ ఇంజినీర్లను సరైన అనుమతి లేకుండా నియమించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చైనా టెక్ కంపెనీలు తైవాన్‌లో అనధికారికంగా నియామకాలు చేయకుండా కఠిన చట్టాలు ఉన్నాయి. ఇలాంటి నియామకాలు తైవాన్ జాతీయ భద్రతకు, టెక్నాలజీ స్వాతంత్ర్యానికి త్య్రానికి ముప్పుగా భావిస్తున్నారు.
ప్రపంచ సెమీకండక్టర్ సప్లై చైన్‌లో చాలా ముఖ్యమైన స్థానంలో తైవాన్ ఉంది. స్మార్ట్‌ఫోన్లు, కార్లు, కంప్యూటర్లు, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ అన్నింటికీ తైవాన్ చిప్ టెక్నాలజీ అవసరం. తైవాన్ ఇంజినీర్లకు చిప్ డిజైన్, తయారీలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. చైనా కంపెనీలు ఈ నైపుణ్యం ఉన్నవారిని పొందాలని ఎక్కువగా ప్రయత్నిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా తైవాన్ చైనా నియామకాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. గత సంవత్సరం 11 చైనా టెక్ కంపెనీలపై దర్యాప్తు చేసి 34 చోట్ల దాడులు జరిపారు. ఈ కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా రహస్యంగా తైవాన్ ఇంజినీర్లను నియమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. SMIC అనే చైనాకు చెందిన అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంది.
దర్యాప్తు చేసిన అధికారుల ప్రకారం.. తైవాన్ వర్కర్లను పరోక్షంగా లేదా అనధికారిక మార్గాల్లో వన్‌ప్లస్ నియమించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పీట్ లావ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు తైవాన్ పౌరులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నియామక విధానం గురించి పూర్తి వివరాలు ఇంకా బయటపెట్టలేదు. ఈ కేసు ఇప్పటికీ దర్యాప్తు దశలో ఉంది.
వన్‌ప్లస్ కంపెనీ సీఈఓ పీట్ లావ్ మీడియా ప్రశ్నలకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ విషయంపై అంతర్జాతీయ దృష్టి పెరిగినా కంపెనీ నిశ్శబ్దంగా ఉంది. చట్ట నిపుణులు తైవాన్ అధికారులు మరిన్ని చర్యలు తీసుకుంటే ఇంకా పరిణామాలు ఉండవచ్చని అంటున్నారు.
Also Read: గూగుల్ మెయిల్‌లో స్పామ్ మెయిల్స్ సమస్య.. శాశ్వత పరిష్కారం ఇదే
గత కొన్నేళ్లలో వన్‌ప్లస్ ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వేగంగా వృద్ధి చెందింది. భారతదేశంలో అనేక ఇతర దేశాల్లో ఈ బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. ప్రీమియం డిజైన్, అద్భుతమైన పనితీరుతో పీట్ లావ్ గుర్తింపు పొందాడు. ఈ వివాదం వన్‌ప్లస్ అంతర్జాతీయ ఇమేజ్‌పై ప్రభావం చూపవచ్చు.
చాలా సంవత్సరాలుగా చైనా, తైవాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయి. తైవాన్ భూభాగమంతా చైనా తన దేశ భూభాగమని చాలా కాలంగా వాదిస్తోంది. కానీ తైవాన్ స్వతంత్రంగా పనిచేస్తోంది. తరుచూ తైవాన్‌పై దాడి చేసి ఆక్రమించుకుంటామని హెచ్చరిస్తూ తైవాన్ చుట్టూ ఉన్న సముద్రంలో సైనిక డ్రిల్స్ చేపడుతూ ఉంటుంది. కానీ తైవాన్ పై దాడులు చేయవద్దని చైనాకు అమెరికా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టెక్నాలజీ, టాలెంట్ భద్రత ఈ రాజకీయ వివాదంలో కీలకంగా ఉన్నాయి.