Shabarimala Swami AI Chatbot : కేరళ అన్నామలై కొండల్లో కొలువైయున్న అయ్యప్ప స్వామి దర్శనానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతిగాంచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటా కోట్లాది మంది భక్తులు ఈ స్వామి వారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి పోటెత్తుతారు. ఇక ఈ కార్తీకమాసంలో అయ్యప్ప మాలధారుల తాకిడి శబరిమలలో విపరీతంగా ఉంటుంది. అయితే గత ఏడాది విపరీతంగా వచ్చిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించటంలో కేరళ ప్రభుత్వం విఫలమైందనే వార్తలు గట్టిగా వినిపించాయి. వీటికి తోడు పలు వివాదాలు సైతం తలెత్తడంతో ప్రస్తుతం కేరళా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భక్తుల సౌకర్యార్థం ముందస్తు ఏర్పాట్లు చేస్తూ కొన్ని ప్రత్యేక బుకింగ్ యాప్స్ తో పాటు మరెన్నో సదుపాయాలను తీసుకొచ్చింది. అవి ఏంటంటే..
శబరిమలలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఉచితంగా వైఫై ను అందించేందుకు (BSNL Free Wi-Fi in Sabarimala) ముందుకు వచ్చింది. ఇందుకోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుతో కలిసి బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుంది. భక్తుల కోసం పంపా, నీలక్కల్, సన్నిధానం వంటి ప్రధాన కేంద్రాల్లో Wi-Fi హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసింది.
హాట్ స్పాట్, మెుబైల్ టవర్స్ –
పంపాలో 13 హాట్‌స్పాట్ కేంద్రాలు, నీలక్కల్‌లో 13 హాట్‌స్పాట్ కేంద్రాలు ఏర్పాటు చేయటంతో పాటు స్వామి వారి సన్నిధిలో 22 హాట్‌స్పాట్‌లను BSNL ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లోని భక్తులు OTP ద్వారా ఈ ఉచిత వైఫైను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇక శబరిమలకు వచ్చే మార్గాల్లో సైతం 21 మొబైల్ టవర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయ్యప్ప మాలధారుల సౌకర్యార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఉచిత వైఫైకు ఎలా కనెక్ట్ చేయాలి –
బీఎస్ఎన్ఎల్ వైఫైను ఉచితంగా కనెక్ట్ చేసుకోవడం కోసం ముందుగా ఆయా ప్రాంతాల్లోని BSNL నెట్‌వర్క్ హాట్‌స్పాట్‌లను ఎంచుకోవాలి. అనంతరం మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ నంబర్‌కు OTP వస్తుంది. OTP ను ఎంటర్ చేశాక.. వైఫై కనెక్ట్ అవుతుంది. 30 నిమిషాలపాటు భక్తులు ఈ వైఫైను ఉచితంగా వినియోగించుకోవచ్చు. అనంతరం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్వామి చాట్‌బాట్ –
శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వామి చాట్‌బాట్ స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆరు భాషల్లో భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఇక ఈ చాట్ బాట్ తెలుగు, తమిళం, ఇంగ్లీష్, హిందీ,మలయాళం, కన్నడ భాషల్లో ఉండనుంది. ఇక అయ్యప్ప స్వామే స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్‌బాట్‌ను రూపొందించారు. అయ్యప్ప సన్నిధానంలో పూజా సమాచారం, రైళ్లు, విమానాలు, పోలీసు, అటవీ శాఖ సేవలను ఈ చాట్‌బాట్ తో పొందే అవకాశం ఉంది.
వాతావరణ విభాగం కేంద్రాలు –
శబరిమలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న భారత వాతావరణ విభాగం.. భక్తులను అప్రమత్తం చేసేందుకు వీలుగా మూడు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ALSO READ : వాడేసిన ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే నష్టపోతారు మరి